
సీ-ఫుడ్.. చేపలు ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరమైన ఆహారమని పోషకాహార నిపుణులు తరచుగా చెబుతుంటారు. అయితే, మార్కెట్లో లభించే పచ్చి చేపలు (ఫ్రెష్ ఫిష్), ఎండు చేపలలో (డ్రై ఫిష్) ఏవి ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి, ఏవి ఆరోగ్యానికి మెరుగు అనే ప్రశ్న చాలా మందికి తలెత్తుతుంది. వాస్తవానికి ఎండు చేపలు, పచ్చి చేపలు.. రెండూ కూడా పోషకరమైనవే.. అయితే.. వీటిలో ఏవి ఎక్కువ అనే దాని గురించి పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం..
సీఐఎఫ్టీ పరిశోధనల ప్రకారం.. పోషకాల సాంద్రత విషయంలో ఎండు చేపలు పచ్చి చేపల కంటే ముందుంటాయి. ఒక కిలో పచ్చి చేపల ద్వారా గరిష్టంగా 200 గ్రాముల ప్రొటీన్ లభిస్తే, ఒక కిలో ఎండు చేపల ద్వారా సుమారు 600 గ్రాముల ప్రొటీన్ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.. రెండింటిలోనూ ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, A, D, K, B12 వంటి విటమిన్లు, అలాగే జింక్, మెగ్నీషియం, కాల్షియం, అయోడిన్, కాపర్, సెలీనియం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, ఎండు చేపల్లో నీటి శాతం చాలా తక్కువగా ఉండటం వల్ల, వాటిలోని ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఎక్కువ మొత్తంలో సాంద్రీకృతమై ఉంటాయి.
పచ్చి చేపల్లో సుమారు 80% నీరు ఉంటుంది. ఈ అధిక నీటి శాతం కారణంగా సూక్ష్మాణువులు వేగంగా వృద్ధి చెంది, చేపలు త్వరగా పాడైపోతాయి. పచ్చి చేపల గరిష్ట షెల్ఫ్ లైఫ్ కేవలం ఒక వారం మాత్రమే. దీనికి విరుద్ధంగా, ఎండు చేపల తయారీలో నీటిని పూర్తిగా తొలగిస్తారు. నీరు లేకపోవడం వల్ల సూక్ష్మాణువులు వృద్ధి చెందలేవు, తద్వారా ఎండు చేపల షెల్ఫ్ లైఫ్ గణనీయంగా పెరుగుతుంది. ఇవి గది ఉష్ణోగ్రత వద్ద సుమారు ఆరు నెలల వరకు నిల్వ ఉంటాయి. వాటి రుచిలో కూడా ఎటువంటి మార్పు ఉండదు. ఇది ఎండు చేపలకు ఒక ముఖ్యమైన ప్రయోజనం..
ఎండు చేపలకు ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్, వాసన ఉంటుంది. ఈ ప్రత్యేకతను ఇష్టపడేవారు ఎండు చేపలను ఎంచుకోవచ్చు. అయితే, ఎండు చేపల బలమైన వాసన కారణంగా వాటిని ఇంట్లో ఉంచుకోవడం ఇబ్బందిగా భావించి చాలా మంది పచ్చి చేపలనే కొనుగోలు చేస్తారని చేపల వ్యాపారులు చెబుతున్నారు. ఎక్కువ మంది వినియోగదారులు పచ్చి చేపలనే ఇష్టపడతారు.
ఎండు చేపల తయారీలో పురుగులు పట్టకుండా, ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు అధిక మొత్తంలో ఉప్పును ఉపయోగిస్తారు. ఈ ఉప్పు ప్రిజర్వేషన్ ఏజెంట్‌గా పనిచేసి హానికారక సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధిస్తుంది. అయితే, అధిక ఉప్పు శాతం బీపీ (రక్తపోటు), గుండె జబ్బులు ఉన్నవారికి మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తారు.
ఈ సమస్యకు పరిష్కారంగా, శాస్త్రవేత్తలు కొన్ని సహాజ పద్ధతులను సూచిస్తున్నారు. ఎండు చేపల్లో ఉప్పు శాతాన్ని తగ్గించడానికి, వాటిని వండుకునే ముందు గోరువెచ్చని (సుమారు 40°C) నీటిలో అర గంట పాటు నానబెట్టడం ఒక పద్ధతి. ఈ ప్రక్రియలో కొంత ఉప్పు నీటిలో కలిసిపోతుంది. నీటిని సర్క్యులేట్ చేయడం ద్వారా మరింత ఉప్పును తొలగించవచ్చు. అలాగే, సీఐఎఫ్టీ ఒక ప్రత్యేకమైన ప్రక్రియను అభివృద్ధి చేసింది. దీనిలో ఉప్పుతో పాటు కొంత చక్కెరను కలిపి చేపలను ఎండబెడతారు. ఇలా చేయడం వల్ల చేపల్లో ఉప్పు శాతం 20% నుండి సుమారు 14%కి తగ్గుతుంది. ఈ సాంకేతికత ద్వారా అధిక ఉప్పు సమస్యను అధిగమించి, ఎండు చేపలను ఆరోగ్యకరమైన రీతిలో ఆస్వాదించవచ్చు.
చివరగా, పోషకాల సాంద్రత, నిల్వ విషయంలో ఎండు చేపలు పచ్చి చేపల కంటే మెరుగైనవిగా నిలుస్తాయి. అయితే, వినియోగదారుల ప్రాధాన్యతలు, ఉప్పు శాతం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని, అవసరాన్ని బట్టి ఎంపిక చేసుకోవడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..