Aravana Ayyappa Swami Prasadam: మిస్ చేస్తే ఫీల్ అవుతారు! శబరిమల ప్రసాదంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..

శబరిమల అయ్యప్ప స్వామి వారి అరవణ ప్రసాదాన్ని తినకుండా మీరు ఎప్పుడైనా మిస్ అయ్యారా? అయితే మీరు ఖచ్చితంగా ఆ అద్భుతమైన రుచిని, దాని ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోయినట్టే! తర్వాత ఫీల్ అవుతారు అంత కమ్మగా ఉంటుంది! కానీ చింతించాల్సిన అవసరం లేదు. ఈ పవిత్రమైన, పోషక విలువలున్న ప్రసాదాన్ని ఇంట్లోనే చేసుకోవడం చాలా సులువు. ఆ రహస్య రెసిపీని తెలుసుకుని, మీరు కూడా అచ్చం శబరిమల ప్రసాదం రుచిని ఆస్వాదించండి!

Aravana Ayyappa Swami Prasadam: మిస్ చేస్తే ఫీల్ అవుతారు! శబరిమల ప్రసాదంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..
Sabarimala Aravana Prasadam Recipe

Updated on: Nov 13, 2025 | 1:48 PM

తిరుపతి లడ్డూ, అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం మాదిరిగానే, శబరిమల అయ్యప్ప స్వామి వారి అరవణ ప్రసాదం కూడా భక్తులందరికీ ఎంతో ఇష్టమైనది. టిన్​లో ప్యాక్ చేసి పాకంలా ఉండే ఈ పాయసం రుచి అద్భుతం. ఈ ప్రసాదం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కూడా నిపుణులు చెబుతుంటారు. మరి అంతటి రుచికరమైన అరవణ ప్రసాదాన్ని ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అయితే, కొన్ని టిప్స్​ పాటిస్తూ చేస్తే అచ్చం శబరిమలలో లభించే ప్రసాదం రుచి వస్తుంది.

కావలసిన పదార్థాలు:

రెడ్​ రైస్ (ఎర్ర బియ్యం): 1 కప్పు

తాటి బెల్లం: 3 కప్పులు (సన్నగా తరిగింది)

ఎండుకొబ్బరి ముక్కలు: 2 టేబుల్​స్పూన్లు

నల్ల ఎండు ద్రాక్ష: 2 టేబుల్​స్పూన్లు

నెయ్యి: 4 టేబుల్​స్పూన్లు (మధ్యమధ్యలో వేయడానికి)

శొంఠిపొడి: 1 టీస్పూన్​

యాలకులపొడి: 1 టీస్పూన్​

పచ్చకర్పూరం: కొద్దిగా

నీళ్లు: సరిపడా

తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నెలో రెడ్​ రైస్ తీసుకుని రెండు మూడుసార్లు శుభ్రంగా కడిగి, నీళ్లు లేకుండా పక్కన పెట్టండి.

స్టౌపై ఒక పాన్ పెట్టి, అందులో 2 టేబుల్​స్పూన్ల నెయ్యి వేసి కరిగించండి. స్టౌ మీడియం ఫ్లేమ్​లో ఉంచి, బియ్యాన్ని 5 నిమిషాల పాటు దోరగా, కమ్మటి వాసన వచ్చేవరకు వేయించండి.

బియ్యం తీసుకున్న కొలతతో మూడు కప్పుల వాటర్ రైస్​లో పోయండి.

గిన్నెపై మూతపెట్టి, మధ్యమధ్యలో కలుపుతూ, అన్నం పొడిపొడిగా అయ్యేవరకు వండండి. తర్వాత స్టౌ ఆఫ్​ చేయండి.

ఇప్పుడు స్టౌపై బెల్లం కరిగించుకోవడం కోసం ఒక గిన్నె పెట్టి, ఇందులో 1 కప్పు వాటర్ వేసుకుని, సన్నగా తరిగిన మూడు కప్పుల తాటి బెల్లం వేసుకోండి.

బెల్లం పూర్తిగా కరిగే వరకు స్టౌ మీడియం ఫ్లేమ్​లో ఉంచి, గరిటెతో తిప్పుతూ ఉండండి.

ఇప్పుడు కరిగిన బెల్లం పాకాన్ని జాలి గరిటె సహాయంతో ఉడికించుకున్న రైస్​లో పోసుకోవాలి.

స్టౌ మీడియం ఫ్లేమ్​లో ఉంచుకుని రైస్​ను ఉడికించుకోవాలి. రైస్​ అడుగు అంటకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.

ప్రసాదం కాస్త చిక్కబడేటప్పుడు, ఎండుకొబ్బరి ముక్కలు, నల్ల ఎండు ద్రాక్ష వేసుకుని కలుపుకోవాలి.

తర్వాత మధ్యమధ్యలో కాస్త నెయ్యి వేసుకుంటూ, స్టౌ మీడియం ఫ్లేమ్​లో ఉంచి 20 నిమిషాలు ఉడికించుకోవాలి.

చివరగా, శొంఠిపొడి, యాలకులపొడి, కొద్దిగా పచ్చకర్పూరం వేసుకుని బాగా కలపాలి. ఆపై కొద్దిగా నెయ్యి వేసి, మరో 15 నిమిషాలు ఉడికించుకోండి.

స్టౌ ఆఫ్ చేసి చల్లారనివ్వండి.

అంతే! ఇలా సులభంగా చేసుకుంటే, ఎంతో రుచికరమైన అయ్యప్ప స్వామి అరవణ ప్రసాదం తయారైపోతుంది. దీనిని ఫ్రిజ్​లో నిల్వ ఉంచుకుంటే నెల రోజులపాటు పాడవకుండా తినవచ్చు.

Follow Us