
ప్రకృతి మనకు ఎన్నో రకాల పోషకపదార్థాలను, సహజ సిద్ధమైన ఔషధాలను అందజేసింది.. అలాంటి వాటిలో బూడిద గుమ్మడికాయ ఒకటి.. దీనిలో ఎన్నో రకాల పోషకాలు, ఖనిజాలు దాగున్నాయి.. అన్ని కాయలతో పోలిస్తే.. బూడిద గుమ్మడి మన ఆరోగ్యంపై ఎంతో సానుకూల ప్రభావం చూపుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పల్లెటూళ్ళలో సులభంగా లభించే ఈ కూరగాయ, కొత్త ఇంట్లో దిష్టి నివారణ కోసం వాడడం సర్వసాధారణం. అయితే, దీనిలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. ఇది బరువు తగ్గడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కీలక పాత్ర పోషిస్తుంది.
బూడిద గుమ్మడిలో కేలరీల శాతం అత్యంత తక్కువ. 100 గ్రాముల బూడిద గుమ్మడిలో కేవలం సుమారు 10 కేలరీలు మాత్రమే ఉంటాయి. దీనిలో 95-96% నీరే ఉంటుంది. అందువల్ల, దీనిని “జీరో కేలరీ” ఆహారంగా పరిగణించవచ్చు.. ఉదాహరణకు, 300 ml బూడిద గుమ్మడి జ్యూస్ తాగినప్పటికీ, 30 కేలరీలు కూడా లభించవు. ఇది కూరగాయలలోనే అత్యంత తక్కువ కేలరీలు కలిగినదిగా నిలుస్తుంది. కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ, ఇది విటమిన్లు, మినరల్స్‌ను సమృద్ధిగా అందిస్తుంది. ఈ పోషకాలు శరీరానికి అవసరమైన లవణాలను అందించి, ఆరోగ్యంగా ఉంచుతాయని.. నిపుణులు చెబుతున్నారు.
బూడిద గుమ్మడిలో కేలరీలు తక్కువగా ఉండటం.. నీటి శాతం ఎక్కువగా ఉండటం, ఫైబర్ అధికంగా ఉండటం వలన బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక ఆదర్శవంతమైన ఆహారం. దీనిని తీసుకోవడం వలన కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.. తద్వారా అనవసరమైన ఆహారపు కోరికలు తగ్గి, ఎక్కువ కేలరీలు తీసుకోకుండా నివారిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను కూడా శుభ్రపరుస్తుంది. దీంతోపాటు.. కొలెస్ట్రాల్ ను కూడా తగ్గించేలా చేస్తుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు బూడిద గుమ్మడి ఒక వరం. దీని తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా బూడిద గుమ్మడిని ఆహారంలో భాగం చేసుకోవడం వలన చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
బూడిద గుమ్మడిని అనేక విధాలుగా ఆహారంలో చేర్చుకోవచ్చు.
కూరలు: లేత బూడిద గుమ్మడికాయలతో కూరలు వండుకోవచ్చు. కొబ్బరి పాలు, టమాటా పేస్ట్ కలిపి తయారుచేసే “బూడిద గుమ్మడికాయ కూటు” చాలా రుచిగా ఉంటుంది. ఇది పుల్కా వంటి వాటితో తినడానికి చాలా బాగుంటుంది. వడియాలు పట్టుకుని, వాటిని వేపుకుని తినడం కూడా ఒక పద్ధతి. అయితే, ఎక్కువ వేగకుండా చూసుకోవాలి, లేకపోతే పోషక విలువలు దెబ్బతింటాయి.
జ్యూస్: బూడిద గుమ్మడి జ్యూస్ కూడా ఒక అద్భుతమైన ఆరోగ్య పానీయం. జ్యూస్ తయారుచేయడానికి, తొక్క తీసి, గింజలు తొలగించి, కండను మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. వడకట్టి, తేనె, నిమ్మరసం కలుపుకుని తాగవచ్చు. అచ్చంగా బూడిద గుమ్మడి జ్యూస్ తాగలేకపోతే, టమాటా కలిపి తాగవచ్చు. టమాటా కలిపితే జ్యూస్‌కి రంగు, రుచి వస్తాయి.
వెజిటబుల్ జ్యూస్‌లో భాగం: క్యారెట్, బీట్‌రూట్, టమాటా, కీరదోసకాయ వంటి ఇతర కూరగాయలతో కలిపి జ్యూస్ చేసేటప్పుడు, కీరదోసకాయకు బదులుగా బూడిద గుమ్మడిని ఉపయోగించవచ్చు. ముందుగా బూడిద గుమ్మడి ముక్కలు, టమాటాలు గ్రైండ్ చేసి, తరువాత క్యారెట్, బీట్‌రూట్ వంటివి వేసి నీళ్లు కలపకుండా జ్యూస్ చేసుకోవచ్చు.
పల్లెటూళ్ళలో బూడిద గుమ్మడి ఉచితంగా లభిస్తుంది.. కాబట్టి, వారు తరచుగా దీనిని ఉపయోగించుకోవచ్చు. పట్టణాలలో ఖరీదు ఎక్కువ కాబట్టి, లభించినప్పుడు, అందుబాటులో ఉన్నప్పుడు దీని జ్యూస్‌ను సేవించడం మంచిది. ఉదయం బూడిద గుమ్మడి జ్యూస్, సాయంత్రం వెజిటబుల్ జ్యూస్ తాగడం వల్ల పండ్ల రసాలు తాగకపోయినా శరీరానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇది ఎవరికీ హాని కలిగించదు.. పోషకాలు అందిస్తుంది.
బూడిద గుమ్మడి అనేది తక్కువ ఖర్చుతో కూడిన, అధిక పోషక విలువలు కలిగిన ఒక అద్భుతమైన కూరగాయని.. దాదాపు అందరూ తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..