
మటన్ అంటే చాలామందికి ఇష్టమైన ఆహారం. దాని రుచి, పోషకాల కారణంగా దీనిని ఎక్కువగా తింటుంటారు. కానీ ఎర్ర మాంసాన్ని దానిని అతిగా తీసుకుంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల జరిగిన కొన్ని పరిశోధనలు ఈ విషయంలో మరింత ఆందోళన కలిగించే విషయాలను వెల్లడించాయి.
గొడ్డు మాంసం, దూడ మాంసం, పంది మాంసం, గొర్రె, మేక మాంసం వంటి జంతువుల నుండి వచ్చే మాంసాన్ని ఎర్ర మాంసం అంటారు. దీనికి ఎరుపు రంగు రావడానికి కారణం మయోగ్లోబిన్ అనే ప్రోటీన్.
ఎర్ర మాంసంలో విటమిన్ బి12, ఐరన్, జింక్, బి-విటమిన్లు వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఇది శరీరానికి సులభంగా లభించే అధిక-నాణ్యత ప్రోటీన్‌కు కూడా మంచి మూలం. సుమారు 28 గ్రాములు మాంసంలో 7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అందుకే ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా దీనిని అప్పుడప్పుడు తీసుకోవడం మంచిది.
పోషకాలు ఉన్నప్పటికీ ఎర్ర మాంసాన్ని వారానికి ఒకసారి మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన మాంసాలైన హామ్, బేకన్, సలామీ వంటి వాటిలో సంతృప్త కొవ్వులు, సోడియం ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయి.
గుండె జబ్బులు: ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధన ప్రకారం.. రోజుకు 50 గ్రాముల ప్రాసెస్ చేసిన ఎర్ర మాంసం తినేవారిలో గుండె జబ్బుల ప్రమాదం 18 శాతం పెరుగుతుంది.
డయాబెటిస్: ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీ పత్రికలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. రోజుకు రెండు ముక్కల హామ్ వంటి ప్రాసెస్ చేసిన మాంసం తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 15 శాతం పెరుగుతుంది.
కొలెస్ట్రాల్: ఎర్ర మాంసం శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.
క్యాన్సర్: ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎర్ర మాంసాన్ని గ్రూప్ 2A క్యాన్సర్ కారకంగా వర్గీకరించింది. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఎర్ర మాంసం, కొలొరెక్టల్ క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్‌లతో ముడిపడి ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
ఎర్ర మాంసం పోషకాలను అందిస్తున్నప్పటికీ దానిని మితంగా మాత్రమే తీసుకోవడం మంచిది. ప్రాసెస్ చేసిన మాంసాలను వీలైనంత వరకు దూరం పెట్టాలి. ఆరోగ్యకరమైన జీవితం కోసం సమతుల్య ఆహారం తీసుకోవడం, తాజా మాంసాన్ని ఎంచుకోవడం, శారీరక శ్రమ చేయడం అవసరం.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..