
కరోనా మహమ్మారి ముగిసిపోయినప్పటికీ, అది మానవ శరీరంపై వదిలివెళ్లిన దుష్ప్రభావాలు మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా, భారతీయ వైద్య నిపుణులు ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. సాధారణంగా వృద్ధులలో లేదా 60 ఏళ్లు పైబడిన వారిలో కనిపించే నడుము నొప్పులు, కీళ్ల సమస్యలు ఇప్పుడు 30 ఏళ్ల వయసున్న భారతీయ యువతలో తీవ్రంగా కనిపిస్తున్నాయి. ఎంతో మంది యువతీ యువకులు హఠాత్తుగా హిప్ రిప్లేస్‌మెంట్ (నడుము కీలు మార్పిడి) శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తోందని వైద్యులు చెబుతున్నారు.
వైద్య పరిభాషలో ఈ సమస్యను అవాస్కులర్ నెక్రోసిస్ (Avascular Necrosis – AVN) లేదా బోన్ డెత్ అని పిలుస్తారు. కోవిడ్ బారిన పడినప్పుడు రోగుల ప్రాణాలను కాపాడటానికి వైద్యులు స్టెరాయిడ్స్ (Steroids) ను ఎక్కువగా ఉపయోగించారు. ఈ స్టెరాయిడ్ల వాడకం వల్ల లేదా కోవిడ్ వైరస్ నేరుగా రక్తనాళాలపై చూపే ప్రభావం వల్ల, నడుము కీలు భాగానికి (Femur Head) జరిగే రక్తప్రసరణ ఆగిపోతుంది. రక్తం అందకపోవడంతో ఆ ప్రాంతంలోని ఎముక కణజాలం క్రమంగా బలహీనపడి, కుళ్ళిపోయి ముక్కలవుతుంది.
ఈ సమస్య బారిన పడిన యువకులు తీవ్రమైన నడుము నొప్పి, నడవడానికి, కూర్చోవడానికి ఇబ్బంది పడుతూ ఆసుపత్రులకు వస్తున్నారు. వ్యాధి ముదిరిన స్టేజ్-3 లేదా స్టేజ్-4 లో ఉన్న రోగులకు హిప్ రిప్లేస్‌మెంట్ సర్జరీ ఒక్కటే మార్గమని వైద్యులు పేర్కొంటున్నారు. ఎంతో యాక్టివ్‌గా ఉండాల్సిన వయసులో ఇలాంటి మేజర్ సర్జరీలు అవ్వడం యువత భవిష్యత్తుపై, వారి వృత్తిపరమైన జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
గతంలో కోవిడ్ బారిన పడిన వారు లేదా స్టెరాయిడ్లు తీసుకున్న చరిత్ర ఉన్నవారు తమ నడుము, తొడలు లేదా మోకాళ్ల భాగంలో నిరంతరంగా నొప్పి ఉంటే వెంటనే ఆర్థోపెడిక్ వైద్యుడిని సంప్రదించాలి. ఎక్స్-రే (X-Ray) లలో ప్రాథమిక దశలో ఈ సమస్య సరిగ్గా కనిపించకపోవచ్చు, కాబట్టి ఎమ్‌ఆర్‌ఐ (MRI) స్కాన్ చేయించుకోవడం ద్వారా దీనిని ముందే గుర్తించవచ్చు. తొలి దశలోనే గుర్తిస్తే మందులు, వ్యాయామా, చిన్నపాటి చికిత్సల ద్వారా ఎముకను, కీళ్లను శస్త్రచికిత్స లేకుండా కాపాడుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..