భారతదేశంలో చూడాల్సిన 8 అద్భుతమైన పూల మార్కెట్లు.. రంగులు, సువాసనలతో కనువిందు చేసే ప్రదేశాలివే!
Famous Flower Markets in India: భారతదేశంలోని పూల మార్కెట్లు రంగురంగుల పూలు, అద్భుతమైన సువాసనలు, స్థానిక సంప్రదాయాలతో పర్యాటకులను ఆకట్టుకుంటాయి. కోల్‌కతాలోని ముల్లిక్ ఘాట్ నుంచి పుష్కర్‌లోని గులాబీ మార్కెట్ వరకు దేశంలో తప్పక సందర్శించాల్సిన 8 ప్రసిద్ధ పూల మార్కెట్లు, వాటి ప్రత్యేకతలు తెలుసుకుందాం.

Famous Flower Markets in India: సాధారణ పర్యాటక ప్రాంతాలకు భిన్నంగా కొత్త ప్రదేశాలను అన్వేషించాలనుకునే వారికి పూల మార్కెట్లు ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తాయి. తెల్లవారుజామునే ప్రారంభమయ్యే ఈ మార్కెట్లలో రంగురంగుల పూలు, వాటి సువాసనలు, వ్యాపారుల సందడి పర్యాటకులను ఆకట్టుకుంటాయి. దేవాలయాల పూజలు, పెళ్లిళ్లు, పండుగలు, ఇతర శుభకార్యాలకు పూలు ఎంత ముఖ్యమో ఈ మార్కెట్లను సందర్శిస్తే అర్థమవుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన 8 పూల మార్కెట్ల గురించి తెలుసుకుందాం.
1. ముల్లిక్ ఘాట్ పూల మార్కెట్ – కోల్‌కతా
కోల్‌కతాలోని హౌరా బ్రిడ్జి సమీపంలో హుగ్లీ నది ఒడ్డున ఉన్న ముల్లిక్ ఘాట్ పూల మార్కెట్ ఎంతో ప్రసిద్ధి చెందింది. 1855లో ఏర్పాటైన ఈ మార్కెట్‌లో తెల్లవారుజామునే వ్యాపారం మొదలవుతుంది. బంతి, గులాబీ, మందారం, మల్లె, తామర, సంపెంగ వంటి పూలతో ఈ ప్రాంతం సందడిగా కనిపిస్తుంది. హౌరా బ్రిడ్జి నేపథ్యం ఈ మార్కెట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
2. కేఆర్ పూల మార్కెట్ – బెంగళూరు
బెంగళూరులోని కృష్ణరాజేంద్ర మార్కెట్‌ను సిటీ మార్కెట్ అని కూడా పిలుస్తారు. 1928 నుంచి ప్రసిద్ధి చెందిన ఈ మార్కెట్‌లో బంతిపూలు, మల్లె, గులాబీలు, కలువలు, ఆర్కిడ్స్ తదితర పూలు లభిస్తాయి. పూల వ్యాపారంతో పాటు నగరంలోని సంప్రదాయ మార్కెట్ వాతావరణాన్ని ఆస్వాదించాలనుకునేవారికి ఇది మంచి ప్రదేశం.
3. ఘాజీపూర్ పూల మార్కెట్ – ఢిల్లీ
తూర్పు ఢిల్లీలో ఉన్న ఘాజీపూర్ ఫూల్ మండీ దేశ రాజధానిలోని ప్రధాన హోల్‌సేల్ పూల మార్కెట్లలో ఒకటి. ఇక్కడ గులాబీలు, బంతిపూలు, మల్లె, లిల్లీలు, కార్నేషన్లు, ఆర్కిడ్స్ వంటి అనేక రకాల పూలు విక్రయిస్తారు. పెద్ద వేడుకలు, వివాహాలు, ప్రత్యేక అలంకరణలకు అవసరమైన పూలను కూడా ఇక్కడ కొనుగోలు చేస్తారు.
4. దాదర్ పూల మార్కెట్ – ముంబై
ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఫూల్ గల్లీ పూల ప్రియులను ఆకర్షిస్తుంది. ఇక్కడ పూల దండలు, వివాహాలకు ఉపయోగించే బొకేలు, పూజా తోరణాలను ప్రత్యేకంగా తయారు చేస్తారు. బంతి, గులాబీ, సంపెంగ, మల్లె, తామర పూలతో పాటు అనేక విదేశీ రకాల పూలు కూడా అందుబాటులో ఉంటాయి.
5. కొచ్చి పూల మార్కెట్ – కేరళ
కేరళలోని కొచ్చి నగరంలో ఎర్నాకులం, మట్టాంచేరి ప్రాంతాల్లో పూల వ్యాపారం సందడిగా సాగుతుంది. సంప్రదాయ పూలతో పాటు హెలికోనియా, బర్డ్ ఆఫ్ ప్యారడైజ్, ఆంథూరియం వంటి ఉష్ణమండల పూలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
6. మండి పూల సాగు ప్రాంతాలు – హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్‌లోని మండి ప్రాంతం పూల సాగుకు ప్రసిద్ధి చెందుతోంది. ఇక్కడి పొలాలు, గ్రీన్‌హౌస్‌లలో గులాబీలు, లిల్లీలు, కార్నేషన్లు, గ్లాడియోలస్ వంటి పూలను సాగు చేస్తారు. ప్రకృతి అందాలను ఆస్వాదించడంతో పాటు పూల సాగు గురించి తెలుసుకోవాలనుకునేవారికి ఈ ప్రాంతం ఆసక్తికరంగా ఉంటుంది.
7. కోయంబత్తూరు పూల మార్కెట్ – తమిళనాడు
తమిళనాడులోని కోయంబత్తూరులో పూ మార్కెట్‌గా ప్రసిద్ధి చెందిన పూల మార్కెట్ స్థానిక సంప్రదాయాలతో ముడిపడి ఉంది. మల్లె, బంతి, గులాబీ, తామర, సంపంగి వంటి పూలతో పాటు వివిధ రకాల పూల దండలు ఇక్కడ లభిస్తాయి. దేవాలయాలు, వివాహాలు, పండుగల కోసం ప్రత్యేకంగా దండలు తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత.
8. పుష్కర్ పూల మార్కెట్ – రాజస్థాన్
రాజస్థాన్‌లోని పుష్కర్ గులాబీల సాగుకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి గులాబీలతో రోజ్ వాటర్, అత్తర్, గుల్కండ్, సుగంధ తైలాలు తయారు చేస్తారు. బంతి, సంపెంగ, కార్నేషన్లు, లిల్లీలు కూడా అందుబాటులో ఉంటాయి. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడి చేతిలోని తామర పువ్వు రేకులు పడిన ప్రదేశంతో పుష్కర్‌కు సంబంధం ఉందని విశ్వసిస్తారు.
పూల మార్కెట్లు కేవలం కొనుగోళ్లకు మాత్రమే పరిమితం కావు. స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానం, పండుగల ప్రాధాన్యతను దగ్గరగా తెలుసుకునేందుకు ఇవి మంచి అవకాశాన్ని కల్పిస్తాయి. కొత్త అనుభూతుల కోసం ప్రయాణాలు చేయాలనుకునేవారు ఈ ఎనిమిది ప్రదేశాలను తమ పర్యాటక జాబితాలో చేర్చుకోవచ్చు.




