
వామాకు చారు లేదా అజ్వైన్ లీవ్స్ రసం.. తెలుగు వంటకాలలో ఎంతో ప్రసిద్ధి చెందినది. ఇది కేవలం రుచిని అందించడమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. వామాకులలో (Ajwain leaves / Carom plant leaves) మన ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు, ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు ఇవి ఎంతో సహాయపడతాయి. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె అధికంగా ఉంటాయి. అలాగే.. క్యాల్షియం, ఐరన్, పొటాషియం.. యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఇది ఒక గొప్ప ఔషధంలా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో సులభంగా తయారు చేసుకోగలిగే ఈ వామాకు చారును, వేడి వేడి అన్నంతో కలిపి తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది.
వామాకుల తయారీ: ముందుగా, వామాకు ఆకులను శుభ్రంగా కడిగి నీరు లేకుండా ఆరనివ్వాలి. ఆ తర్వాత వాటిని వీలైనంత సన్నగా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన వామాకు ముక్కలను ఒక కొలత కప్పుతో కొలిచి ఒక కప్పు ఉండేలా చూసుకోవాలి.
కూరగాయలు సిద్ధం చేయడం: మూడు మీడియం సైజు టమాటాలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మూడు పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకోవాలి. రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఒక్కొక్కటి ఆరు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
రసం సిద్ధం చేయడం: వామాకు ముక్కలు వేసిన గిన్నెలోకి కట్ చేసిన టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి.
చింతపండు రసం: వేరొక గిన్నెలోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండును తీసుకొని శుభ్రంగా కడగాలి. అందులో రెండు కప్పుల నీళ్లు పోసి, చింతపండును బాగా పిండి రసం తీసుకోవాలి. ఈ రసాన్ని వామాకు వేసిన గిన్నెలోకి పోయాలి. అదే చింతపండులోకి మరొక కప్పు నీళ్లు పోసి మళ్ళీ పిండి, ఆ రసాన్ని కూడా కలిపి మొత్తం ఒక లీటరు నీళ్లు కలిసేలా చూసుకోవాలి.
మసాలా దినుసులు కలపడం: రసంలో రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి.
రసం మరిగించడం: ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టి మూత పెట్టి, హై ఫ్లేమ్ లో ఒక పొంగు వచ్చేవరకు మరిగించాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి, మళ్ళీ మూత పెట్టి తక్కువ మంటపై పది నిమిషాల పాటు ఉడికించాలి.
మసాలా పొడి తయారీ: ఈలోగా, ఒక మిక్సీ జార్ లోకి ఒక టీ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ మిరియాలు, ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
మసాలా కలపడం: గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని మరుగుతున్న రసంలో వేసి బాగా కలపాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అవసరమైతే మరికొంత ఉప్పు కలుపుకోవాలి. మూత పెట్టి, తక్కువ మంటపై ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి, టమాటాలు అన్నీ మెత్తగా ఉడికాయో లేదో చూసుకొని, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
పోపు తయారీ: ఇప్పుడు స్టవ్ పైన వేరొక చిన్న గిన్నెను పెట్టుకొని, అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు వేసి వేయించాలి. ఇవి చిటపటలాడిన తర్వాత, మూడు ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తయారు చేసుకున్న ఈ పోపును రసంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన వామాకు రసం వేడి వేడి అన్నంతో సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ వామాకు చారు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి, తప్పకుండా ఇంట్లో ప్రయత్నించి చూడండి..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..