
Venkaiah Naidu: శాస్త్రీయ విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, ఇంజినీరింగ్, గణితం రంగాల్లోని నవీన పోకడల గుర్తించాలని , డాటా సైన్స్ విప్లవానికి ధీటుగా ఉద్యోగ కల్పనలో సామర్థ్యాన్ని పెంచుకోవాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. సాంకేతిక రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలని సూచించారు. భారతదేశంలో అత్యధికంగా మహిళా నిపుణులు తయారవుతున్నారని అన్నారు. చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమాటికల్ సైన్సెస్ (ఐఎంఎస్సీ) లో నూతన భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. నూతన నైపుణ్యానికి ధీటుగా తమ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు సంప్రదాయ ఇంజినీరింగ్ పాఠ్యాంశాలను నవీకరించాలన్నారు. ఐఐటీల వంటి జాతీయ సంస్థలు అందిస్తున్న దూర విద్య కోర్సుల విస్తరణ పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రాంతీయ భాషల్లో సాంకేతిక కోర్సులను అందించాలని సూచించారు.
దేశానికి గర్వకారణమైన గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ సేవలను కొనియాడారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కేపీ అన్బళగన్, ఐఎంఎస్సీ డైరక్టర్ ప్రొఫెసర్ వీ అరవింద్, కల్పకం అటమిక్ ఎనర్జీ విభాగం ఐజీసీఏఆర్ డైరక్టర్ డాక్టర్ అరుణ్ కుమార్ భాదురి, రిజిస్ట్రార్ విష్ణు ప్రసాద్ సహా ఐఎంఎస్సీ అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
Also Read: Shashi Tharoor: కమల్ హాసన్ నిర్ణయాన్ని స్వాగతించిన కాంగ్రెస్ నేత… భారతీయుడు ఏం హామీ ఇచ్చాడంటే..?