Dhaba Style Paneer Bhurji: ధాబా స్టైల్ పనీర్ భుర్జీ.. చపాతీ పక్కన ఈ కూర ఉంటే ఇంకేమీ అక్కర్లేదు!

రోజూ చేసుకునే కూరలు, టిఫిన్లు తిని బోర్ కొట్టిందా? అయితే ఈసారి ధాబా స్టైల్ పనీర్ భుర్జీని ప్రయత్నించండి. మెత్తటి పనీర్, ఉల్లిపాయ, టమోటా, క్యాప్సికమ్‌తో పాటు మసాలాలు, ఫ్రెష్ క్రీమ్ కలిపి చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా వేడి వేడి చపాతీ, తవా రోటీ, పరాఠా లేదా నాన్‌తో కలిపి తింటే అదిరిపోతుంది. ఇంట్లోనే తక్కువ సమయంలో సులభంగా తయారు చేసుకోవచ్చు.

Dhaba Style Paneer Bhurji: ధాబా స్టైల్ పనీర్ భుర్జీ.. చపాతీ పక్కన ఈ కూర ఉంటే ఇంకేమీ అక్కర్లేదు!
Dhaba Style Paneer Bhurji

Updated on: Sep 01, 2026 | 5:26 PM

పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఈ పనీర్ బుర్జీని ఎంతో ఇష్టంగా తింటారు. దీని కోసం మీరు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలతోనే దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. కొన్ని మసాలాలు, కొద్దిగా ఫ్రెష్ క్రీమ్‌తో తయారుచేసే ఈ వంటకం సాధారణంగా ధాబాలలో దొరుకుతుంది. మీరు దీనిని ధాబా స్టైల్‌లో సులభంగా తయారు చేసుకోవచ్చు.

కావలసిన పదార్థాలు

పనీర్ – 250 గ్రాములు

ఉల్లిపాయ – 2

టమోటాలు – 2

క్యాప్సికమ్ – అర ముక్క

పచ్చిమిరపకాయలు – 2

అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్

వెన్న లేదా నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు

నూనె – 1 టేబుల్ స్పూన్

జీలకర్ర – అర టీస్పూన్

పసుపు – అర టీస్పూన్

కారం – 1 టీస్పూన్

ధనియాల పొడి – 1 టీస్పూన్

గరం మసాలా – అర టీస్పూన్

పావ్ భాజీ మసాలా – అర టీస్పూన్

కసూరి మెంతి – 1 టీస్పూన్

ఫ్రెష్ క్రీమ్ లేదా పాలు – 2 టేబుల్ స్పూన్లు

కొత్తిమీర – కొద్దిగా

ఉప్పు – తగినంత

తయారీ విధానం

ముందుగా బాణలిలో నూనె, వెన్న లేదా నెయ్యి వేసి వేడి చేయండి. అందులో జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి 2–3 నిమిషాలు వేయించండి.

ఉల్లిపాయలు కొద్దిగా గోధుమ రంగులోకి మారిన తర్వాత అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి.

ఇప్పుడు సన్నగా తరిగిన క్యాప్సికమ్, టమోటాలు వేసి కొద్దిగా ఉప్పు కలపండి. మూత పెట్టి 2–3 నిమిషాలు ఉడికించండి. టమోటాలు మెత్తగా మారి మిశ్రమం నుంచి నూనె కొద్దిగా పైకి వచ్చే వరకు ఉడికించాలి.

మంటను తగ్గించి పసుపు, కారం, ధనియాల పొడి, పావ్ భాజీ మసాలా వేసి సుమారు ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించండి. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ లేదా పాలు వేసి మసాలాతో బాగా కలపండి.

తురిమిన పనీర్‌ను బాణలిలో వేసి మసాలాతో మెల్లగా కలపండి. అవసరమైతే ఉప్పు సరిచూడండి. పనీర్ వేసిన తర్వాత 2–3 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉడికించకండి.

గరం మసాలా, చేతితో నలిపిన కసూరి మెంతి, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి.

పనీర్ భుర్జీకి ముఖ్యమైన టిప్

పనీర్‌ను ఎక్కువసేపు ఉడికిస్తే అది మెత్తదనం కోల్పోయి గట్టిగా మారుతుంది. అందుకే పనీర్ వేసిన తర్వాత ఎక్కువసేపు మంటపై ఉంచకుండా రెండు మూడు నిమిషాల్లోనే తయారీ పూర్తి చేయడం మంచిది.

వేడి వేడి పనీర్ భుర్జీని చపాతీ, తవా రోటీ, పరాఠా, నాన్ లేదా పూరీతో సర్వ్ చేయండి. ధాబాలో దొరికే రుచిని ఇంట్లోనే ఆస్వాదించవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us