
ఈ ఆధునిక కాలంలో యువతీ యువకుల్లో టాటూలు వేయించుకోవడం ఒక క్రేజీ ఫ్యాషన్‌గా మారింది. కేవలం డిజైన్లు మాత్రమే కాకుండా.. దేవుళ్ల చిత్రాలు, ఓంకారం, స్వస్తిక్, శివలింగం వంటి దైవిక చిహ్నాలను శరీరంపై చెక్కించుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇలా దేవుడి బొమ్మలను పచ్చబొట్టుగా వేయించుకోవడం అసలు శుభప్రదమా? కాదా? దీని వెనుక ఉన్న శాస్త్ర నియమాలేంటి? అనే విషయాలపై ప్రముఖ ఆధ్యాత్మిక పండితులు కీలక విషయాలను వెల్లడించారు. పండితుల అభిప్రాయం ప్రకారం.. శరీరంపై దేవుని పచ్చబొట్టు వేయించుకోవడాన్ని భక్తికి చిహ్నంగా చూడవచ్చు. వినాయకుడు, వేంకటేశ్వరుడు, హనుమంతుడు లేదా ఓంకారం వంటి చిహ్నాలను నిరంతరం శరీరంపై ధరించడం ద్వారా ఆ దైవ సాన్నిధ్యాన్ని మనస్సులో నింపుకోవడానికి ఇది ఒక మార్గం. మన భావన, సంకల్పం పవిత్రంగా ఉంటే ఇందులో ఎటువంటి అభ్యంతరం లేదు. శాస్త్రాల ప్రకారం ఈ భౌతిక శరీరం మలమూత్రాలతో కూడిన అశాశ్వతమైన రూపం అయినప్పటికీ, దేవుడు కొలువయ్యే మనస్సు ఈ శరీరంలోనే ఉంటుంది. కాబట్టి పచ్చబొట్టు ద్వారా దేవుడిని ఆవాహన చేయడం ఒక రకమైన భక్తి సంకేతమే.
“శరీరంపై దేవుని చిహ్నం ఉందంటే అది ఒక రకమైన ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్నట్లే లెక్క” అని పండితులు స్పష్టం చేస్తున్నారు. రామకృష్ణ మఠం వంటి పవిత్ర క్షేత్రాల్లో మంత్ర దీక్ష ఎలా తీసుకుంటారో.. దైవిక పచ్చబొట్టు కూడా అంతే బాధ్యతతో కూడుకున్నది. ఆ చిహ్నానికి పూర్తి గౌరవం ఇచ్చేలా మన ప్రవర్తన, ఆలోచనలు ఎల్లప్పుడూ పవిత్రంగా ఉండాలి. పచ్చబొట్టు వేయించుకున్న తర్వాత కూడా చెడు అలవాట్లు, వ్యసనాలు, పరనింద వంటి దుర్గుణాలు కలిగి ఉంటే, అది తీవ్రమైన దోషంగా మారి జన్మ జన్మల ఇబ్బందులకు దారితీస్తుందని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి.
దుర్గుణాల త్యాగం: పచ్చబొట్టు వేయించుకునే ముందే.. ‘‘నేను నాలో ఉన్న ఒక దుర్గుణాన్ని లేదా చెడు అలవాటును వదిలివేస్తున్నాను’’ అని దేవుని సాక్షిగా సంకల్పం చెప్పుకోవడం అత్యంత శుభప్రదం.
రోజువారీ అభిషేకం: ప్రతిరోజూ స్నానం చేసేటప్పుడు ఆ పచ్చబొట్టు భాగంపై నీళ్లు పడుతున్నప్పుడు.. దేవుడికి అభిషేకం చేస్తున్నట్లుగా భావించి, శరీరాన్ని మరియు మనస్సును శుద్ధిగా ఉంచుకోవాలి.
స్థాన శుద్ధి: దైవ చిహ్నాలను ఎల్లప్పుడూ నడుము పైభాగంలో, హృదయానికి దగ్గరగా లేదా చేతులపై మాత్రమే వేయించుకోవాలి. కాళ్లు, పాదాలు లేదా అపవిత్రమైన ప్రదేశాలలో పొరపాటున కూడా వేయించకూడదు.
యుక్తవయస్సులో శరీరం ఆకర్షణీయంగా, చర్మం బిగుతుగా ఉన్నప్పుడు కేవలం షో ఆఫ్ కోసం దేవుని పచ్చబొట్లు వేయించుకోవడం ఎంతమాత్రం సరైంది కాదని పండితులు సూచిస్తున్నారు. వయస్సు పెరిగే కొద్దీ చర్మం ముడతలు పడుతుంది. ఆ సమయంలో ఆ దైవ రూపం వికృతంగా మారే అవకాశం ఉంటుంది. ఇది తీవ్రమైన అశుభ సంకేతం. కాబట్టి కేవలం నలుగురిలో స్టైల్‌గా కనిపించడం కోసం కాకుండా.. నిజమైన భక్తి, శాస్త్ర నియమాలను జీవితాంతం పాటించగలమన్న నమ్మకం మరియు మానసిక పరిపక్వత ఉన్నప్పుడే దైవ చిహ్నాలను పచ్చబొట్టుగా మార్చుకోవాలని ఆధ్యాత్మిక నిపుణులు సలహా ఇస్తున్నారు.