కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇండియాలో కూడా ప్రమాదకరంగా వీరవిహారం చేస్తోంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజూకీ పెరుగుతోంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓవైపు నియంత్రణకు చర్యలు తీసుకుంటూనే ప్రజలను వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాయి. కానీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కరోనా వైరస్ వ్యాప్తికి వాహకులుగా పనిచేస్తున్నారు. ఎంత చెప్పినా రూల్స్ పాటించకపోవడంతో ఓ కలెక్టర్‌కు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా సమయంలో నిబంధనలు ఉల్లంఘించి 15 మందికి వైరస్ సోకేందుకు కారణమైన ఓ ఫ్యామిలీకి రూ.6 లక్షలు ఫైన్ వేశారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాకు చెందిన గీసులాల్ రాఠీ ఈనెల 13న తన కుమారుడికి పెళ్లి చేశాడు. కరోనా తీవ్రంగా విస్తరోస్తోన్న సమయంలో నలుగురితో తంతు ముగించకుండా..భారీగా వేడుకకు అతిథులను ఆహ్వానించారు. అయితే ఆ తర్వాత వీరిలో కొందరికి కరోనా లక్షణాలు మొదలయ్యాయి. టెస్టులు చేయగా వివాహ వేడుకకి హాజరైన వారిలో 15 మందికి కరోనా వైరస్ సోకినట్టు తేలింది. వీరిలో ఒకరు ప్రాణాలు కూడా కొల్పోయారు. ఇంత నిర్లక్షంతో వ్యవహరించిన గీసులాల్ రాఠీపై పోలీసులు ఈనెల 22న కేసు నమోదు చేశారు.
కాగా ఈ పెళ్లికి హాజరై.. కరోనా అంటించుకున్న 15 మందిని గవర్నమెంట్ ఐసోలేషన్ కేంద్రాల్లో ఉంచి చికిత్స అందించింది. అయితే ఈ 15 మందికి కోవిడ్-19 టెస్టులు చేయడం, ట్రీట్మెంట్, ఆహారం, అంబులెన్స్‌కు మొత్తంగా రూ.6,26,600 ఖర్చు అయ్యింది. నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆ 15 మందికి కోవిడ్-19 వ్యాప్తి చెందేందుకు కారణమైన వ్యక్తి నుంచే డబ్బులు రాబట్టాలని భిల్వారా జిల్లా కలెక్టర్ రాజేంద్ర భట్ అధికారులను ఆదేశించారు. ఫైన్ విధించిన డబ్బును వసూలు చేసి సీఎం రిలీఫ్ ఫండ్‌కు జమ చేయాలని చెప్పారు.