రుచికి రుచి బలానికి బలం.. రోజూ ఒక్క లడ్డూ తింటే.. ఇక ఆరోగ్యానికి తిరుగులేనట్టే!

మీకు ఏదైనా స్వీట్ తినాలని ఉందా.. నార్మల్‌గా కాకుండా ఈ సారి కొత్త రకం సున్నుండలు ట్రై చేయండి. ఇవి టేస్ట్‌తో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివి.. వీటిని ఇంట్లోనే పెద్దగా కష్టపడకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో.. స్టెప్ బై ప్టెప్ ఇక్కడ వివరంగా తెలుసుకుందాం పదండి.

రుచికి రుచి బలానికి బలం.. రోజూ ఒక్క లడ్డూ తింటే.. ఇక ఆరోగ్యానికి తిరుగులేనట్టే!
Sunnundalu Recipe

Updated on: Sep 12, 2026 | 1:40 PM

సున్నుండలు భారతీయ సంప్రదాయంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, పండుగలకు, ప్రత్యేక సందర్భాలకు తయారుచేసే ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన పిండివంటకం. అయితే వీటిని రెగ్యులర్ స్టైల్‌లో కాకుండా కాస్త టేస్టీగా, ఆరోగ్య కరంగా డ్రై ఫ్రూట్స్, పెసరపప్పు వంటి పోషక విలువలున్న పదార్థాలతో కలిపి ఇంట్లోనే సులభంగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూద్దాం.

సున్నుండలకు కావాల్సిన పదార్థాలు:

  • మినప్పప్పు: 2 కప్పులు
  • పెసరపప్పు: అర కప్పు
  • బియ్యం: 1 టేబుల్ స్పూన్
  • బాదం పప్పు: అర కప్పు
  • జీడిపప్పు: అర కప్పు
  • బెల్లం తురుము: 1.5 కప్పులు
  • నెయ్యి: 1 కప్పు
  • యాలకులు: 6-7

సున్నుండల తయారీ విధానం

ముందుగా ఒక పాన్‌ను స్టవ్‌పై పెట్టి, రెండు కప్పుల మినప్పప్పును లో-మీడియం మంటపై దోరగా వేయించుకోవాలి. మినప్పప్పు రంగు మారి, సువాసన వచ్చేంత వరకు వేయించాలి కానీ మాడనివ్వకూడదు. వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకుని చల్లారనివ్వాలి. అదే పాన్‌లో అర కప్పు పెసరపప్పు, ఒక టేబుల్ స్పూన్ బియ్యం కలిపి దోరగా వేయించుకోవాలి. పెసరపప్పును సాధారణంగా సున్నుండల్లో వేయరు, కానీ ఇలా వేయడం వల్ల రుచి మెరుగుపడుతుంది. బియ్యం కలపడం వల్ల సున్నుండ తినేటప్పుడు జిగురుగా అనిపించకుండా ఉంటుంది. ఇవి కూడా వేగిన తర్వాత మినప్పప్పు ప్లేట్‌లోనే వేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.

ఇప్పుడు అదే పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగించాలి. నెయ్యి కరిగిన తర్వాత అర కప్పు బాదం పప్పు వేసి, లో-మీడియం మంటపై దోరగా వేయించాలి. బాదం పప్పు కొద్దిగా వేగిన తర్వాత అర కప్పు జీడిపప్పును కూడా కలిపి వేయించుకోవాలి. రెండూ చక్కగా వేగిన తర్వాత నేతిలో నుంచి తీసి ఒక ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నెయ్యిని తర్వాత లడ్డూలు చుట్టడానికి ఉపయోగించవచ్చు.

ఇప్పుడు బెల్లం తురుమును కొలుచుకుని పక్కన పెట్టుకోవాలి. 2 కప్పుల మినప్పప్పుకు 1.5 కప్పుల బెల్లం తురుము సరిపోతుంది. స్వీట్ ఎక్కువగా కావాలంటే 2 కప్పులు తీసుకోవచ్చు. ఇప్పుడు పూర్తిగా చల్లారిన మినప్పప్పు, పెసరపప్పు, బియ్యం మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. దీనిలో ఆరేడు యాలకులు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. పిండి మరీ మెత్తగా కాకుండా, కొద్దిగా బరకగా ఉండేలా చూసుకోవాలి. పిండిని చిన్న చిన్న బ్యాచ్‌లుగా గ్రైండ్ చేస్తే చక్కగా మెదుగుతుంది. గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి.

తర్వాత అదే మిక్సీ జార్‌లోకి వేయించి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పును తీసుకుని, మరీ మెత్తటి పొడిలా కాకుండా, పలుచగా పొడి పొడిగా ఉండేలా పల్స్ మోడ్‌లో గ్రైండ్ చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ పొడిని కూడా మినప్పప్పు పిండి ఉన్న గిన్నెలో వేయాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి కొద్దిగా మినప్పప్పు పిండిని తీసుకుని, దానిలో కొలిచి పెట్టుకున్న బెల్లం తురుమును కలపాలి. ఇలా పిండితో కలిపి గ్రైండ్ చేయడం వల్ల బెల్లం బ్లేడ్‌లకు అంటుకోకుండా, చక్కగా పొడి పొడిగా వస్తుంది. ఈ బెల్లం మిశ్రమాన్ని కూడా మినప్పప్పు పిండి ఉన్న గిన్నెలో వేయాలి.

తర్వాత పెద్ద గిన్నెలో ఉన్న మినప్పప్పు పిండి, డ్రై ఫ్రూట్స్ పొడి, బెల్లం మిశ్రమం అన్నింటినీ చేత్తో బాగా కలుపుకోవాలి. ఎక్కడా ఉండలు లేకుండా, బెల్లం బాగా కలిసిపోయేలా జాగ్రత్తగా కలపాలి. అవసరమైతే బెల్లం ఉండలను చేత్తో నలిపి కలపాలి. ఇప్పుడు కరిగించి గోరువెచ్చగా ఉన్న నెయ్యిని కొద్దికొద్దిగా పిండిలో పోస్తూ కలుపుకోవాలి. ఒకేసారి నెయ్యి మొత్తం పోయకుండా, కొద్దికొద్దిగా పోస్తూ పిండిని ముద్దలా కలుపుకోవాలి. పిండి లడ్డూలా చుట్టడానికి సిద్ధంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత, మీకు నచ్చిన సైజులో సున్నుండలను చుట్టుకోవాలి. ఈ సున్నుండలు సాధారణ సున్నుండల కంటే మరింత రుచిగా, పోషకాలతో నిండి ఉంటాయి.

ఇలా తయారైన సున్నుండలను పూర్తిగా ఆరనిచ్చి, గాలి చొరబడని డబ్బాలో నిల్వ ఉంచితే నెల రోజుల వరకు తాజాగా ఉంటాయి. ఈ కొలతలతో సుమారు 28 సున్నుండలు తయారుచేయవచ్చు. ఈ సారి మీరు సున్నుండలు చేయాలనుకుంటే ఈ విధానాన్ని ఒకసారి ప్రయత్నించి చూడండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us