
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలన్నా, చర్మం కాంతివంతంగా మెరిసిపోవాలన్నా అందరికీ మొదట గుర్తొచ్చేది విటమిన్ సి. ఈ విటమిన్ అనగానే చాలామంది వెంటనే మార్కెట్‌కు వెళ్లి నారింజ పండ్లను తెచ్చేసుకుంటారు. కానీ మనకు సాధారణంగా లభించే జామకాయ.. నారింజ కంటే చాలా శక్తివంతమైనదని మీకు తెలుసా? విటమిన్ సి రేసులో జామకాయ ముందుందా లేక నారింజనా? ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అంజలి దీనికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు.
చాలామంది విటమిన్ సి కేవలం జలుబు, దగ్గు రాకుండా చూస్తుందని అనుకుంటారు. కానీ దీని పాత్ర చాలా పెద్దదని డాక్టర్ అంజలి హూడా వివరిస్తున్నారు. ఇది శరీరంలో రోగనిరోధక ప్రతిస్పందనను బలోపేతం చేసి, ఇన్‌ఫెక్షన్లపై పోరాడటమే కాకుండా.. చర్మం యవ్వనంగా ఉండటానికి, ఎముకల బలానికి, కనెక్టివ్ కణజాలాల రక్షణకు అవసరమయ్యే కొల్లాజెన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది.
నారింజ పండును విటమిన్ సి కి కేరాఫ్ అడ్రస్‌గా భావిస్తారు. దీనివల్ల కలిగే ప్రయోజనాలు:
హైడ్రేషన్: ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడకుండా చూస్తుంది.
గుండె ఆరోగ్యం: నారింజలో ఉండే ఫ్లేవనాయిడ్లు, పొటాషియం రక్తపోటును నియంత్రించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
సులభంగా తినొచ్చు: దీని తొక్క తీయడం సులభం, ప్రయాణాల్లో కూడా స్నాక్‌గా తినడానికి వీలుగా ఉంటుంది.
జామకాయను చాలామంది లైట్ తీసుకుంటారు, కానీ దీనిలోని పోషకాలు అద్భుతమైనవి.
జీర్ణక్రియకు మేలు: ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.
యాంటీ ఏజింగ్ గుణాలు: యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల చర్మంపై ముడతలు రాకుండా కాపాడుతుంది.
శక్తివంతమైన ఇమ్యూనిటీ: వాతావరణం మారినప్పుడు వచ్చే సీజనల్ వ్యాధుల నుండి ఇది మనల్ని రక్షిస్తుంది.
USDA (అమెరికా వ్యవసాయ శాఖ) డేటా ప్రకారం.. ఈ రెండింటి మధ్య విటమిన్ సి వ్యత్యాసం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే..
అంటే 100 గ్రాముల జామకాయలో నారింజ కంటే నాలుగు రెట్లకు పైగా విటమిన్ సి ఉంటుంది. అంటే మీరు రోజువారీ శరీరానికి కావలసిన విటమిన్ సి ని అందుకోవడానికి ఒక్క జామకాయ తింటే సరిపోతుంది, అదే నారింజ పండ్లయితే నాలుగైదు తినాల్సి వస్తుంది.
మీరు తక్కువ ఖర్చులో, త్వరగా ఎక్కువ విటమిన్ సి పొందాలనుకుంటే ఖచ్చితంగా జామకాయ ఉత్తమమైన ఎంపిక. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని త్వరగా పెంచుకోవాల్సిన సమయంలో జామకాయ అద్భుతంగా పనిచేస్తుంది. అయితే అలా అని నారింజను పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. నారింజ ఇచ్చే రీఫ్రెష్మెంట్, గుండె ఆరోగ్య ప్రయోజనాలు దానికి ఉన్నాయి. అందుకే ఈ రెండింటినీ మీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా అన్ని రకాల పోషకాలను సమతుల్యంగా పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.