సీతాఫలం తింటే శరీరంలో ఇన్ని జరుగుతాయా.. ఆశ్చర్యపోయే నిజాలు ఇవే..

మందుల షాపుల చుట్టూ తిరగడం కంటే.. వంటింట్లో, మార్కెట్లో దొరికే సహజసిద్ధమైన పండ్లను రోజూ తినడం వంద రెట్లు మేలని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా సీజన్‌లో దొరికే సీతాఫలం గుండెకే కాదు, ఆస్తమా రోగులకు కూడా ఎలా మేలు చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. కంటి చూపును మెరుగుపరిచే కివీ నుంచి జీర్ణవ్యవస్థను కాపాడే దోసకాయ దాకా.. ప్రతి రోజూ వీటిని ఎందుకు తినాలో తెలుసుకుందాం..

సీతాఫలం తింటే శరీరంలో ఇన్ని జరుగుతాయా.. ఆశ్చర్యపోయే నిజాలు ఇవే..
Health Benefits Of Custard Apple

Updated on: Nov 06, 2026 | 8:36 PM

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా నేటి కాలంలో అనేక రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పండ్లు, కూరగాయలు ఎంతగానో దోహదపడతాయని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రోజూ తీసుకునే ఆహారంలో సీజనల్ పండ్లను చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయని రేవాకు చెందిన ప్రముఖ డెంటల్ సర్జన్, ఫిట్‌నెస్ నిపుణురాలు డాక్టర్ ప్రతిభా సింగ్ సూచిస్తున్నారు. ముఖ్యంగా సీతాఫలం, కివీ వంటి పండ్లతో పాటు సిట్రస్ జాతి పండ్లు, దోసకాయలు ఆరోగ్యానికి అందించే ప్రయోజనాలు ఎనలేనివని ఆమె విశ్లేషించారు.

గుండె, ఊపిరితిత్తులకు శ్రీరామరక్ష.. సీతాఫలం

సీజన్‌లో విరివిగా లభించే సీతాఫలం రుచికి మాత్రమే కాదు, ఔషధ గుణాలకు కూడా పెట్టింది పేరు. సీతాఫలంలో ఉండే పొటాషియం, మెగ్నీషియం మూలకాలు రక్తనాళాలను విస్తరింపజేసి రక్తప్రసరణ సాఫీగా సాగేందుకు తోడ్పడతాయి. ఇది అధిక రక్తపోటును సమర్థవంతంగా తగ్గించడంతో పాటు గుండె సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. శ్వాసకోశ సమస్యలు, ఆస్తమాతో బాధపడేవారికి సీతాఫలం ఎంతో మేలు చేస్తుంది. ఇది ఊపిరితిత్తుల్లో వచ్చే వాపును తగ్గించడంతో పాటు వివిధ రకాల అలర్జీల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రోజూ మితంగా సీతాఫలం తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా మారుతుంది.

కంటి చూపును మెరుగుపరిచే కివీ పండు

ఆధునిక కాలంలో మొబైల్స్, ల్యాప్‌టాప్‌ల వాడకం వల్ల కంటి సమస్యలు సర్వసాధారణమైపోయాయి. వీటికి కివీ పండు అద్భుత పరిష్కారంగా నిలుస్తుంది.
కివీ పండులో అత్యంత శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ అయిన ‘ల్యూటిన్’ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి కణాలను హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి సంరక్షిస్తుంది. శుక్లాలు, చూపు మందగించడం వంటి సమస్యలను నివారించి, కంటి ఆరోగ్యాన్ని దీర్ఘకాలం మెరుగుపరచడంలో కివీ కీలకంగా పనిచేస్తుంది.

రోగనిరోధక శక్తికి బాసట.. సిట్రస్ జాతి పండ్లు

శరీరాన్ని సీజనల్ వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడటంలో సిట్రస్ జాతి పండ్లు మొదటి వరుసలో ఉంటాయి. వీటిలో విటమిన్-సి అత్యధిక పరిమాణంలో ఉంటుంది. శరీరంలో విటమిన్-సి లోపిస్తే ఇన్ఫెక్షన్ల ముప్పు వేగంగా పెరుగుతుంది. విటమిన్-సితో పాటు మెగ్నీషియం, విటమిన్ బి6, ఐరన్ వంటి పోషకాలు ఇందులో సమృద్ధిగా లభిస్తాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. మధుమేహం ఉన్నవారికి కూడా ఇవి ఎంతో మంచిది.

జీర్ణక్రియను సరిచేసే దోసకాయ

వంటింట్లో సులువుగా దొరికే దోసకాయ జీర్ణవ్యవస్థ పనితీరుకు సంజీవనిలా పనిచేస్తుంది. దోసకాయలో పీచుపదార్థం (ఫైబర్) పుష్కలంగా ఉండటంతో పాటు అధిక శాతం నీరు ఉంటుంది. ఇది పేగుల కదలికలను సులభతరం చేసి, తీవ్రమైన మలబద్ధకం, విరేచనాలు వంటి ఉదర సంబంధిత సమస్యలను నివారిస్తుంది. జీర్ణవ్యవస్థను చల్లబరిచి, శరీరంలోని విష వ్యర్థాలను బయటకు పంపడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యానికి కృత్రిమ సప్లిమెంట్ల కంటే సహజసిద్ధంగా దొరికే ఇలాంటి పండ్లు, కూరగాయలను నిత్యం ఆహారంలో భాగంగా చేసుకోవడమే సరైన మార్గమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us