ప్రపంచ విద్యాకేంద్రంగా భారత్ నిలవాలి: వెంకయ్య

ఢిల్లీ ఐఐటీ వజ్రోత్సవాలను వర్చువల్ వేదిక ద్వారా ప్రారంభించారు ఉపరాష్ట్రపతి. ఈ సందర్భంగా ఐఐటీ న్యూఢిల్లీ డైమండ్ జూబ్లీ లోగో, 2030 స్ట్రాటజీ డాక్యుమెంట్‌ను ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు

ప్రపంచ విద్యాకేంద్రంగా భారత్ నిలవాలి: వెంకయ్య

Updated on: Aug 17, 2020 | 7:49 PM

మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలపై మరింత లోతైన పరిశోధనలు జరగాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఆయా సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయాలని ఐఐటీలతో పాటు ఉన్నత విద్యాసంస్థలకు ఉప రాష్ట్రపతి కోరారు. వాతావరణ మార్పులు, అనారోగ్య సమస్యలు తదితర అంశాలను మొదటి ప్రాధాన్యతగా గుర్తించాలని సూచించారు.

ఢిల్లీ ఐఐటీ వజ్రోత్సవాలను వర్చువల్ వేదిక ద్వారా ప్రారంభించారు ఉపరాష్ట్రపతి. ఈ సందర్భంగా ఐఐటీ న్యూఢిల్లీ డైమండ్ జూబ్లీ లోగో, 2030 స్ట్రాటజీ డాక్యుమెంట్‌ను ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్, ఐఐటీ ఢిల్లీ డైరక్టర్ ప్రొఫెసర్ వి.రామ్ గోపాల్ రావ్, విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వవిద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సామాజిక సమస్యలకు పరిష్కారమార్గాలను కనుగొనడం ఐఐటీ, ఇతర ఉన్నత విద్యాసంస్థల ముందున్న తక్షణ కర్తవ్యమని తెలిపారు. ఈ దిశగా పరిశోధన మరియు అభివృద్ధిపై ఆర్థిక సహకారాన్ని మరింతగా పెంచాల్సిన అవసరమన్నారు. ఇందుకోసం విద్యారంగంలోని ఇలాంటి ప్రాజెక్టులను గుర్తించి వాటికి ఆర్థిక సాయం చేసేందుకు ప్రైవేటు రంగం ముందుకు రావాలని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఉన్నత విద్యాసంస్థలు, పరిశ్రమలు పరస్పర సహకారంతో అత్యాధునిక సాంకేతిక సహకారాన్ని అభివృద్ధి చేసేందుకు సమన్వయంతో కలసి ముందుకెళ్లాలని సూచించారు. విద్యాసంస్థల్లో పరిశోధనలను చేస్తున్న వారికి వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు అండదండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన విద్యావిధానం-2020 ద్వారా మళ్లీ భారత్ విశ్వగురువుగా, ప్రపంచ విద్యాకేంద్రంగా రూపుదిద్దుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు వెంకయ్య. ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు, విద్యావేత్తలు, ప్రైవేటు రంగం కలిసి విద్యారంగంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పి, అత్యుత్తమ విధానం దిశగా చొరవ తీసుకోవాలన్నారు. ప్రపంచ యవనికపై పుష్కలమైన అవకాశాలు అందిపుచ్చుకుని ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే దిశగా ముందుకు సాగడం ఖాయమని తెలిపారు. ఇందుకోసం విద్యాప్రమాణాలను పెంచుకోవాల్సిన అవసరముందన్నారు.