Doodh Soda: పాలు, సోడా కలిపి ఎప్పుడైనా తాగారా? దేశ విభజన నాటి ఈ పానీయం ఇప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతోంది?

పాలు, సోడా.. ఈ రెండింటి కాంబినేషన్ వినడానికి కాస్త వింతగా ఉన్నా, రుచిలో మాత్రం దీనికి సాటి లేదంటున్నారు ఆహార ప్రియులు. విభజనకు ముందు నుంచే భారత్, పాకిస్థాన్‌లలో ప్రాచుర్యంలో ఉన్న ఈ 'దూద్ సోడా' ఇప్పుడు వెండితెరపై మెరిసింది. అటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి దీని విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Doodh Soda: పాలు, సోడా కలిపి ఎప్పుడైనా తాగారా? దేశ విభజన నాటి ఈ పానీయం ఇప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతోంది?
Doodh Soda Recipe

Updated on: Dec 25, 2025 | 1:55 PM

సినిమా ప్రభావం ఆహారపు అలవాట్లపై కూడా ఉంటుందని మరోసారి నిరూపితమైంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో, రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో వస్తున్న ‘ధురంధర్’ సినిమాలో కరాచీ జ్యూస్ సెంటర్ నేపథ్యంలో వచ్చే సన్నివేశం వల్ల ‘దూద్ సోడా’ అనే పాతకాలపు పానీయం మళ్లీ వెలుగులోకి వచ్చింది. సినిమాలో గౌరవ్ గేరా (మొహమ్మద్ ఆలం) నడిపే జ్యూస్ స్టాల్ గూఢచారుల అడ్డాగా కనిపించడం, అక్కడ ఈ పానీయాన్ని ప్రస్తావించడం ఇప్పుడు ఆహార ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది.

అసలు ఏమిటీ దూద్ సోడా? చల్లని పాలు, నిమ్మ లేదా లైమ్ ఫ్లేవర్ ఉన్న కార్బొనేటెడ్ సోడా కలిపి చేసే మిశ్రమాన్నే ‘దూద్ సోడా’ అంటారు. వినడానికి కొత్తగా ఉన్నా, సోడాలోని ఘాటు పాలలోని చిక్కదనాన్ని తగ్గిస్తూ వేసవిలో మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. మండుతున్న ఎండల్లో ఈ పానీయం శరీరానికి ఎంతో శక్తిని ఇస్తుందని పాకిస్థాన్, ఉత్తర భారతదేశంలోని ప్రజలు నమ్ముతారు.

చారిత్రక నేపథ్యం: దీని మూలాలు విక్టోరియన్ ఇంగ్లాండ్‌లో ఉన్నప్పటికీ, ఉమ్మడి పంజాబ్‌లో ఇది బాగా ప్రాచుర్యం పొందింది. ఆ కాలంలో పాలు సమృద్ధిగా లభించేవి, దీంతో సోడాను కలిపి ప్రయోగాత్మకంగా ఈ పానీయం తయారు చేశారు. 1947 విభజన తర్వాత ఇది పాకిస్థాన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన పానీయంగా మారింది. ముఖ్యంగా రంజాన్ మాసంలో ఇఫ్తార్ సమయంలో దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కొందరు ఇందులో ‘రూహ్ అఫ్జా’ లాంటి సిరప్‌లను కూడా కలుపుతుంటారు. భారత్ లోని పాత ఢిల్లీ, అమృత్‌సర్ ప్రాంతాల్లో ఇప్పటికీ ఇది లభిస్తోంది.

ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలా.. దీని తయారీ చాలా సులభం. ముందుగా ఒక గ్లాసులో చిక్కని చల్లని పాలను తీసుకోవాలి. అందులో తగినంత పంచదార వేసి కలిపిన తర్వాత, నిమ్మ లేదా లైమ్ ఫ్లేవర్ ఉన్న సోడాను నెమ్మదిగా పోయాలి. సోడా పోసేటప్పుడు గ్యాస్ పోకుండా జాగ్రత్తగా కలపాలి. తయారైన వెంటనే తాగితేనే దీని అసలు రుచి తెలుస్తుంది.