ఏది పడితే అది వద్దు.. కోడి కాళ్లను ఇలా ఒక్కసారి తిని చూడండి.. ఆ రోగాల మాటే ఉండదు..

ఆదివారం వచ్చిందంటే నాన్‌వెజ్ ప్రియులకు పండగే..! చికెన్‌, మటన్‌, ఫిష్‌తో రకరకాల వంటకాలు చేసుకుని ఇష్టంగా తింటుంటారు. అయితే ఈసారి రెగ్యులర్ చికెన్‌కు బదులుగా కోడి కాళ్ల రోస్ట్‌ ట్రై చేయండి. కొల్లాజెన్‌, ప్రొటీన్లు, జెలాటిన్‌ వంటి పోషకాలు ఉండే కోడి కాళ్లను మసాలాలతో దట్టించి రుచికరంగా రోస్ట్‌ చేసుకోవచ్చు. అన్నం, చపాతీల్లోకి అదిరిపోయే ఈ స్పైసీ కోడి కాళ్ల రోస్ట్‌ను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..

ఏది పడితే అది వద్దు.. కోడి కాళ్లను ఇలా ఒక్కసారి తిని చూడండి.. ఆ రోగాల మాటే ఉండదు..
Chicken Feet Roast

Updated on: Aug 16, 2026 | 1:12 PM

ఆదివారం వచ్చిందంటే చాలు నాన్‌వెజ్ ప్రియులు చికెన్, మటన్, ఫిష్ ను ఇష్టంగా కొనుగోలు చేసి.. వండుకుని తింటారు. కర్రీ, ఫ్రై అలాగే పలు రకాల పద్దతుల్లో వంటలను వండుకుంటారు.. అయితే.. చాలా మంది కోడిమాంసం (చికెన్) ను ఇష్టంగా తింటారు. అయితే.. కోడి మాంసం వలె.. కోడి కాళ్లల్లో కూడా అద్భుతమైన పోషకాలు దాగున్నాయి.. కోడి కాళ్లలో (కోడి పాదాలు) కొల్లాజెన్, ప్రొటీన్లు, జెలాటిన్ పుష్కలంగా ఉంటాయి. వీటిని సూప్ రూపంలో లేదా కర్రీ, రోస్ట్ లాగా వండుకుని తినొచ్చు.. అయితే.. కోడి కాళ్లల్లోని పోషకాలు.. కీళ్ల నొప్పులు తగ్గించడంతోపాటు చర్మం కాంతివంతంగా మారేలా చేస్తాయని.. అలాగే ఎముకలు బలంగా మారేలా చేస్తాయని పేర్కొంటున్నారు డైటీషియన్లు.. వీటితోపాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు. అయితే.. కోడి కాళ్ళ రోస్ట్ తింటే.. ఆ టేస్టే వేరు.. ముఖ్యంగా కోడి కాళ్ళను వేయించి, సుగంధభరితమైన మసాలాలతో దట్టించి తయారుచేసే ఈ అద్భుతమైన వంటకం.. ఎప్పుడైనా ఒక అదనపు ఆకర్షణగా నిలుస్తుంది.

కోడి కాళ్ళ రోస్ట్‌కు కావాల్సిన పదార్థాలు:

కోడి కాళ్ళు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె (వేయించడానికి సరిపడా), ఉల్లిపాయలు (సన్నగా తరిగినవి), పచ్చిమిర్చి (మధ్యకు చీల్చినవి), కరివేపాకు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, మిరియాల పొడి, నిమ్మరసం, కొత్తిమీర (చివరగా అలంకరణకు)

తయారీ విధానం:

మొదటి దశ – మ్యారినేషన్: ముందుగా కోడి కాళ్ళను శుభ్రంగా కడిగి, వాటికి అక్కడక్కడ గాట్లు పెట్టుకోవాలి. ఒక గిన్నెలో కోడి కాళ్ళు తీసుకుని, తగినంత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి, చేతులతో బాగా కలిపి కాళ్ళకు మసాలా దట్టించాలి. దీనిని కొంత సమయం పక్కన పెట్టుకోవాలి.

రెండో దశ – వేయించడం: ఒక మందపాటి మూకుడు లేదా కడాయిని పొయ్యి మీద పెట్టి, అందులో ఫ్రై కోసం కొంచెం ఎక్కువగానే నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, మధ్యకు చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.

మూడో దశ – మగ్గించడం: వేగిన ఉల్లిపాయ మిశ్రమంలో ముందుగా మసాలా పట్టించి పెట్టుకున్న కోడి కాళ్ళను వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి, మంటను చిన్నదిగా చేసి సుమారు పదిహేను నిమిషాల పాటు కోడి కాళ్ళను మగ్గనివ్వాలి. దీనివల్ల కాళ్ళు సగానికి పైగా ఉడుకుతాయి.

మసాలాలు కలపడం: పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి, తగినంత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, మిరియాల పొడి వేసి కోడి కాళ్ళకు పట్టేలా బాగా కలుపుకోవాలి.

మళ్ళీ మూత పెట్టి, మంటను మరింత తగ్గించి, మరో ఐదు నిమిషాల పాటు మసాలాలు కోడి కాళ్ళకు బాగా పట్టేలా ఉడికించుకోవాలి.

ఐదు నిమిషాల తర్వాత పొయ్యి కట్టేసి, మూత తీసి, తాజాగా పిండిన నిమ్మరసం వేసి కలుపుకోవాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరతో అలంకరించి ఒక సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుంటే రుచికరమైన కోడి కాళ్ళ రోస్ట్ సిద్ధంగా ఉంటుంది. ఇది అన్నంలోకి చపాతీల్లోకి అద్భుతంగా ఉంటుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us