
మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు ఉన్నాయో లేదో చూసుకుంటాం కానీ ఆ ఆహారాన్ని దేనిలో ప్యాక్ చేస్తున్నాం అనే విషయాన్ని విస్మరిస్తాం. అవును మనం ఎంత ఖరీదైన పోషకాహారం తింటున్నామన్నది కాదు, అది దేనిలో తింటున్నామన్నదే మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. ఉదయం వండిన వేడి వేడి పదార్థాలను మధ్యాహ్నం వరకు లంచ్ బాక్సుల్లో పెడతాం. కానీ, ఆ అలవాటు ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుందని మీకు తెలుసా? లంచ్ బాక్స్ ఎంపికలో మనం చేసే చిన్న పొరపాట్లు ఎలాంటి ప్రభావం చూపుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
భారతీయ సంప్రదాయంలో స్టీల్ పాత్రలకు ఉన్న ప్రాధాన్యత వెనుక బలమైన శాస్త్రీయ కారణం ఉంది. స్టీల్ ఒక నాన్-రియాక్టివ్ మెటల్. అంటే ఇది ఆహారంతో ఎటువంటి రసాయన చర్య జరపదు. ఇది ఆహారం సహజ రుచిని, పోషకాలను కాపాడుతుంది. శుభ్రం చేయడం సులభం, పర్యావరణానికి మేలు చేస్తుంది. దీనిని మైక్రోవేవ్‌లో నేరుగా వేడి చేయలేం. కానీ నేటి కాలంలో ఇన్సులేటెడ్ స్టీల్ బాక్సులు లభిస్తున్నాయి.. ఇవి 4-6 గంటల పాటు ఆహారాన్ని వేడిగా ఉంచుతాయి.
ఆధునిక కార్పొరేట్ ఆఫీసుల్లో గ్లాస్ బాక్సుల వినియోగం పెరగడానికి కారణం వాటి నాణ్యత. ముఖ్యంగా మైక్రోవేవ్ వాడేవారికి గ్లాస్ బాక్సులు బెస్ట్ ఛాయిస్. సాధారణ గాజు కంటే బోరోసిలికేట్ రకం గ్లాస్ బాక్సులు మేలైనవి. ఇవి విపరీతమైన వేడిని తట్టుకుంటాయి. ఇవి 100శాతం రసాయన రహితం. ప్లాస్టిక్ లాగా ఆహారం వాసనను లేదా రంగును పీల్చుకోవు. ఆఫీసుల్లో మైక్రోవేవ్ వాడేవారికి ఇది అత్యంత సురక్షితమైన ఎంపిక.
చాలా మంది తేలికగా ఉంటుందని ప్లాస్టిక్ బాక్సులను ఎంచుకుంటారు. కానీ ఇది అత్యంత ప్రమాదకరమైన ఎంపిక. వేడి ఆహారాన్ని ప్లాస్టిక్‌లో ఉంచినప్పుడు అందులోని BPA, Phthalates వంటి హానికర రసాయనాలు ఆహారంలోకి విడుదలవుతాయి. ఇవి శరీరంలోని హార్మోన్ల వ్యవస్థను దెబ్బతీస్తాయి. దీర్ఘకాలంలో ఊబకాయం, హార్మోన్ల అసమతుల్యత మరియు క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమవుతాయని అనేక పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ప్లాస్టిక్ డబ్బాలను వీలైనంత వరకు నివారించడం ఉత్తమం. ఒకవేళ వాడినా అవి మైక్రోవేవ్ సేఫ్, BPA-Free అయి ఉండాలి.
మన ఆరోగ్యం మనం తినే ఆహారంపైనే కాదు, ఆ ఆహారాన్ని మోసే పాత్రపై కూడా ఆధారపడి ఉంటుంది. ప్లాస్టిక్‌కు వీడ్కోలు పలికి స్టీల్ లేదా గాజు పాత్రలను ఎంచుకోవడమే వివేకం.