
తీర ప్రాంతాల నుండి గ్రామీణ ప్రాంతాల వరకు ఎన్నో సంవత్సరాల నుండి ఎంతో ఇష్టంగా ఆస్వాదించే సంప్రదాయ ఆహారాలలో ఎండిన చేపలు ఒకటి. తాజా చేపలు దొరకని సమయాల్లో లేదా ప్రత్యేకమైన రుచిని కోరుకునే వారికి ఇది మొదటి ఎంపికగా ఉంటుంది. చేపలలోని తేమను పూర్తిగా తొలగించి, ఎక్కువ కాలం నిల్వ ఉండేలా తయారుచేసే ఈ వంటకం అద్భుతమైన రుచితో పాటు శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తుంది. అయితే దీని వెనుక ఉన్న పోషక విలువలతో పాటు కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలను కూడా తెలుసుకోవడం చాలా అవసరం. తీరప్రాంతాల్లో పుట్టిన ఈ ఆహారపు అలవాటు కాలక్రమేణా గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించింది. చేపలను ఎండబెట్టడం అనేది వాటిని చెడిపోకుండా సంరక్షించే పురాతన పద్ధతి. చేపలలోని తేమను పూర్తిగా ఆవిరైపోయేలా ఎండబెట్టడం ద్వారా బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాల పెరుగుదల నివారించబడుతుంది. దీనివల్ల చేపలు పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.
తాజా చేపలతో పోలిస్తే ఎండబెట్టిన చేపలలో పోషకాలు మరింత కేంద్రీకృతమై ఉంటాయి.
అధిక ప్రోటీన్ సాంద్రత: ఎండబెట్టే ప్రక్రియలో నీరు ఆవిరైపోవడం వల్ల తాజా చేపలతో పోలిస్తే ఎండిన చేపలలో ప్రోటీన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీర కండరాల పటుత్వానికి మరియు దైనందిన శక్తికి ఎంతగానో సహాయపడుతుంది.
ఎముకల బలం: చిన్న రకాల ఎండిన చేపలను ఎముకలతో సహా నమిలి తిన్నప్పుడు, శరీరానికి తగినంత కాల్షియం – ఫాస్ఫరస్ లభిస్తాయి. ఇవి ఎముకలను, దంతాలను దృఢంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
నాడీ వ్యవస్థ – గుండె ఆరోగ్యం: వీటిలో లభించే విటమిన్ బి12, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు నాడీ వ్యవస్థ సజావుగా పనిచేయడానికి, మెదడు చురుగ్గా ఉండటానికి మరియు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడతాయి.
ప్రయోజనాలు ఎంత ఎక్కువగా ఉన్నాయో, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కొన్ని అనర్థాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎండుచేపల తయారీ సమయంలో చేపలు పాడవకుండా ఉండటానికి ఉప్పును విరివిగా కలుపుతారు. దీనివల్ల సోడియం స్థాయిలు పెరుగుతాయి. ఎండబెట్టే సమయంలో తగినంత పరిశుభ్రత పాటించకపోతే, దుమ్ము, ధూళి లేదా క్రిములు చేరి ఫుడ్ పాయిజనింగ్, కడుపునొప్పి లేదా అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది.
అధిక రక్తపోటు – మూత్రపిండాల బాధితులు: ఎండిన చేపలలో సోడియం మోతాదు చాలా ఎక్కువగా ఉండటం వలన అధిక రక్తపోటు కిడ్నీ సమస్యలు ఉన్నవారు వైద్యుడిని సంప్రదించకుండా వీటిని తినకపోవడం చాలా మంచిది. ఒకవేళ తీసుకోవాలనుకున్నా చాలా అత్యంత మితంగా, ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. సాధారణ ప్రజలు కూడా వీటిని రోజూవారీ ఆహారంలో కాకుండా అప్పుడప్పుడు, పరిమిత పరిమాణంలో తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం పెట్టవచ్చు.