
సుగంధ ద్రవ్యాల్లో మసాలాల రాణిగా పిలువబడే ఇలాచీలకు భారతీయ వంటింట్లో ప్రత్యేక స్థానం ఉంది. పాయసం, బిర్యానీ, మసాలా టీ ఇలా ఏ వంటకమైనా చిటికెడు యాలకుల పొడి పడితే ఆ రుచే వేరు. కేవలం సువాసన, రుచి మాత్రమే కాకుండా ఇందులో జింక్, పొటాషియం, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మార్కెట్‌లో అత్యంత ఖరీదైన ఈ మసాలా దినుసును మనం ఇంటి పెరట్లో లేదా బాల్కనీలో ఒక చిన్న కుండీలోనే సులభంగా పెంచుకోవచ్చు. ఇంట్లోనే సహజసిద్ధంగా యాలకుల మొక్కను ఎలా పెంచవచ్చో తెలుసుకోవడ ముఖ్యం.
యాలకుల మొక్కను రెండు పద్ధతుల్లో పెంచుకోవచ్చు. నర్సరీల నుంచి నేరుగా నారు మొక్కలను తెచ్చుకుని నాటుకోవడం ఒక పద్ధతి అయితే విత్తనాల ద్వారా పెంచడం రెండో విధానం. విత్తనాల ద్వారా పెంచాలనుకుంటే మార్కెట్ నుంచి రసాయనాలు లేని పచ్చి, తాజా యాలకులను ఎంపిక చేసుకోవాలి. కాయల పైపొట్టు తీసి విత్తనాలను శుభ్రంగా కడగాలి. మొలకల శాతం పెరిగేందుకు ఈ విత్తనాలను ఒక రోజంతా నీటిలో నానబెట్టాలి.
యాలకుల మొక్క ఏపుగా పెరగడానికి నీరు నిల్వ ఉండని నేల ఎంతో అవసరం. సాధారణ తోట మట్టితో పాటు సమాన పాళ్లలో ఇసుక, కోకోపీట్, వర్మీ కంపోస్ట్ కలిపి కుండీని సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమం వల్ల మట్టి తేలికగా మారి వేర్లకు గాలి ఆడుతుంది. నీరు వేర్ల వద్ద నిలవకుండా బయటకు పోయేలా కుండీ అడుగున రంధ్రం ఉండేలా చూసుకోవాలి.
నానబెట్టిన విత్తనాలను ముందుగా చిన్న ట్రే లేదా కప్పులో మట్టిపై చల్లి, వాటిపై పలుచగా మట్టి పొరను పరవాలి. విత్తనాలను మరీ లోతుగా నాటకూడదు. తేలికపాటి తేమ ఉండేలా రోజూ నీళ్లు చల్లుతూ, కొద్దిగా ఎండ, ఎక్కువ నీడ ఉండే ప్రదేశంలో ఉంచాలి. కొన్ని వారాల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. మొక్క 3 నుంచి 4 అంగుళాల ఎత్తు పెరిగాక దానిని పెద్ద కుండీలోకి మార్చుకోవాలి. సుమారు 30 నుంచి 40 రోజుల తర్వాత మొక్క కొత్త కొమ్మలతో దట్టంగా మారడం ప్రారంభిస్తుంది.
యాలకుల మొక్కలకు చల్లని, తేమతో కూడిన వాతావరణం బాగా సరిపోతుంది. వీటిని నేరుగా తీవ్రమైన ఎండ తగిలే చోట ఉంచకూడదు. ఎండ తీవ్రత తక్కువగా ఉండే బాల్కనీలలో లేదా పెద్ద చెట్ల నీడలో కుండీలను ఉంచడం మంచిది.
యాలకుల మొక్క ఏడాది పొడవునా పచ్చగా ఉండి ఇంటికి అందాన్ని ఇస్తుంది. అయితే ఇది చాలా నెమ్మదిగా పెరిగే మొక్క. నాటిన తర్వాత పువ్వులు పూసి, కాయలు కాయడానికి సాధారణంగా రెండు నుంచి నాలుగేళ్ల సమయం పడుతుంది. సరైన తేమ, సేంద్రియ పోషకాలు అందిస్తూ కాస్త ఓపికతో సంరక్షిస్తే.. ఎలాంటి రసాయనాలు లేని స్వచ్ఛమైన, సువాసనభరితమైన యాలకులను మన ఇంట్లోనే కోసుకోవచ్చు.