
ఎండుచేపలు భారతీయ వంటకాల్లో ఒక భాగం. వీటిని ఇష్టపడేవారు అధిక సంఖ్యలో ఉంటారు. అయితే, ఎండుచేపల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, ప్రమాదాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. పచ్చి చేపలలో ఉండే అనేక పోషకాలు ఎండుచేపలలోనూ లభిస్తాయి. కానీ, వాటి తయారీ, నిల్వ పద్ధతులు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి ఎండుచేపలు పోషకాలను అందించినప్పటికీ, వాటి వినియోగం పట్ల జాగ్రత్త అవసరం. వీటిలో అధిక సోడియం, హెవీ మెటల్స్, ఫంగల్ టాక్సిన్స్ ఉండే అవకాశం ఉంది. ఈ కారణంగా పలు సమస్యలు ఉన్నవారు ఎండుచేపలకు దూరంగా ఉండటమే బెటర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు..
ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు మితంగా ఎండుచేపలను తినవచ్చు. వీటిలో ప్రొటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
పాలిచ్చే తల్లులు: మితంగా ఎండుచేపలు తీసుకోవడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది.
జలుబు, దగ్గుతో బాధపడేవారు: వీటిలో ఉండే పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచి, జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయి.
అయితే, వీరు కూడా శుభ్రమైన, నాణ్యమైన ఎండుచేపలను మాత్రమే ఎంచుకోవాలి. ఉప్పు ఎక్కువగా లేకుండా, సరిగ్గా ఎండబెట్టిన వాటిని తీసుకోవడం మంచిది.
ఎండుచేపలు కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారికి లేదా కొన్ని సమయాల్లో హానికరం కావచ్చు:
గుండె జబ్బులు, అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్) ఉన్నవారు: ఎండుచేపలలో సోడియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును పెంచి, గుండె జబ్బుల ప్రమాదాన్ని మరింత ఎక్కువ చేస్తుంది.
మధుమేహం (షుగర్) ఉన్నవారు: ఎండుచేపలు రక్తంలో గ్లూకోస్ స్థాయిలను ప్రభావితం చేయవచ్చు. కావున, మధుమేహులు వీటిని నివారించడం ఉత్తమం.
గర్భిణీ స్త్రీలు – చిన్న పిల్లలు: ఎండుచేపలలో హెవీ మెటల్స్ (భారీ లోహాలు) ఉండే అవకాశం ఉంది. ఇవి గర్భిణీలకు, పిండానికి, చిన్న పిల్లల మెదడు అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.
కిడ్నీ – లివర్ సమస్యలు ఉన్నవారు: భారీ లోహాలు, అధిక సోడియం కిడ్నీలు, లివర్ పై అదనపు భారాన్ని మోపి, ఇప్పటికే ఉన్న సమస్యలను తీవ్రతరం చేయవచ్చు.
దద్దుర్లు, చర్మ సమస్యలు ఉన్నవారు: ఎండుచేపలు అలర్జీలకు, దద్దుర్లకు, దురదకు కారణం కావచ్చు. ముఖ్యంగా చర్మ సమస్యలు ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం.
ఎండుచేపల నాణ్యత చాలా ముఖ్యం. శుభ్రంగా, సరైన పద్ధతిలో ఎండబెట్టిన ఎండుచేపలను మాత్రమే ఎంచుకోవాలి. నాణ్యత లేని ఎండుచేపలలో ఫంగస్ పెరిగి, క్యాన్సర్ కారక టాక్సిన్స్ (ఆఫ్లటాక్సిన్స్ వంటివి) ఏర్పడవచ్చు. ఇవి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తాయి.
ఎండుచేపలను ఉప్పు తగ్గించి, శుభ్రంగా కడిగి వండుకోవాలి. వీటిని సమతుల్య ఆహారంలో భాగంగా మితంగా తీసుకోవాలి. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా గర్భిణీలు ఎండుచేపలు తినాలనుకుంటే, తప్పకుండా వైద్య నిపుణుల సలహా తీసుకోవడం అత్యవసరం. నిపుణుల సలహా లేకుండా వాటిని తీసుకోవడం ప్రమాదకరం.
ఎండుచేపలు పోషకాలను అందించినప్పటికీ, వాటిలో ఉండే అధిక ఉప్పు, భారీ లోహాలు, ఫంగల్ టాక్సిన్స్ వల్ల కొన్ని వర్గాల ప్రజలకు హానికరం. ఆరోగ్యంగా ఉన్నవారు, మితంగా, నాణ్యమైనవి ఎంచుకుంటే ప్రయోజనం పొందవచ్చు. మిగిలిన వారు జాగ్రత్త వహించాలి లేదా పూర్తిగా నివారించాలి. ఏమైనా సమస్యలున్నా.. సందేహాలున్నా.. ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..