
మీ ముఖంపై ఉన్న నల్లటి మచ్చలు, మొటిమలు, పిగ్మెంటేషన్ మీ అందాన్ని తగ్గిస్తున్నాయని మీరు చింతిస్తున్నారా? అయితే, ఈ సమస్యలకు ఒక సహజమైన పరిష్కారం మీ వంటగదిలోనే ఉంది. అదే జాజికాయ. జాజికాయ కేవలం వంటల్లో వాడే మసాలా దినుసు మాత్రమే కాదు, చర్మ సంరక్షణలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలోని ఔషధ గుణాలు చర్మ సమస్యలను దూరం చేసి, సహజమైన కాంతిని అందిస్తాయి.
జాజికాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మొటిమలను కలిపే బ్యాక్టీరియాను చంపడంలో సహాయపడతాయి. వాపును తగ్గిస్తాయి. ముఖ్యంగా, జాజికాయ హైపర్‌పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో, చర్మపు రంగును సమానం చేయడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ఇది చర్మపు అల్లికను మెరుగుపరుస్తుంది. మచ్చలను మాయం చేస్తుంది.
జాజికాయ పొడిని నేరుగా చర్మంపై పూయడం కంటే, ఇతర సహజ పదార్థాలతో కలిపి ఉపయోగించడం మంచిది. ఇక్కడ కొన్ని సులభమైన మరియు ప్రభావవంతమైన రెమెడీలు ఉన్నాయి:
ఒక చెంచా జాజికాయ పొడిలో, ఒక చెంచా స్వచ్ఛమైన తేనె కలపండి. ఈ రెండింటిని బాగా కలిపి మెత్తని పేస్ట్ తయారు చేసుకోండి. ఈ పేస్ట్‌ను మీ ముఖంపై, ముఖ్యంగా మచ్చలు ఉన్న ప్రాంతంలో దట్టంగా పూయండి. దీనిని రాత్రంతా అలాగే ఉంచి, మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో కడగండి. తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జాజికాయతో కలిసి మొటిమలను వేగంగా తగ్గిస్తాయి.
పొడి చర్మం ఉన్నవారికి ఇది ఉత్తమమైన రెమెడీ. ఒక చెంచా జాజికాయ పొడిని, కొద్దిగా పచ్చి పాలతో కలిపి పేస్ట్ చేయండి.ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, 15-20 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. పాలు చర్మాన్ని మృదువుగా చేస్తాయి. జాజికాయ పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది.
జాజికాయ చాలా ఘాటుగా ఉంటుంది. కాబట్టి సున్నితమైన చర్మం ఉన్నవారు దీనిని నేరుగా వాడకూడదు. ఏదైనా ప్యాక్ వేసే ముందు, మీ చేతిపై చిన్న ప్యాచ్ టెస్ట్ చేసి, ఎటువంటి చికాకు లేదని నిర్ధారించుకోండి. అలాగే, కళ్ల చుట్టూ సున్నితమైన చర్మంపై ఈ ప్యాక్‌ను పూయకూడదు. వారానికి రెండుసార్లు ఈ జాజికాయ రెమెడీని ప్రయత్నించి, మీ చర్మంలోని తేడాను గమనించండి.