పై మెరుపులు చూసి మోసపోవద్దు.. మంచి సీతాఫలాలను ఇలా ఈజీగా గుర్తించండి..

మార్కెట్‌లో సీతాఫలాల సీజన్ మొదలైంది.. తియ్యటి రుచి, బోలెడన్ని పోషకాలు ఉండే ఈ పండ్లను కొనడానికి ప్రతి ఒక్కరూ ఎగబడుతుంటారు. అయితే ఎంత రేటు పెట్టి కొన్నా.. ఇంటికి తెచ్చాక అవి పచ్చిగానో లేదా లోపల కుళ్లిపోయి చప్పగానో ఉంటే పెట్టిన డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరే. మరి చెట్టుపై సహజంగా పండిన, తేనెలాంటి తీపి సీతాఫలాలను ఎలా గుర్తుపట్టాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

పై మెరుపులు చూసి మోసపోవద్దు.. మంచి సీతాఫలాలను ఇలా ఈజీగా గుర్తించండి..
How To Identify Sweet Custard Apples

Updated on: Oct 22, 2026 | 9:11 PM

చలికాలం ప్రారంభంలో నోరూరించే పండ్లలో సీతాఫలం మొదటి వరుసలో ఉంటుంది. మార్కెట్‌లోకి ఈ తియ్యని పండ్లు రాగానే ధర కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ జనం కొనుగోలు చేయడానికి ఎగబడుతుంటారు. అయితే సీతాఫలాలను ఎంచుకోవడంలో సరైన అవగాహన లేకపోతే డబ్బులు వృథా కావడమే కాకుండా కాయలు లేదా లోపల పాడైపోయిన పండ్లు ఇంటికి చేరే ప్రమాదం ఉంది. వ్యాపారులు పచ్చి కాయలు, పండిన పండ్లను కలిపి అమ్ముతుంటారు కాబట్టి, కొనే సమయంలో కొన్ని సింపుల్ ట్రిక్స్ పాటిస్తే తియ్యటి, నాణ్యమైన సీతాఫలాలను సులభంగా ఎంచుకోవచ్చు. ప్రధానంగా సీతాఫలం నాణ్యతను గుర్తించడానికి మొదటి మార్గం దాని రంగు. సహజంగా బాగా పండిన నాణ్యమైన సీతాఫలం లేత ఆకుపచ్చ లేదా కొద్దిగా పసుపు-తెలుపు చారలతో కూడిన రంగులో కనిపిస్తుంది. ఒకవేళ పండు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటే అది ఇంకా పండలేదని, కాయ దశలోనే ఉందని గుర్తించాలి.

కళ్ల మధ్య ఖాళీలు – తాకి చూడటం

పండు పైభాగంలో ఉండే గళ్లు విచ్చుకుని, వాటి మధ్య తెల్లటి లేదా పసుపు రంగు చారలు స్పష్టంగా కనిపిస్తుంటే అది చెట్టుపైనే సహజంగా పక్వానికి వచ్చినట్లు లెక్క. కొనే సమయంలో పండును చేతిలోకి తీసుకుని సున్నితంగా నొక్కి చూడాలి. అది కొద్దిగా మెత్తగా అనిపిస్తే వెంటనే తినడానికి సిద్ధంగా ఉన్నట్లు. రాతిలా గట్టిగా ఉంటే అది కాయ అని అర్థం. అయితే మరీ ఎక్కువగా మెత్తబడి నల్లటి మచ్చలు ఉంటే లోపల కుళ్లిపోయే అవకాశం ఉందని గ్రహించాలి.

తీపి సువాసన

సహజంగా మాగిన సీతాఫలానికి ఒక ప్రత్యేకమైన తీపి సువాసన ఉంటుంది. ఆ పండ్ల బుట్ట దగ్గరకు వెళ్లగానే ఆ పరిమళం ఇట్టే తెలిసిపోతుంది. కృత్రిమంగా మగ్గబెట్టిన లేదా లోపల చెడిపోయిన పండ్లకు సహజమైన తీపి వాసన ఉండదు.

బరువును సరిచూసుకోండి

సీతాఫలం బరువును బట్టి కూడా అది పండిందా లేదా అనేది చెప్పవచ్చు. పచ్చిగా ఉన్న కాయలు బరువు ఎక్కువగా ఉంటాయి. పండు పక్వానికి వచ్చేకొద్దీ తేమ తగ్గి లోపల గుజ్జు మెత్తబడి బరువు కాస్త తేలికగా అనిపిస్తుంది.

సీతాఫలంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

రోగనిరోధక శక్తి పెంపు: ఇందులో విటమిన్-సి, విటమిన్-బి6, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలో రోగనిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది.

ఎముకల బలం: ఐరన్, కాల్షియం, మెగ్నీషియం సమృద్ధిగా లభించడం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి.

జీర్ణక్రియ మెరుగుదల: పుష్కలమైన పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

మెదడు ఉల్లాసం: ఇందులోని విటమిన్-బి6 మెదడులో సెరోటోనిన్, డోపమైన్ వంటి హ్యాపీ హార్మోన్ల విడుదలకు తోడ్పడి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us