ఇంట్లోనే కొబ్బరి పీచుతో ఆర్గానిక్ కోకోపీట్.. ఈజీగా తయారు చేసుకోండిలా!

ఇంటి ఆవరణలో లేదా బాల్కనీలో పూల కుండీలు, కూరగాయల మొక్కలు పెంచేవారికి కోకోపీట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొక్కల మట్టి గట్టిపడకుండా తేలికగా ఉండేందుకు, నీటిని ఎక్కువ సేపు పట్టి ఉంచేందుకు కోకోపీట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే నర్సరీల్లో లేదా ఆన్‌లైన్‌లో దీని ధర కాస్త ఎక్కువే ఉంటుంది. మనం వంటలకు లేదా పూజలకు వాడిన కొబ్బరికాయల పీచుతో ఇంట్లోనే ఉచితంగా, ఎంతో సులభంగా కోకోపీట్ తయారు చేసుకోవచ్చు.

ఇంట్లోనే కొబ్బరి పీచుతో ఆర్గానిక్ కోకోపీట్.. ఈజీగా తయారు చేసుకోండిలా!
Cocopeat Diy

Updated on: Oct 07, 2026 | 8:43 PM

సాధారణంగా మనం కొబ్బరికాయలు కొట్టిన తర్వాత లభించే పీచును చెత్తబుట్టలో పడేస్తుంటాం. కానీ, హోమ్ గార్డెనింగ్ చేసేవారికి, మొక్కల పెంపకంపై ఆసక్తి ఉన్నవారికి ఈ కొబ్బరి పీచు అత్యంత విలువైనది. మార్కెట్‌లో అధిక ధరకు లభించే కోకోపీట్‌ను ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇది కుండీల్లోని మట్టిని తేలికగా, తేమగా ఉంచడమే కాకుండా, మొక్కల వేళ్లకు గాలి సజావుగా అందేలా చేసి వేగంగా పెరిగేందుకు సహాయపడుతుంది.

కోకోపీట్ ఎందుకు అవసరం?

కొబ్బరి బొండాలు లేదా కొబ్బరికాయల పీచు నుంచి తయారయ్యే ఈ పొడి మట్టిలో తేమను ఎక్కువ కాలం నిలిపి ఉంచుతుంది. నిరంతరం నీరు పోయాల్సిన అవసరం లేకుండా మొక్కల వేళ్లను తేమగా ఉంచుతుంది. అలాగే మట్టి గట్టిపడకుండా గాలి ఆడటానికి తోడ్పడుతుంది. అయితే, దీనిలో నేరుగా పోషకాలు ఉండవు కాబట్టి, ఇది మట్టి నిర్మాణం, తేమ నిర్వహణకు మాత్రమే ఉపయోగపడుతుంది.

తయారీ విధానం:

సేకరణ, ఎండబెట్టడం: ముందుగా ఇంట్లో మిగిలిపోయిన పొడి కొబ్బరి పీచును సేకరించండి. పీచు తడి లేకుండా 2-3 రోజులు ఎండలో బాగా ఎండబెట్టాలి. ఎండిన పీచును కత్తెర సహాయంతో వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకోవాలి. ఇలా చేయడం వల్ల మిక్సీలో గ్రైండ్ చేయడం సులువవుతుంది. కత్తిరించిన పీచు ముక్కలను మిక్సీ జార్‌లో వేసి బాగా గ్రైండ్ చేయాలి.

ఇవి కూడా చదవండి

మిక్సీ పట్టిన తర్వాత వచ్చిన మిశ్రమాన్ని నూకలు పట్టే జల్లెడతో జల్లించాలి. జల్లెడ కింద పడిన సన్నని పొడే అసలైన ఆర్గానిక్ కోకోపీట్. జల్లెడ పైన మిగిలిపోయిన పీచు ముక్కలను పడేయకుండా కుండీల అడుగున డ్రైనేజీ కోసం లేదా మల్చింగ్ కోసం వాడుకోవచ్చు.

ఎలా ఉపయోగించాలి?:

కొత్తగా మొక్కలు నాటేటప్పుడు లేదా విత్తనాలు మొలకెత్తించేటప్పుడు 40శాతం సాధారణ మట్టి, 30శాతం కోకోపీట్, 30శాతం వర్మీ కంపోస్ట్ లేదా పశువుల ఎరువు కలిపి కుండీల్లో నింపుకోవాలి. విత్తనాలు త్వరగా మొలకెత్తడానికి, మొక్కల వేళ్లు బలంగా విస్తరించడానికి ఈ మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది.

సో..వ్యర్థంగా పడేసే కొబ్బరి పీచుతో ఉచితంగా కోకోపీట్ తయారు చేసుకుని మీ గార్డెనింగ్‌ను మరింత పచ్చగా, బడ్జెట్ ఫ్రెండ్లీగా మార్చుకోండి!

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us