బాలు మంచి స్వరకర్త కూడా!

|

Sep 25, 2020 | 6:14 PM

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మంచి స్వరకర్త కూడా! ఎన్నో సినిమాలకు ఆయన సంగీత దర్శకత్వం వహించారు. దిగ్దర్శకుడు దాసరి నారాయణరావు తొలిసారిగా బాలుతో సంగీతదర్శకత్వం చేయించారు..

బాలు మంచి స్వరకర్త కూడా!
Follow us on

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మంచి స్వరకర్త కూడా! ఎన్నో సినిమాలకు ఆయన సంగీత దర్శకత్వం వహించారు. దిగ్దర్శకుడు దాసరి నారాయణరావు తొలిసారిగా బాలుతో సంగీతదర్శకత్వం చేయించారు.. అది కన్యా-కుమారి అనే సినిమా! అయితే అంతకు ముందే బాలుకు సంగీత దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది.. దాసరి నారాయణరావు దర్శకత్వంలో యువకుల్లారా లేవండి అనే సినిమాను ప్లాన్‌ చేశారు.. ఓ పాట కూడా రికార్డ్‌ అయ్యింది. అనివార్యకారణాల వల్ల ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు..కానీ మళ్లీ దాసరి నారాయణరావే బాలుకు అవకాశం వచ్చారు.. కన్యాకుమారి సినిమాలోని ఓహో చెలీ.. ఓ ఓ నా చెలీ…ఇది తొలి పాట.. ఒక చెలి పాట…వినిపించనా ఈ పూట.. నా పాట అన్న గీతం జనరంజకమయ్యింది.. జనాలను ఆకట్టుకుంది.. ఆ పాటను జాగ్రత్తగా వింటే సత్యం స్వరపరిచారేమో అన్న భావన కలుగుతుంది..

దానికో కారణం ఉంది.. ఆర్కెస్ట్రయిజేషన్‌ను సత్యం ట్రూప్‌ నిర్వహించమే అందుకు కారణం.. ఆ తర్వాత అనేక పాటలకు స్వరాలను అద్దారు.. ఓ పాతిక సినిమాలకు సంగీతాన్ని అందించారు బాలు.. బాపు దర్శకత్వంలో వచ్చిన తూర్పు వెళ్లే రైలు సినిమాలోని పాటలను మర్చిపోగలమా? అందులోని చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా అన్న పాటను మెహదీహసన్‌ స్టయిల్‌లో కంపోజ్‌ చేసి బాపుతో భేష్‌ అనిపించుకున్నారు.. దాసరి దర్శకత్వంలో వచ్చిన మల్టీస్టారర్‌ సినిమా ఊరంత సక్రాంతికి కూడా బాలునే స్వరకర్త.. ఆ సినిమాలో అక్కినేని పాటలకు ఓ విధంగా, కృష్ణ పాటలకు ఇంకో విధంగా స్వరపరచి సవ్యసాచి అనిపించుకున్నారు బాలు.. ఈమధ్యలో తుదిక్కుమ్‌ కారంగల్‌ అనే తమిళ సినిమాకు స్వరదర్శకత్వం వహించారు. ఇక బాలు ఓ స్వరకర్తగా విజృంభించిన సినిమా మయూరి! సాహిత్యానికి తగిన సంగీతాన్ని అందించారు బాలు.. ఆ సినిమాలో అన్ని పాటలు గొప్పవే! ముఖ్యంగా బృందావన్‌ సారంగలో స్వరపరచిన ఇది నా ప్రియనర్తన వేళ అన్న పాటలో బాలు కనబర్చిన స్వరవిన్యాసం అద్భుతం.. గుండెలు పిండేసే సంగీతాన్ని అందించారు..

హిందోళం రాగంలో మేలైన పాటలను ఏరితో అందులో ఈపాదం ఇలలోన నాట్యవేదం తప్పకుండా ఉంటుంది… ఇదే సినిమాను నాచె మయూరిగా హిందీలో రీమేక్‌ చేశారు.. దీనికి నేపథ్య సంగీతాన్ని అందించింది బాలునే! ఈ పాదం ఇలలోన నాట్య వేదం బాణిని అలాగే వాడుకున్నారు హిందీలో! చిరంజీవి హీరోగా వచ్చిన మగధీరుడు కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యమే సంగీతం అందించారు.. ఇక లాయర్‌ సుహాసిని, భార్యమణి, జాకీ, సౌభాగ్యలక్ష్మి (కన్నడ), పడమటి సంధ్యారాగం, బాలకృష్ణ హీరోగా వచ్చిన రాము, నీకు నాకు పెళ్లంట, రామన్న శామన్న (కన్నడ), చిన్నోడు పెద్దోడు, వివాహభోజనంబు, కళ్లు, నాగార్జున జైత్రయాత్ర, గౌతమి సినిమాలు చెప్పుకోదగ్గవి..