
నేటి ఆధునిక జీవనశైలిలో శబ్ద కాలుష్యం రోజురోజుకు విపరీతంగా పెరుగుతోంది. ట్రాఫిక్ హోరు, పెద్దపెద్ద స్పీకర్లలో మోగే సంగీతం, పటాకులు, కర్మాగారాల్లోని యంత్రాల శబ్దాలు మన ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. అయితే, ఈ అధిక తీవ్రత కలిగిన శబ్దాలు కేవలం మన వినికిడి శక్తిని మాత్రమే కాకుండా, శరీర సమతుల్యతను కూడా దెబ్బతీస్తాయని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మన చెవి లోపలి భాగంలో శబ్ద తరంగాలను గ్రహించే అత్యంత సూన్నితమైన కేశ కణాలు ఉంటాయి. అత్యంత తీవ్రమైన శబ్దాలకు గురైనప్పుడు ఈ కణాలు దెబ్బతింటాయి లేదా పూర్తిగా నశించిపోతాయి. మానవ శరీరంలో ఈ కణాలు పునరుత్పత్తి చెందే శక్తి చాలా తక్కువగా ఉండటం వల్ల, శబ్దాల కారణంగా జరిగే ఈ నష్టం చాలాసార్లు శాశ్వత వినికిడి లోపానికి దారితీస్తుంది.
అధిక శబ్దాలకు గురైన తర్వాత కొందరిలో చెవుల్లో నిరంతరం రింగుమని శబ్దం రావడం, గుయ్ మనే శబ్దం లేదా ఈల వేసినట్లు వినిపించడం జరుగుతుంది. దీనిని టిన్నిటస్ అంటారు. కొద్దిసేపు ఉండి తగ్గిపోతే పరవాలేదు గానీ, ఇది నిరంతరం కొనసాగితే వినికిడి వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని అర్థం చేసుకోవాలి.
చాలామందికి వినికిడికి, శరీర సమతుల్యతకు సంబంధం ఉందని తెలియదు. కానీ చెవి లోపలి భాగంలోనే మన శరీర సమతుల్యతను, స్థిరత్వాన్ని కాపాడే వెస్టిబ్యులర్ వ్యవస్థ ఉంటుంది. తీవ్రమైన శబ్దాల వల్ల ఈ అంతర్గత వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు, వ్యక్తులలో మైకం, తల తిరగడం, నడకలో తూలడం, స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
పిల్లలు, వృద్ధులు, నిత్యం పెద్ద శబ్దాలు ఉండే వాతావరణంలో పనిచేసేవారు దీనికి త్వరగా బలవుతారు. కాబట్టి అనవసరంగా అధిక శబ్దాలకు దూరంగా ఉండటం, అవసరమైనప్పుడు ఇయర్ ప్లగ్స్ వాడటం ద్వారా మన శ్రవణ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.