ఇంట్లో ఎలుకల గోల.. ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే మీ దరిదాపుల్లోకి మళ్లీ రావు..

చిన్న ఎలుక ఇంట్లో ఉంటే.. అది చేసే నష్టం అంతా ఇంతా కాదు.. బట్టలు, వైర్లు, ఆహారం ఏదైనా సరే.. ఎలుక చేతికి చిక్కితే చిందరవందర కావాల్సిందే. అయితే ఎలుకల మందులు వాడటం వల్ల ప్రాణాపాయం ఉండే అవకాశం ఉంది. మరి ఇంట్లోని చిన్న పిల్లలకు, పెంపుడు జంతువులకు ఎలాంటి హాని లేకుండా, కేవలం వంటింటి చిట్కాలతో ఎలుకలను ఎలా తరిమికొట్టాలో తెలుసుకుందాం..

ఇంట్లో ఎలుకల గోల.. ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే మీ దరిదాపుల్లోకి మళ్లీ రావు..
How To Get Rid Of Rats Naturally

Updated on: May 08, 2026 | 1:43 PM

ఇంట్లో పిల్లల అల్లరినైనా భరించవచ్చేమో కానీ, ఎలుకల అలజడిని భరించడం ఎవరికైనా కష్టమే. ఒక్కసారి ఒక్క ఎలుక ఇంట్లోకి ప్రవేశించిందంటే చాలు.. అది తనతో పాటు ఒక సైన్యాన్నే తయారు చేసుకుంటుంది. ఆహార పదార్థాలను తినడం కంటే ఎక్కువగా పాడు చేయడం, ఖరీదైన బట్టలను ముక్కలుగా కొరకడం, టీవీ వైర్లను తెంపేయడం వంటి పనులతో భారీ నష్టాన్ని కలిగిస్తాయి. వీటికి తోడు ఎక్కడ పడితే అక్కడ మలవిసర్జన చేస్తూ వ్యాధులను కూడా వ్యాపింపజేస్తాయి. మార్కెట్లో దొరికే ఎలుకల మందులు లేదా రసాయనాలు వాడటం వల్ల ఎలుకలు చనిపోయినా, అవి ఎక్కడో మూలన పడి కుళ్లిపోయి ఇల్లంతా దుర్వాసన వస్తుంటాయి. అలాగే ఇంట్లో చిన్న పిల్లలు లేదా పెంపుడు జంతువులు ఉన్నప్పుడు ఈ విషపూరిత మందులు వాడటం ఏమాత్రం సురక్షితం కాదు. మరి ఇలాంటి సమయంలో వంటింట్లో దొరికే సహజసిద్ధమైన వస్తువులతో ఎలుకలను ఎలా వెళ్లగొట్టాలో కథనంలో తెలుసుకుందాం.

పుదీనా: ఎలుకల దరిదాపుల్లోకి రానివ్వని ఘాటు

మనుషులకు పుదీనా సువాసన ఆహ్లాదాన్ని కలిగిస్తే, ఎలుకలకు మాత్రం అది ఒక భయంకరమైన వాసన. ఎలుకల శ్వాసకోశ వ్యవస్థ పుదీనాలోని మెంథాల్ ఘాటును భరించలేదు. కొన్ని దూది ఉండలను తీసుకుని వాటిపై నాలుగైదు చుక్కల పుదీనా నూనె వేయండి. వీటిని ఎలుకలు వచ్చే రంధ్రాల దగ్గర, వంటగది మూలల్లో, స్టోర్ రూమ్ కిటికీల వద్ద ఉంచండి. ఈ వాసన ఉన్న చోట ఎలుకలు అసలు నిలబడలేవు. మీ దగ్గర నూనె అందుబాటులో లేకపోతే, తాజా పుదీనా ఆకులను మెత్తగా నలిపి ఆ ముద్దలను కూడా వాడవచ్చు.

ఎర్ర మిరప పొడి

వందల ఏళ్లుగా వాడుతున్న పాత కాలపు చిట్కా ఇది. మిరప పొడిలోని ఘాటు ఎలుకల కళ్లలో మరియు ముక్కులో తీవ్రమైన మంటను కలిగిస్తుంది. మీ ఇంట్లో ఎలుకల బొరియలు లేదా రంధ్రాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి, వాటి ద్వారం వద్ద కొద్దిగా ఎర్ర మిరప పొడిని చల్లండి. ఈ పద్ధతిని వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. గాలికి ఆ పొడి ఇల్లంతా వ్యాపించకుండా చూడాలి. అలాగే, చిన్న పిల్లలు ఆ ప్రాంతానికి వెళ్లకుండా జాగ్రత్త వహించాలి. వరుసగా రెండు మూడు రోజులు ఇలా చేస్తే ఎలుకలు ఆ దారిని శాశ్వతంగా మర్చిపోతాయి.

ఉల్లిపాయ ముక్కలు: తక్కువ ఖర్చుతో పవర్‌ఫుల్ పరిష్కారం

ఉల్లిపాయ నుంచి వెలువడే ఘాటైన వాయువులు ఎలుకలకు అస్సలు పడవు. ఉల్లిపాయ వాసన వస్తుంటే ఆ ప్రదేశంలో ఎలుకలు ఉండటానికి ఇష్టపడవు. ఒక ఉల్లిపాయను తీసుకుని పెద్ద ముక్కలుగా కోయండి. ఎలుకలు ఎక్కువగా తిరుగుతున్నాయని మీరు భావించే అల్మరాలు, సోఫా వెనుక భాగం లేదా కబోర్డుల కింద ఈ ముక్కలను ఉంచండి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా కుళ్ళిపోతాయి కాబట్టి, ప్రతి రోజూ లేదా రెండు రోజులకు ఒకసారి పాత ముక్కలను తీసేసి కొత్తవి పెడుతూ ఉండాలి. లేదంటే ఆ వాసన మీకే ఇబ్బందిగా మారవచ్చు.

ఎలుకల బెడద మళ్లీ రాకుండా ఉండాలంటే..

చిట్కాలు పాటించడంతో పాటు కొన్ని నివారణ చర్యలు కూడా ముఖ్యం:

ఆహారం జాగ్రత్త: ఆహార పదార్థాలను గాలి చొరబడని డబ్బాల్లో ఉంచండి. బయట ఆహారం దొరక్కపోతే ఎలుకలు ఆటోమేటిక్‌గా ఇంటిని వదిలి వెళ్తాయి.

పరిశుభ్రత: రాత్రి పూట వంటగదిని శుభ్రంగా ఉంచుకోండి. సింక్‌లో ఎంగిలి పాత్రలు లేకుండా చూసుకోండి.

రంధ్రాలను పూడ్చండి: ఇంటి గోడలకు లేదా తలుపులకు ఉన్న సన్నటి రంధ్రాలను సిమెంట్ లేదా మెటల్ మెష్‌తో పూడ్చేయండి.

 

Follow Us