
ఉదయం నిద్రలేవగానే వేడివేడి కాఫీ లేదా టీ తాగడం మన దేశంలోని ప్రజల ప్రధాన అలవాటు. అయితే హైబీపీ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు లేదా గుండెను పదిలంగా ఉంచుకోవాలనుకునేవారు కాఫీ మంచిదా? లేక గ్రీన్ టీ మేలా? అనే సందేహంలో పడుతుంటారు. ఈ రెండింటిలోనూ శరీరానికి మేలు చేసే కెఫీన్, యాంటీఆక్సిడెంట్లు ఉన్నప్పటికీ, వాటి ప్రభావాలు, పోషక పరిమాణాలు, దుష్ప్రభావాలు వేర్వేరుగా ఉంటాయి. గుండె ఆరోగ్యంపై కాఫీ, గ్రీన్ టీ చూపే ప్రభావాలపై శాస్త్రీయ అధ్యయనాలు ఏం చెబుతున్నాయో తెలుసుకోవడం ముఖ్యం. ఒక కప్పు కాఫీలో సాధారణంగా 80 నుంచి 100 మిల్లీగ్రాముల వరకు కెఫీన్ ఉంటుంది. అదే ఒక కప్పు గ్రీన్ టీలో కేవలం 25 నుంచి 50 మిల్లీగ్రాములు మాత్రమే లభిస్తుంది. అంటే గ్రీన్ టీతో పోలిస్తే కాఫీలో రెండు నుంచి మూడు రెట్లు అధికంగా కెఫీన్ ఉంటుంది. కాఫీలో క్లోరోజెనిక్ ఆమ్లాలు, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. గ్రీన్ టీలో కాటెచిన్లు, ఎల్ థియానైన్ అనే అమినో యాసిడ్ ఉంటాయి. ఈ ఎల్ థియానైన్ కెఫీన్ వల్ల శరీరంలో కలిగే నాడీ ఉద్రేకాన్ని అదుపు చేస్తూ, మనసుకు ప్రశాంతమైన చురుకుదనాన్ని అందిస్తుంది.
పరిశోధనల ప్రకారం.. కాఫీని మితంగా తీసుకోవడం వల్ల రక్తనాళాల పనితీరు మెరుగై దీర్ఘకాలంలో అధిక రక్తపోటు ముప్పు తగ్గుతుంది. రోజుకు 3 నుంచి 5 కప్పుల బ్లాక్ కాఫీ తాగడం గుండెకు మంచిదని, ప్రత్యేకంగా రోజుకు 4 కప్పులు తీసుకునే వారిలో గుండె జబ్బుల ప్రమాదం 16శాతం వరకు తగ్గుతుందని అధ్యయనాలు వెల్లడించాయి. అయితే కాఫీని అతిగా తాగడం లేదా అందులో అధిక మొత్తంలో చక్కెర, చిక్కటి క్రీమ్ పాలు కలపడం గుండెకు తీవ్ర హానికరం. ఎక్కువ కెఫీన్ తీసుకోవడం వల్ల గుండె వేగంగా కొట్టుకోవడం, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి. అలాగే చక్కెర, క్రీమ్‌ల వల్ల బరువు పెరిగి ఊబకాయం బారిన పడే ప్రమాదం ఉంది, ఇది గుండె జబ్బులకు ప్రధాన కారణం అవుతుంది.
గ్రీన్ టీలో ఉండే కాటెచిన్స్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, రక్తపోటును నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. రోజూ గ్రీన్ టీ తాగేవారిలో గుండె జబ్బుల ముప్పు ఏకంగా 28శాతం వరకు తగ్గుతుంది. ఇది రక్తనాళాల వ్యాకోచ, సంకోచాల సామర్థ్యాన్ని మెరుగుపరిచి రక్తప్రసరణ సాఫీగా సాగేలా చేస్తుంది.
గ్రీన్ టీలో కెఫీన్ తక్కువగా ఉన్నప్పటికీ, మోతాదుకు మించి తాగితే నిద్రలేమి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు బ్లడ్ థిన్నర్ డేవారు గ్రీన్ టీ తాగే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఆ మందుల పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తమ్మీద.. కాఫీ అయినా గ్రీన్ టీ అయినా మితంగా తీసుకున్నప్పుడే ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తాయి. అధిక రక్తపోటును అదుపులో ఉంచి, గుండెను పదిలంగా కాపాడుకోవడానికి పానీయాలతో పాటు సరైన సమతుల్య ఆహారం, రోజూ వ్యాయామం, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అత్యంత కీలకమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.