
ఆరోగ్యకరమైన, ఒత్తైన జుట్టు కోసం మన ఇంట్లో పెద్దలు ఎప్పుడూ తలకు నూనె పెట్టుకోమని చెబుతుంటారు. అయితే, మనం నూనె పెట్టుకునే పద్ధతిలోనే పెద్ద తప్పు జరుగుతోందని అంటున్నారు ప్రముఖ హెయిర్ కేర్ నిపుణుడు జావేద్ హబీబ్. చాలామంది పొడి జుట్టుపై నూనె రాసి, గంటల తరబడి అలాగే ఉంచుకుంటారు. కానీ, ఈ పద్ధతి జుట్టును మెరుగుపరచడానికి బదులు మరింత పాడు చేస్తుందని ఆయన హెచ్చరించారు. జుట్టు రాలడం, చుండ్రు సమస్యలకు చెక్ పెట్టడానికి ఆయన ఒక సరికొత్త, సులువైన ప్రీ-కండిషనింగ్ (Pre-conditioning) విధానాన్ని నెటిజన్లతో పంచుకున్నారు.
షాంపూ ఎంత ఖరీదైనదైతే, అది జుట్టుకు అంత మంచిదని చాలా మంది నమ్ముతారు. కానీ అసలు విషయం ధర కాదని, మీ జుట్టు, తల చర్మం అవసరాలే ముఖ్యమని జావేద్ హబీబ్ అంటారు. దుకాణంలో అయినా లేదా ఆన్‌లైన్ షాపింగ్ యాప్‌లో అయినా, షాంపూ కొనేటప్పుడు చాలా మంది ఒక సాధారణ తప్పు చేస్తారు. ఖరీదైన బాటిల్ అంటే మంచి నాణ్యత, ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని భావిస్తారు. అందుకే చాలా మంది కేవలం బ్రాండ్, ధరను బట్టి షాంపూను ఎంచుకుంటారు. కానీ, ఖరీదైన షాంపూ ఎల్లప్పుడూ మంచిదేనా? ప్రముఖ హెయిర్ కేర్ నిపుణుడు జావేద్ హబీబ్ సమాధానం కాదు అని. ఆయన ప్రకారం, షాంపూ ప్రాథమిక ఉద్దేశ్యం జుట్టు, తల చర్మాన్ని శుభ్రపరచడం. ఒక షాంపూ ఖరీదైనది అయినంత మాత్రాన అది మీ జుట్టుకు ఉత్తమమైనది అవుతుందని గ్యారెంటీ లేదని అంటున్నారు.
జావేద్ హబీబ్ ప్రకారం, పొడి జుట్టుపై నూనె సరిగ్గా పని చేయదు. మనం కండిషనర్, సబ్బు లేదా షాంపూలను జుట్టు తడిగా ఉన్నప్పుడే ఎలా వాడతామో, నూనెను కూడా అలాగే వాడాలి. ఆయన సూచించిన 4-స్టెప్స్ ఫార్ములా ఇదే:
మొదటి స్టెప్: మొదటగా జుట్టును నీటితో కాస్త తడి చేయాలి.
రెండవ స్టెప్: ఆ తడి జుట్టుపై ఆవనూనె (Mustard Oil) లేదా మీకు నచ్చిన హెయిర్ ఆయిల్‌ను అప్లై చేయాలి. అయితే, నూనె రాసిన తర్వాత స్కాల్ప్‌ను గట్టిగా మసాజ్ చేయకూడదు.
మూడవ స్టెప్: జుట్టు పొడవుగా ఉంటే నూనె రాసిన తర్వాత మెల్లగా దువ్వుకోవాలి. ఆపై కేవలం 5 నుండి 10 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి.
నాల్గవ స్టెప్: ఆ తర్వాత ఏదైనా సాధారణ షాంపూ లేదా కుంకుడుకాయలు, శీకాకాయ్ వంటి సహజ సిద్ధమైన వాటితో జుట్టును శుభ్రంగా కడుక్కోవాలి.
జావేద్ హబీబ్ మరో ముఖ్యమైన విషయాన్ని చెప్పారు. ఉత్తర భారతదేశం వంటి ప్రాంతాలలో చెమట వల్ల తలలో చుండ్రు (Roosi) ఎక్కువగా చేరుతుంది. ఈ చుండ్రు జుట్టుకు విషం లాంటిది. అందువల్ల జుట్టును ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతిరోజూ తలస్నానం చేయాలని ఆయన సిఫార్సు చేస్తున్నారు. ప్రతిరోజూ పైన పేర్కొన్న విధంగా తడి జుట్టుకు నూనె రాసి, 5 నిమిషాల తర్వాత తలస్నానం చేయడం వల్ల 50 ఏళ్ల వయస్సు వచ్చేవరకు జుట్టు రాలడం లేదా విరగడం వంటి సమస్యలు రావని ఆయన నమ్మకంగా చెబుతున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
ఖరీదైన ప్రొడక్ట్స్ వాడితేనే జుట్టు బాగుంటుంది అనుకోవడం భ్రమ అని, సరైన పద్ధతిలో సాధారణ షాంపూ, నూనెను ఉపయోగించినా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని జావేద్ హబీబ్ స్పష్టం చేశారు. ఈ సులువైన చిట్కాను రోజూ పాటించడం ద్వారా ఇంట్లోనే సులభంగా ఒత్తైన, మెరిసే జుట్టును సొంతం చేసుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..