దొండకాయ తింటే మతిమరుపు..! ఉప్పు తగ్గిస్తే ఆరోగ్యం..! ఇందులో నిజమెంతో తెలుసా..?

యాపిల్‌, ద్రాక్ష, ఇటీవల దిగుమతి చేసుకున్న డ్రాగెన్‌ ఫ్రూట్‌, కివీ వంటివి ఎక్కువగా ప్రజల్ని ఆకర్షిస్తున్నాయి. ఇలాంటి ఖరీదైన పండ్లలో పోషకాలు అధికంగా ఉంటాయని భావిస్తారు. ఆర్థిక భారం అయినప్పటికీ కూడా ఇలాంటి పండ్లనే ఎక్కువగా కొంటుంటారు. కానీ, ఈ పండ్లకు సమాన లాభం మన దేశీ పండ్లలోనూ లభిస్తాయి.బత్తాయి, బొప్పాయి, జామలోనూ మనకు మంచి ఆరోగ్యానిచ్చే పోషకాలు మెండుగా ఉంటాయి.

దొండకాయ తింటే మతిమరుపు..! ఉప్పు తగ్గిస్తే ఆరోగ్యం..! ఇందులో నిజమెంతో తెలుసా..?
Food Myths And Facts
Follow us

| Edited By: Ravi Panangapalli

Updated on: Jul 24, 2024 | 8:33 AM

ఈ కాలంలో ఏ అనారోగ్యం లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండటం కంటే మించిన అదృష్టం మరొకటి లేదు. మన ఆరోగ్యానికి అతి ముఖ్యమైనది మనం తీసుకునే ఆహారం. మనం రోజూ వివిధ రకాల ఆహారాలు తింటుంటాం. ఎవరో చెప్పారని కొన్నింటిని వదిలేస్తాం. మరికొన్నింటిని బలవంతంగా, ఆర్థిక భారం అయినా సరే అలవాటుగా చేసుకుని తింటుంటాం. అలాగే, ఖరీదైన ఆహారంలోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయని, చవకగా దొరికే ఆహారంలో పోషకాలు ఉండవని అపోహపడుతుంటాం. ఖరీదైన ఆహారం, చక్కటి ఆరోగ్యం ధనవంతులకే సాధ్యం అనుకుంటారు. కానీ, అది అవాస్తవం. ఖరీదైన ఆహారంలో పోషకాలు ఉంటాయనేది ఏ మాత్రం వాస్తవం కాదు. ఉదాహరణకు కొన్ని రకాల పండ్లను పరిశీలించినట్టయితే.. జామ, బొప్పాయి, దానిమ్మ, బత్తాయి వంటి పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చాలా ఆరోగ్యానిస్తాయి. అందరికీ చవకగా దొరుకుతుంటాయి. దాంతో ఇలాంటి పండ్లంటే ప్రజల్లో కాస్త చిన్న చూపు ఉంటుంది. యాపిల్‌, ద్రాక్ష, ఇటీవల దిగుమతి చేసుకున్న డ్రాగెన్‌ ఫ్రూట్‌, కివీ వంటివి ఎక్కువగా ప్రజల్ని ఆకర్షిస్తున్నాయి. ఇలాంటి ఖరీదైన పండ్లలో పోషకాలు అధికంగా ఉంటాయని భావిస్తారు. ఆర్థిక భారం అయినప్పటికీ కూడా ఇలాంటి పండ్లనే ఎక్కువగా కొంటుంటారు. కానీ, ఈ పండ్లకు సమాన లాభం మన దేశీ పండ్లలోనూ లభిస్తాయి.

బత్తాయి, బొప్పాయి, జామలోనూ మనకు మంచి ఆరోగ్యానిచ్చే పోషకాలు మెండుగా ఉంటాయి. కానీ, ఈ విషయం చాలా మందికి తెలియదు. రోజుకో యాపిల్‌ తింటే డాక్టర్‌ దగ్గరకు వెళ్లాల్సిన పని ఉండదు అనే నానుడి ప్రజల్లో బలంగా ఉంది. ఇక్కడో ముఖ్యమైన విషయం ఏంటంటే.. రోజుకో అరటి పండు తింటే కూడా యాపిల్‌తో సమానమైన ఉపయోగాలే ఉన్నాయి. కానీ, అవగాహన లోపం కారణంగా ప్రజలు ఖరీదైన పండ్ల కోసం ఆరాటపడుతుంటారు. ఇప్పటికైనా రోజుకో అరటి పండు, లేదా ఒక కప్పు బొప్పాయి, ఆఖరుకు ఒక జామకాయ తింటే కూడా మంచి ఫలితం ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

Food Myths And Facts2

Food Myths And Facts

కొవ్వులు, నూనెను పూర్తిగా మానేస్తే ఏమౌతుందో తెలుసా…?

ఇకపోతే, చాలా మంది కొవ్వులు, నూనె పదార్థాలకు దూరంగా ఉంటుంటారు. సన్నగా, నాజుగ్గా ఉండాలని, డైటింగ్‌ పేరుతో ఇప్పుడు చాలా మంది నూనెలు, కొవ్వు పదార్థాలనగానే ఆమడదూరం పారి పోతున్నారు. వాటిని తింటే లావెక్కిపోతామనే భయంతో వాటి వాసన కూడా దగ్గరకు రాకుండా ఉంటున్నారు. ఆరోగ్యం బాగుండాలంటే ఆయిల్ నిషేధించాలని చెప్పుకుంటుంటారు. కానీ, శరీరానికి కొవ్వులు, నూనెలు కూడా చాలా అవసరమంటున్నారు ఆరోగ్య నిపుణులు. నూనెల నుంచి వచ్చే పోషకాలు, శక్తి కూడా మన శరీరానికి చాలా అవసరం అంటున్నారు. నూనెల గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల నూనెను దూరం పెడుతున్నారు. కానీ, ప్రోటీన్స్‌, ఫ్యాట్స్‌, కార్బోహైడ్రేట్స్‌, మినరల్స్‌ మన శరీరానికి తప్పనిసరిగా కావాలి. ఏ,డీ, ఈ, కే లు మన శరీరంలో కరగాలంటే నూనెలు తప్పనిసరి అవసరం. వాటి ప్రభావం మన శరీరంలో ఉండాలన్న నూనె, కొవ్వు అనేది అవసరం. వీటిని దూరం పెట్టడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. మన ఆరోగ్యానికి మంచి కొవ్వుల ఆవశ్యకత ఎంతో ఉంది. అంతేకాదు.. తక్కువ కొవ్వులుండే ఆహారం తీసుకోవడం వల్ల మెటబాలిక్‌ సిండ్రోమ్‌, ఇన్సులిన్‌ నిరోధకత, ట్రైగ్లిజరైడ్‌ స్థాయిలు తగ్గిపోవడం.. వంటి సమస్యలొస్తాయట.! ఇవి క్రమంగా గుండె సమస్యలకు దారితీస్తాయట! అంతేకాదు, నూనెలు, కొవ్వుల లోపం కారణంగా చర్మ సంబంధిత సమస్యలు, డ్రైనెస్‌ వంటివి కూడా ఎదుర్కొవాల్సి వస్తుంది. అలాగే విటమిన్‌ సమస్యలు కూడా వెంటాడుతాయి. విటమిన్‌ సమస్యల వల్ల ఎదురయ్యే చిక్కులు అన్నీ ఇన్నీ కావు..కాబ్బటి, తగిన మోతాదులో ఈ ఫ్యాట్స్‌, నూనెలు కూడా మన శరీరానికి తప్పనిసరిగా అవసరం. నిజానికి మన శారీరక జీవక్రియలు సక్రమంగా జరగడానికి అవసరమైన ప్రధాన పోషకాలైన కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లతో పాటు కొవ్వులూ అంతే కావాలి. కాకపోతే వాటి పరిమితి మించకూడదంతే. అలాగే, నూనెలు, నెయ్యిని ఎక్కువసార్లు మరిగించి వాడితే మంచిది కాదు. నూనె, నెయ్యిని మళ్లీ మళ్లీ మరిగించి వాడటం వల్ల క్యాన్సర్‌ వంటి కారకాలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి తగిన మోతాదులో నూనెలు, నెయ్యిని వాడుతూ.. అతిగా మరిగించకుండా వాడుకోవాలి.

Food Myths And Facts3

Food Myths And Facts

శరీరానికి కావాల్సినన్ని నీళ్లు తాగాలి..లేదంటే..!

శరీరానికి నీరు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే చాలా మందికి రోజూ ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలియదు. ఇంకొందరు తాగినా.. ఎక్కువ తాగడమో, తక్కువ తాగడమో చేస్తుంటారు. అయితే, అలా తాగడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమంటున్నారు నిపుణులు. సాధారణ వ్యక్తి దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 7 నుంచి 10 గ్లాసుల నీళ్లు.. అంటే 2-3 లీటర్ల నీటిని తాగాలని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఎండలో, వేడి ప్రదేశాల్లో పనిచేసేవారు, ఎక్కువ శారీరక శ్రమ చేస్తున్నవారు.. ఈ మోతాదును కొంత మేర పెంచుకోవచ్చు. అలాగే.. రోజువారీ నీటిని ఒకేసారి తాగడం మంచిది కాదంటున్నారు. ముఖ్యంగా.. శరీరంలో ఎక్కువగా నీరు చేరడం వల్ల అన్ని అవయవాల్లోని కణాల్లో నీటి శాతం ఎక్కువవుతుందంటున్నారు. ఫలితంగా కణాల బయట ఉండాల్సిన సోడియం.. కణాల లోపలకు చేరుతుందని సూచిస్తున్నారు. దాంతో తల తిరగడం, తలనొప్పి, అయోమయం, రక్తపోటు పెరగడం, గుండె లయ తప్పడం వంటి సమస్యలు తలెత్తుతాయంటున్నారు.

అంతేకాదు.. కిడ్నీలపై భారం పెరిగి మూత్రపిండాల వైఫల్యానికి దారి తీసే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అలాగే, మీరు నీరు తక్కువగా తాగితే ముఖ్యంగా డీహైడ్రేషన్‌కు లోనయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. కిడ్నీల పనితీరు మందగిస్తుందని, లో బీపీ అవుతుంది. కండరాలు పట్టేయటం వంటివి ఎదురవుతుంది. అందుకే మెరుగైన ఆరోగ్యానికి, ఎనర్జీకి, చర్మం మెరిసేందుకు నీరు ఎక్కువ తాగాలి. బరువు తగ్గాలన్నా, క్యాన్సర్ ముప్పు తగ్గించుకోవాలన్నా సరైనా మోతాడులో నీరు తాగడం అవసరం.

Food Myths And Facts4

Food Myths And Facts

ఆహారంలో ఉప్పు వినియోగం ఎలా ఉండాలి..?

ఉప్పును తగ్గించి తినడం మంచిదే, కానీ పూర్తిగా మానేయడం మాత్రం చాలా అనారోగ్యకరం. శరీరంలో ఉప్పు తగ్గితే తల తిరగడం, కళ్ళు తిరిగి పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు కోమాలోకి కూడా వెళ్లే ప్రమాదం ఉంటుంది.. కనుక ఉప్పు తినడం మానకూడదు. కాకపోతే ఎంత తినాలి అన్నది తెలుసుకోవాలి. మన శరీరానికి సరిపడా ఉప్పును తింటే కండరాల్లో కదలికలు బాగుంటాయి. నాడుల్లో సమాచార ప్రసారం చక్కగా జరుగుతుంది. జీవక్రియ కూడా చక్కగా ఉంటుంది. ఉప్పంటే సోడియం క్లోరైడ్. దీంట్లో 39శాతం సోడియం, 61శాతం క్లోరిన్ ఉంటాయి. అందుకే ఉప్పును సోడియం క్లోరైడ్‌గా భావిస్తారు. ఉప్పు మన శరీరంలోకి చేరాక సోడియం క్లోరైడ్ అయాన్స్‌‌గా విడిపోతాయి. ఇక సోడియం కణాలలోని ద్రవాలను పెరగకుండా, తగ్గకుండా నియంత్రణలో ఉంచుతుంది. దీనివల్లే నాడులు, కండరాలు చక్కగా పనిచేస్తాయి. ఉప్పు తినడం మానేస్తే కణాల లోపల ఒత్తిడి పెరిగిపోతుంది. దీనివల్ల వాటి లోని ద్రవాల్లో సమతుల్యం దెబ్బతింటుంది. దీనివల్ల కణాల్లో నీరు అధికంగా పేరుకుపోయి వాపుకు దారితీస్తుంది. దీంతో ఒళ్లంతా ఉబ్బిపోయినట్టు కనిపిస్తుంది. పరిస్థితి బాగా విషమిస్తే ఆ కణాలు పగిలిపోయి ప్రాణాంతకంగా మారతాయి. కాబట్టి ఉప్పును ప్రతిరోజు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అధికంగా తీసుకోకుండా మితంగా తీసుకుంటే మంచిది.

ఉప్పు అధిక వినియోగంతో హార్ట్‌ ఎటాక్‌ల ప్రమాదం పెరుగుతుంది. మనం రోజూ తినే ఆహారంలో ఉప్పు ఎక్కువైతే, అందులోని సోడియం వల్ల రక్త పోటు పెరుగుతుంది. అధిక రక్తపోటు వల్ల గుండె కూడా ఎక్కువ ప్రభావితం అవుతుంది. కిడ్నీల పనితీరుపైనా ఇది చెడు ప్రభావాన్ని చూపుతుంది. మెదడుకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం ఉంది. పక్షవాతం వచ్చే అవకాశాలూ ఉంటాయి. కాబట్టి, ఉప్పు విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక మనిషికి రోజుకు 2 నుంచి 3 గ్రాముల వరకు ఉప్పు అవసరం. అంతకంటే ఎక్కువ తినడం వల్ల కార్డియో వాస్క్యులర్‌ సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఉప్పును పూర్తిగా మానేయకుండా… అలాగని అతిగా తినకుండా జాగ్రత్త పడాలి. రోజుకు ఒక స్పూను మించకుండా తినడం మంచిది.

Food Myths And Facts5

Food Myths And Facts

దొండకాయ తింటే మతిమరుపు వస్తుందా..?

మనిషి ఆరోగ్యానికి అన్ని రకాల కూరగాయలు తప్పనిసరి. కానీ, కొంతమంది దొండకాయ కూరకు ఆమడ దూరంలో ఉంటారు. పిల్లలకు పెట్టడానికైతే అస్సలు ఆసక్తి చూపరు. దొండకాయ తింటే మతి మరుపు, మందబుద్ధి లాంటివి వస్తాయని నమ్ముతుంటారు. అయితే ఇలా భావించడానికి శాస్త్రీయమైన ఆధారాలు ఏమీ లేవు. పైగా, దొండకాయ తినడం వల్ల తెలివితేటలు పెరుగుతాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. దొండకాయలో మన ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు విటమిన్‌ బీ1, బీ2, బీ3, బీ6, బీ9లు ఎక్కువగా ఉంటాయి. దొండకాయలో సమృద్ధిగా బీటా కెరోటిన్‌ లభిస్తుంది. అది విటమిన్‌ ఏగా మారి దృష్టి లోపాలను సరిచేస్తుంది. బరువు తగ్గాలని అనుకునే వారికి దొండకాయ చక్కగా ఉపయోగపడుతుంది. దీంట్లో యాంటీ ఒబెసిటీ లక్షణాలు ఉన్నాయి. జీవక్రియ రేటును పెంచి కొవ్వు కణాలను కరిగించడంలో ఇది సహకరిస్తుంది. ఐరన్‌ లోపం ఉన్నవారికి మేలు చేస్తుంది. చాలా మంది దొండకాయ తింటే మతిమరుపు, మందబుద్ధి వస్తాయని అనుకుంటారు. అయితే ఇది నరాల వ్యవస్థను బలోపేతం చేసి అల్జీమర్స్‌ లాంటి వాటి లక్షణాలను తగ్గిస్తుందని అధ్యయనాల్లో తేలింది.

డయాబెటిక్‌లకు దొండకాయ ఔషధంగా చెబుతారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా దొండకాయను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర శాతం నియంత్రణలో ఉంటుంది. కిడ్నీస్టోన్‌ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు వారానికి రెండు సార్లైనా దొండకాయ తినాలి. ఇది రాళ్లు ఏర్పడటాన్ని నియంత్రిస్తుంది. దీంట్లో ఉండే ఆల్కలాయిడ్లు, ఫ్లేవనాయిడ్లు, గ్లైకోసైడ్లలాంటివి అలర్జీలను దరి చేరనివ్వవు. ఒక వేళ ఎవరైనా అలర్జీలతో బాధ పడుతున్నట్లయితే ఇవి వాటిని తగ్గిస్తాయి. దొండకాయ శరీరంలో ఫ్రీరాడికల్స్‌ ఏర్పడటాన్ని నిరోధిస్తుంది. అలాగే యాంటీ ఏజింగ్‌గా పని చేస్తుంది. ఆస్తమా, జాండిస్‌, లెప్రసీ లాంటి వాటి లక్షణాలను తగ్గిస్తుంది. అలాగే కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, పాస్ఫరస్‌, పొటాషియం, సోడియం, జింక్‌ వంటి పోషకాలూ పుష్కలంగా ఉంటాయి. ఇన్ని ఉన్నాయి కాబట్టే ఎన్నో ఆరోగ్య సమస్యలను ఇవి నివారిస్తాయి.

గుడ్లు ఎక్కువగా తింటే కూడా అనర్థమే..!

రోజూ ఉదయాన్నే ఓ గ్లాసు పాలు, ఒక గుడ్డు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని మన పెద్దలతో పాటు వైద్యులు కూడా పదే పదే చెబుతుంటారు. ఎందుకంటే గుడ్డులో అనేక పోషకాలున్నాయి. ఇందులో ముఖ్యంగా ప్రొటీన్లు, విటమిన్లు, ఐరెన్ లభిస్తాయి. గుడ్డులో అధిక మొత్తంలో జింక్, విటమిన్లు B6, B12 ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. తద్వారా ఫ్లూ, జలుబును నివారించవచ్చు. అలాగే, గుడ్డు విటమిన్ డి మంచి మూలం. ఇది ఎముకలను బలంగా ఉంచుతుంది. గుడ్డు పచ్చసొన లేదా ఉడకబెట్టిన గుడ్లలోని పసుపు భాగంలో లుటిన్, జియాక్సంతిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్లను కాపాడతాయి. గుడ్లు చర్మానికి కూడా మేలు చేస్తాయి. అయితే, ఎక్కువ గుడ్లు తినడం వల్ల కొన్ని అనర్థాలు కూడా ఉన్న మాట వాస్తమేనంటున్నారు నిపుణులు.

ఎక్కువగా గుడ్లు తింటే, జీర్ణవ్యవస్థ చెడిపోతుంది. కడుపు నొప్పితో ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొందరికి గుడ్లు తింటే ఎలర్జీ కూడా ఉంటుంది. కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు గుడ్లు ఎక్కువగా తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కోడిగుడ్డు పచ్చసొనను ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. గుడ్డు పచ్చసొనలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అందుకే మితంగా తీసుకుంటే, గుడ్లు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. శరీరానికి అనేక రకాల పోషకాలను అందిస్తాయి. రోజూ ఒక గుడ్డు తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్య ఉండదంటున్నారు. శరీర అవసరాన్ని బట్టి ఎన్ని గుడ్లు తినాలి అనేది వైద్యుల సలహాను అనుసరించాల్సి ఉంటుంది. అలాగే, గుడ్డు జీర్ణం కావడానికి కొంత ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి తీవ్ర అనారోగ్య సమస్యలున్న వారు వైద్యుల సలహా మేరకు మాత్రమే గుడ్డును తింటే మంచిది.

Food Myths And Facts6

Food Myths And Facts

పాలకూర టమాటాలు వండి తింటే ప్రమాదమేనా..?

పాలకూర, టమాటాలు వండి తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా..? అంటే కొంతమంది విషయంలో ఇది వాస్తమేనంటున్నారు నిపుణులు. కానీ, అందరిలో ఇలాంటి రాళ్లు ఏర్పడవు. కొంతమందిలో మాత్రమే ఇలాంటి సమస్య వస్తుంది. పాలకూరలో విటమిన్లు, ఖనిజ లవణాలు, కాల్షియం, పొటాషియం, సి-విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా అద్భుతమైన కూరగాయ టమాటా. విటమిన్లు, ఖనిజ లవణాలు, కాల్షియం, పొటాషియం, సి-విటమిన్‌ పుష్కలంగా ఉంటాయి. టమాటాలో ఎన్నో విలువైన ఖనిజ లవణాలు, విటమిన్లు, పొటాషియం ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు, రాళ్లు ఏర్పడే తత్త్వం ఉన్నవాళ్లు పాలకూర, టమాటాలను కలిపి తినకూడదు. పరిమిత స్థాయిలో పాలకూర, టమాటను కలిపి మితంగా తింటే ఎలాంటి ప్రమాదమూ లేదని చెబుతున్నారు. యూరిన్‌ ఇన్ఫెక్షన్‌.. తద్వారా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి. రోజూ నీళ్లు ఎక్కువగా తాగితే కిడ్నీలో రాళ్ల సమస్య ఉండదు.

మరిన్ని ప్రీమియం కథనాల కోసం.. TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి