AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎండల్లో చల్లగా ఉంటుందని కూల్‌డ్రింక్స్ తాగేస్తున్నారా.? ఈ మ్యాటర్ తెలుసుకోకపోతే బాడీ షెడ్డుకే..

వేసవిలో ఉపశమనం కోసం తాగే శీతల పానీయాలు ఆరోగ్యానికి హానికరం. అధిక సుక్రోజ్, హానికర రసాయనాల వల్ల ఊబకాయం, మధుమేహం, దంత సమస్యలు, ఫ్యాటీ లివర్ వంటి రోగాలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరినీళ్లు వంటి సహజ పానీయాలు ఆరోగ్యానికి శ్రేయస్కరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఎండల్లో చల్లగా ఉంటుందని కూల్‌డ్రింక్స్ తాగేస్తున్నారా.? ఈ మ్యాటర్ తెలుసుకోకపోతే బాడీ షెడ్డుకే..
Cool Drinks In Summer
Shaik Madar Saheb
|

Updated on: Apr 25, 2026 | 11:26 AM

Share

ఎండలు దంచికొడుతున్నాయి.. భానుడి భగభగలు, ఉక్కపోత, వేసవితాపంతో జనం అల్లాడుతున్నారు. ఎండ నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది శీతల పానీయాలను ఆశ్రయిస్తుంటారు. దీంతో కూల్ డ్రింక్స్‌కు భారీగా డిమాండ్ ఏర్పడుతుంది. అయితే, ఈ పానీయాలు తాత్కాలికంగా చల్లదనాన్ని, ఉపశమనాన్ని కలిగించినప్పటికీ, వాటిలో ఉండే అధిక సుక్రోజ్ దీర్ఘకాలికంగా అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కూల్ డ్రింక్స్‌లో అధికంగా సుక్రోజ్, ఫ్రక్టోజ్, కార్న్ సిరప్, కార్బోనేటెడ్ వాటర్, కృత్రిమ రంగులు, ప్రిజర్వేటివ్స్ వంటి హానికరమైన పదార్థాలు ఉంటాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల ఊబకాయం, మధుమేహం (టైప్ 2), పోషకాహార లోపం వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి. ఈ పానీయాలు తాగినప్పుడు వెంటనే శక్తి స్థాయిలు పెరిగినట్లు అనిపించినా, అది చక్కెర వల్ల కలిగే తాత్కాలిక ప్రభావం మాత్రమే.. క్రమంగా శరీరం వీటికి అలవాటుపడిపోతుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఎవరికైనా శీతల పానీయాలను క్రమం తప్పకుండా సేవించడం మంచిది కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

శీతల పానీయాల్లోని ఆమ్లాలు పంటి ఎనామిల్‌ను బలహీనపరుస్తాయి. దీనివల్ల పంటి నొప్పి, సున్నితత్వం, క్యావిటీస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అదనంగా, పానీయాల్లోని రంగులు దంతాలపై మరకలను ఏర్పరుస్తాయి. పోషకాహార విలువలు చాలా తక్కువగా ఉండే ఈ డ్రింక్స్‌లో నీళ్లు, చక్కెర, కృత్రిమ రుచులు తప్ప విటమిన్లు, మినరల్స్ వంటివి దాదాపు ఉండవు. వీటిని రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో అవసరమైన పోషకాలు లోపించి, బలహీనత, అలసట వంటి సమస్యలు తలెత్తుతాయి.

సుక్రోజ్ అనేది ఒక రకమైన చక్కెర, ఇది ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్స్, డ్రింక్స్‌లో ఉపయోగిస్తారు. అధిక చక్కెర వినియోగం బరువు పెరగడానికి, శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగి ఊబకాయానికి దారితీస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి, టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని గణనీయంగా పెంచుతుంది. కాలేయం అధిక చక్కెరను ప్రాసెస్ చేయలేనప్పుడు ఫ్యాటీ లివర్ సమస్య కూడా ఉత్పన్నమవుతుంది. కార్బోనేటెడ్ వాటర్ జీర్ణవ్యవస్థను ప్రభావితం చేయగా, ఫాస్ఫోరిక్ యాసిడ్ ఎముకల నుండి కాల్షియంను తగ్గించి, వాటిని బలహీనపరుస్తుంది.

ఎండల్లో ఈ డ్రింక్స్ తాగండి..

ఈ నేపథ్యంలో, వేసవిలో శీతల పానీయాలకు బదులుగా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తరచుగా మంచినీళ్లు తాగడంతో పాటు, చెరుకు రసం, సబ్జా గింజల వాటర్, కొబ్బరినీళ్లు, మజ్జిగ, నిమ్మరసం వంటి సహజమైన పానీయాలు ఆరోగ్యానికి చాలా మంచివి. మజ్జిగను పలచగా, చల్లని నీటితో కలిపి, కొద్దిగా ఉప్పు వేసుకొని తాగడం డీహైడ్రేషన్ నివారిస్తుంది. నిమ్మరసంలో కూడా తక్కువ ఉప్పు, చక్కెర కలుపుకొని పరిమిత పరిమాణంలో తీసుకోవడం మంచిది. బార్లీ వాటర్ కూడా వేసవిలో డీహైడ్రేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

మొత్తంగా, వేసవి తాపానికి తాత్కాలిక ఉపశమనం కోసం కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం కంటే, పైన పేర్కొన్న సహజ, ఇంట్లో తయారుచేసిన పానీయాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నిపుణులు సూచించిన విధంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ఎంతో ముఖ్యం..

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా సమస్యలున్నా.. సందేహాలున్నా వైద్య నిపుణులను సంప్రదించండి..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us