అమెరికా అధ్యక్ష ఎన్నికల ఖర్చు చూస్తే.. తల దిమ్మతిరిగిపోతది..!

|

Nov 02, 2020 | 6:50 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2020 ఆ దేశ చరిత్రలో నిలిచిపోనుంది. రాజకీయ పార్టీల వ్యుహల్లో కాదండీ. ప్రచారం కోసం పార్టీలు చేసిన ఖర్చుపై అత్యంత ఖరీదైనవిగా రికార్డులకెక్కనున్నాయి.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఖర్చు చూస్తే.. తల దిమ్మతిరిగిపోతది..!
Follow us on

అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2020 ఆ దేశ చరిత్రలో నిలిచిపోనుంది. రాజకీయ పార్టీల వ్యుహల్లో కాదండీ. ప్రచారం కోసం పార్టీలు చేసిన ఖర్చుపై అత్యంత ఖరీదైనవిగా రికార్డులకెక్కనున్నాయి. ఈ ఏడాది ఎన్నికల్లో దాదాపు రూ.లక్ష కోట్లు ఖర్చు చేయనున్నట్లు సెంటర్​ ఫర్ రెస్పాన్సివ్ పాలిటిక్స్ సంస్థ వెల్లడించింది. 2016 ఎన్నికలతో పోలిస్తే ఇది రెండింతలు పెరిగినట్లు పేర్కొంది. ఇందులో డెమొక్రాట్లకే అత్యధికంగా విరాళాలు అందాయని తెలిపింది.

అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ ఏడాది అత్యంత ఖరీదైనవిగా నిలవబోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత డబ్బును అభ్యర్థులు ఖర్చు చేస్తున్నారు. 2020 అమెరికా ఎన్నికల ఖర్చు దాదాపు14 బిలియన్‌ డాలర్లు అంటే రూ.లక్ష కోట్లు ఉండబోతోంది. ఎన్నికల్లో ధన ప్రవాహంపై పనిచేసే సంస్థ ‘సెంటర్‌ ఫర్‌ రెస్పాన్సివ్‌ పాలిటిక్స్‌’ ఈ అంచనా వేసింది. ఇప్పటివరకు అత్యధికంగా డబ్బు ఖర్చు చేసింది.. 2018 మిడ్​టెర్మ్ ఎలక్షన్లలోనూ 11 బిలియన్‌ డాలర్ల ఖర్చు అయ్యిందని వివరించింది. ఎన్నికల డొనేషన్లు అత్యధికంగా ఈసారి వసూలవుతున్నాయని తన నివేదికలో సంస్థ పేర్కొంది.

అమెరికా అధ్యక్ష అభ్యర్ధుల్లో బిలియన్‌ డాలర్ల విరాళాలను సేకరించిన మొదటి అభ్యర్ధిగా డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన జో బిడెన్‌ నిలవనున్నట్లు తెలిపింది. అక్టోబర్ 14 వరకు బైడెన్​ 93.8 కోట్ల డాలర్లు సేకరించగా.. అధ్యక్షుడు ట్రంప్​కు 59.6 కోట్ల డాలర్లు సమకూరాయి. డెమొక్రాట్లకే అధికం.. స్థిరాస్తి సంస్థలు తప్ప మిగిలిన కంపెనీల్లో అత్యధికం డెమొక్రటిక్‌ పార్టీ వైపు మొగ్గుచూపాయని, అధికంగా విరాళాలు ఇస్తున్నాయని వివరించింది. వంద, రెండొందల డాలర్లు ఇవ్వగల సామాన్య పౌరులు కూడా డెమొక్రటిక్‌ పార్టీకే అధికంగా ఇస్తున్నారని తెలిపింది. డెమొక్రాట్లకు చిన్న చిన్న దాతలు రూపంలో 1.7 బిలియన్‌ డాలర్లు వచ్చాయి. రిపబ్లికన్లకు కేవలం బిలియన్‌ డాలర్లు మాత్రమే వసూలయ్యాయి.

మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈసారి విరాళాలు అందించారని నివేదిక స్పష్టం చేసింది. మొత్తం నిధుల సమీకరణలో 2016 ఎన్నికల్లో మహిళల వాటా 1.3 బిలియన్ డాలర్లు కాగా, ఈ సారి ఇప్పటికే 2.5 బిలియన్ డాలర్లు విరాళాల రూపంలో అందాయి. వీరిలో ఎక్కువ మంది డెమొక్రాట్లకే నిధులు ఇచ్చినట్లు తెలిపింది. 200 డాలర్లకుపైగా ఇచ్చిన వారి నుంచి 1.3 బిలియన్ డాలర్లు డెమొక్రాట్లకు రాగా.. రిపబ్లికన్లకు 57 కోట్ల డాలర్లు అందాయి.రెండు పార్టీల మధ్య తేడా… ఒక్క అధ్యక్ష అభ్యర్దుల మీద పెట్టే ఖర్చు ఈసారి 6.6 బిలియన్‌ డాలర్లకు చేరుకోనుంది. 2016 ఎన్నికల్లో ఇది 2.4 బిలియన్‌ డాలర్లుగానే ఉందని సంస్థ వివరించింది. ఇక అయా రాష్ట్రాల్లో డెమొక్రటిక్‌ అభ్యర్ధులు, గ్రూపులు పెట్టే ఖర్చు 5.5 బిలియన్‌ డాలర్లు ఉండగా, రిపబ్లికన్లు 3.8 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఖర్చు చేయగలిగారని స్పష్టం చేసింది.

ఇంత పెద్ద తేడా గత ఎన్నికల్లో ఎప్పుడూ లేదని, డెమొక్రాట్లకు నిధుల సమీకరణ అధికంగా ఉండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో ఈ సారి ఎక్కువగా వర్చువల్​గానే అభ్యర్థులు నిధుల సేకరణ చేపట్టారు. ఈమెయిల్స్, మెసేజెస్​ వంటి సేవలపై ఆధారపడ్డారు.ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లో ప్రకటనల కోసం కూడా ఎక్కువగా ఖర్చు చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. రెండు పార్టీలు కలిసి దాదాపు బిలియన్‌ డాలర్లు ఖర్చు పెట్టాయి. మొత్తంగా 2020 అమెరికా ఎన్నికలు అత్యంత ఖరీదైన ఎన్నికలుగా చరిత్రలో నిలిచిపోనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.