
చికెన్, ఫిష్, రొయ్యల బిర్యానీలు, కర్రీలు ఎన్ని ఉన్నా.. మటన్ (మేక మాంసం) బిర్యానీ, కూరల రుచి – దాని డిమాండ్ వేరు. ఫంక్షన్లు, పార్టీలలో మటన్ లేకపోతే ఆ విందు అసంపూర్ణంగా భావిస్తారు. మటన్ కేవలం రుచికి మాత్రమే కాకుండా, శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందిస్తుంది. మటన్‌లో ప్రొటీన్లు, ఐరన్, విటమిన్ B12, జింక్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది కండరాల నిర్మాణానికి, రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, రక్తహీనతను తగ్గించడంలో ఎంతో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. మటన్ మాంసం మాదిరిగానే.. ప్రతి భాగం కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మటన్‌లో ఉండే ప్రతి భాగం.. లివర్, కాళ్లు, తలకాయ.. బోటి.. ఇలా అన్ని విభిన్న ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి.. వాటి గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..
మటన్ లివర్: మటన్ లివర్ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ఐరన్, విటమిన్ B12 పుష్కలంగా ఉంటాయి. వారాంతంలో మటన్ లివర్‌ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. అంతేకాకుండా, ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.
మేక కాళ్లు -పాయ: మేక కాళ్లతో చేసే సూప్ ఒక గొప్ప ఔషధంలా పనిచేస్తుంది. మేక కాళ్లను కాల్చి తయారుచేసే ఈ సూప్ తాగడం వల్ల అంటువ్యాధులు రాకుండా ఉంటాయి. జలుబు వంటి సాధారణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఎముకలు విరిగిన వారికి లేదా ఎముకల బలహీనత ఉన్నవారికి మటన్ బోన్ సూప్ చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి, ఎముకలను బలంగా మారుస్తుంది.
మేక తలకాయ: మేక తలకాయలో కొవ్వు శాతం కాస్త ఎక్కువ ఉన్నప్పటికీ, ఐరన్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. మేక తలకాయను కాల్చి ముక్కలుగా చేసి కూర వండుకుని చపాతీ లేదా రైస్‌తో తింటుంటారు. రెడ్ మీట్ అంతగా ఇష్టపడని వారికి ఇది మంచి ప్రత్యామ్నాయం. తలకాయ కూర తింటే శరీరం గట్టిపడుతుందని నమ్ముతారు.
మటన్ బోటీ: మటన్ బోటీ అంటే మేక ప్రేగులు. వీటిలో కూడా అనేక రకాల పోషకాలు దాగి ఉంటాయి. మేక ప్రేగుల్లో విటమిన్ A, B12, D, E, K వంటి ముఖ్యమైన విటమిన్లు ఉన్నాయి. మటన్ బోటీని కూరగా వండుకుని లేదా ఫ్రై చేసుకుని తినడం వల్ల ప్రేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది జీర్ణవ్యవస్థకు మేలు చేయడమే కాకుండా, శరీర రోగ నిరోధక శక్తిని గణనీయంగా పెంచుతుంది.
వారానికి ఒకసారి మటన్‌ను మితంగా తీసుకోవడం వల్ల ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే మటన్‌ను వేయించడం లేదా గ్రిల్ చేయడం వంటి పద్ధతుల వల్ల కొవ్వు శాతం పెరిగే అవకాశం ఉంటుంది. సాధారణ పద్ధతుల్లో వండుకుని తినడం వల్ల మటన్‌లో ఉండే విటమిన్లు, పోషకాలు సంపూర్ణంగా శరీరానికి అందుతాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా మటన్‌ను సరైన రీతిలో తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
మితంగా తీసుకుంటే మటన్ శరీరానికి అవసరమైన పోషకాలను అందించి ఆరోగ్యానికి తోడ్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే సమతుల్య ఆహారంలో భాగంగా, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను బట్టి తీసుకోవడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..