కల్న‌ల్ సంతోష్ బాబు కుటుంబానికి బంజారాహిల్స్‌లో ఇచ్చిన స్థ‌లం విలువ ఎంతంటే..

జూన్ 15న గల్వాన్ లోయలో చైనా సైనికుల‌తో జరిగిన ఘర్ష‌ణ‌లో వీర‌మ‌ర‌ణం పొందిన‌ కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ సర్కారు అండ‌గా నిలుస్తోంది.

  • Ram Naramaneni
  • Publish Date - 5:54 pm, Sat, 25 July 20
కల్న‌ల్ సంతోష్ బాబు కుటుంబానికి బంజారాహిల్స్‌లో ఇచ్చిన స్థ‌లం విలువ ఎంతంటే..

Martyr Colonel Santosh Babu : జూన్ 15న గల్వాన్ లోయలో చైనా సైనికుల‌తో జరిగిన ఘర్ష‌ణ‌లో వీర‌మ‌ర‌ణం పొందిన‌ కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ సర్కారు అండ‌గా నిలుస్తోంది. ఇటీవ‌లే ఆమెకు డిప్యూటీ క‌లెక్ట‌ర్ ఉద్యోగం ఇవ్వ‌గా, తాజాగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో కేబీఆర్ పార్కుకు ఎదురుగా రూ.20 కోట్ల విలువ చేసే 711 గజాల స్థలం ప్ర‌భుత్వం కేటాయించింది. బుధవారం ఆ స్థలాన్ని సంతోష్ బాబు ఫ్యామిలీ మెంబ‌ర్స్ కు అప్పగించారు అధికారులు. షేక్‌పేట్ మండలంలో మూడు స్థలాలు చూపించి..వాటిలో ఇష్ట‌మైన‌ది ఎంచుకోవాలని అమర సైనికుడి కుటుంబానికి ప్ర‌భుత్వం సూచించింది. వారు బంజారాహిల్స్‌లో స్థలాన్ని ఎంచుకున్నారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ఆ స్థలాన్ని పరిశీలించి..ఆ ల్యాండ్ పత్రాలను సంతోష్‌ భార్యకు కలెక్టర్‌ అందజేశారు.

కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. గ‌తంలో ఆయ‌న‌ స్వ‌స్థ‌లం సూర్యాపేట వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన కేసీఆర్..అక్క‌డే రూ. 5 కోట్ల చెక్కును అందజేశారు. సంతోష్ బాబు భార్య‌కు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇచ్చారు. వారిని ప్రగతి భవన్‌కు కూడా ఆహ్వానించి..క‌లిసి భోజ‌నం చేశారు.