కరోనా మహమ్మారి నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని పాఠశాలలు వచ్చే ఏడాది మార్చి 31వ వరకు మూసివేస్తున్నట్లు సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రకటించారు. 10-12 తరగతుల విద్యార్థులకు త్వరలోనే రెగ్యులర్ తరగతులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో మధ్యప్రదేశ్ విద్యాశాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాబోయే విద్యా సంవత్సరం ఏప్రిల్ 1న మొదటవుతుందని వెల్లడించారు. అలాగే, ఎనిమిదో తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకూడదని, ప్రాజెక్టుల ఆధారంగా మదింపు చేయనున్నట్లు తెలిపారు. అదే సమయంలో 10-12 తరగతుల పరీక్షలు జరుగుతాయని, వారికి త్వరలోనే క్లాస్‌లు ప్రారంభమవుతాయని సీఎం తెలిపారు. సమీప భవిష్యత్తులో సామాజిక దూరం, ఇతర జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 9-11 తరగతుల విద్యార్థులను వారంలో ఒకటి, రెండు రోజులు మాత్రమే పాఠశాలల్లో క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ సమీక్ష సమావేశంలో తెలిపారు. రాబోయే మూడేళ్లలో పదివేల పాఠశాలలను ప్రారంభించేందుకు కార్యాచరణ రూపొందించాలని సీఎం చౌహాన్ అధికారులను ఆదేశించారు.