Sabja Seeds: సబ్జా సీడ్స్ గురించి మీకేం తెలుసు..? అపోహలు కాదు అసలు వాస్తవాలు తెలుసుకోండి..

మండుతున్న ఎండల వేడికి అందరి చూపు సబ్జా గింజలపై పడింది. నల్లటి ఈ చిన్ని గింజలు వేసవికి విరుగుడుగా పేరుగాంచినప్పటికీ.. వీటి గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా నిజమేనా? బరువు తగ్గాలన్నా, శరీరాన్ని చల్లబరచాలన్నా గుప్పెడు సబ్జా గింజలు నానబెట్టుకుని తాగేస్తే సరిపోతుందా? సబ్జా గింజల గురించి ఉన్న అపోహలు ఏంటీ..? అసలు వాస్తవాలు ఏంటీ అనేది తెలుసుకుందాం.

Sabja Seeds: సబ్జా సీడ్స్ గురించి మీకేం తెలుసు..? అపోహలు కాదు అసలు వాస్తవాలు తెలుసుకోండి..
Know All About Sabja Seeds

Updated on: Apr 24, 2026 | 4:47 PM

భానుడి భగభగలు మొదలయ్యాయి. వేసవి తాపం నుండి ఉపశమనం పొందేందుకు ప్రజలు రకరకాల కూల్ డ్రింక్స్ ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో సహజసిద్ధంగా శరీరాన్ని చల్లబరిచే సబ్జా గింజలకు గిరాకీ ఒక్కసారిగా పెరిగింది. అయితే సబ్జా గింజలు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్నది ఎంత నిజమో.. వాటి గురించి ప్రచారంలో ఉన్న కొన్ని అపోహలు నమ్మడం అంత ప్రమాదకరం. వీటిని తప్పుగా వాడటం వల్ల ప్రయోజనం కంటే హాని కలిగే ప్రమాదం ఉంది. సబ్జా గింజలను ఎలా వాడాలి..? అసలు వాస్తవాలేంటి..? అనే ముఖ్యమైన విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

తక్షణమే చల్లబరుస్తాయా?

అపోహ: సబ్జా గింజలు తిన్న వెంటనే ఏసీ లాగా శరీరాన్ని చల్లబరుస్తాయి.

వాస్తవం: చాలామంది సబ్జా గింజలు తాగగానే శరీర ఉష్ణోగ్రత మ్యాజిక్ లాగా తగ్గిపోతుందని నమ్ముతారు. కానీ శాస్త్రీయంగా చూస్తే, సబ్జా గింజలు కూలింగ్ ఏజెంట్స్‌గాగా పనిచేస్తాయి కానీ, వాటి ప్రభావం క్రమంగా ఉంటుంది. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడి, తద్వారా శరీర అంతర్గత వేడి తగ్గుతుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ. కాబట్టి ఒక్క రోజులో ఫలితం ఆశించకుండా, వేసవి అంతా మితంగా తీసుకోవడం మంచిది.

ఎంత ఎక్కువ తింటే అంత మంచిదా..?

అపోహ: ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని గుప్పెడు గుప్పెడు తినడం.

వాస్తవం: అతి సర్వత్ర వర్జయేత్ అన్న నానుడి సబ్జా గింజలకు సరిగ్గా సరిపోతుంది. ఇందులో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయదు. అయితే బరువు తగ్గాలనే ఆరాటంతో వీటిని అతిగా తీసుకుంటే.. కడుపులో గ్యాస్, ఉబ్బరం, తీవ్రమైన మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తవచ్చు. వైద్యులు రోజుకు ఒకటి నుండి రెండు చిన్న స్పూన్ల మోతాదు మాత్రమే సిఫార్సు చేయడం జరిగింది.

బరువు తగ్గడానికి షార్ట్ కట్ ..?

అపోహ: కేవలం సబ్జా గింజలు తాగితే చాలు, వ్యాయామం లేకుండా బరువు తగ్గిపోవచ్చు.

వాస్తవం: సబ్జా గింజలు కేవలం మీ బరువు తగ్గే ప్రయాణంలో సహాయకారిగా మాత్రమే పనిచేస్తాయి. వీటిలో ఉండే ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ జీవక్రియను వేగవంతం చేస్తుంది. కానీ కేవలం సబ్జా గింజలు తాగుతూ, నూనె పదార్థాలు తింటూ వ్యాయామం చేయకపోతే ఎలాంటి ఫలితం ఉండదు. బరువు తగ్గడానికి సరైన ఆహారం, వ్యాయామంతో పాటు వీటిని తీసుకోవాలి.

అందరికీ సురక్షితమేనా?

అపోహ: సహజసిద్ధమైనవి కాబట్టి ఎవరైనా, ఎప్పుడైనా తీసుకోవచ్చు.

వాస్తవం: ఇది అత్యంత ప్రమాదకరమైన అపోహ. సబ్జా గింజలు సహజ సిద్ధమైనవే అయినప్పటికీ అవి అందరికీ పడకపోవచ్చు. గర్భిణీ స్త్రీలలో ఈస్ట్రోజెన్ స్థాయిలను ప్రభావితం చేసే అవకాశం ఉందని కొందరు నిపుణులు చెబుతారు. చిన్న పిల్లలకు గొంతులో అడ్డుపడే ప్రమాదం ఉంది. ఆపరేషన్ చేయించుకున్న వారు లేదా రక్తం పల్చబడే మందులు వాడేవారు వైద్యుల సలహా లేకుండా వీటిని తీసుకోకూడదు.

నానబెట్టకుండా తింటే ప్రమాదమా?

అపోహ: సబ్జా గింజలను పచ్చిగా నేరుగా తీసుకోవచ్చు.

వాస్తవం: సబ్జా గింజలను ఎప్పుడూ పొడిగా లేదా నానబెట్టకుండా తినకూడదు. ఈ గింజలు తమ బరువు కంటే పది రెట్లు ఎక్కువ నీటిని పీల్చుకుంటాయి. మీరు వీటిని పొడిగా తింటే, అవి మీ అన్నవాహికలో ఉన్న తేమను పీల్చుకుని అక్కడే ఉబ్బి గొంతుకు అడ్డుపడవచ్చు. ఇది శ్వాస ఆడకపోవడానికి లేదా గొంతు సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి కనీసం 15 నుండి 20 నిమిషాలు నీటిలో నానబెట్టి, అవి జెల్లీలా మారిన తర్వాతే సేవించాలి.

సబ్జా గింజలు వేసవి కాలానికి లభించిన ఒక అద్భుతమైన వరం. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, మెగ్నీషియం మరియు ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే, అపోహలను నమ్మి తప్పుడు పద్ధతిలో వాడకుండా, సరైన మోతాదులో, సరైన పద్ధతిలో తీసుకుంటేనే పూర్తి ఆరోగ్యం మీ సొంతమవుతుంది.

Follow Us