Olectra electric buses in Dehradun మేఘా ఇంజనీరింగ్ అనుబంధ సంస్థ తయారు చేసిన ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్ ట్రయిల్ రన్‌ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేది సింఘ్ రావత్ లాంఛనంగా ప్రారంభించారు. డిసెంబర్ 11న తన అధికార నివాసంలో జెండా ఊపి బస్సును ప్రారంభించారు. అనంతరంలో బస్సులో ముఖ్యమంత్రి ప్రయాణించారు. కాగా, మేఘా సంస్థ ప్రతినిధులు ఎలక్ట్రిక్ బస్సు ప్రత్యేకతలను ముఖ్యమంత్రికి వివరించారు. డెహ్రడూన్ స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా డూన్ కనెక్ట్ పేరుతో ఈ ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం నడుపుతోందని ముఖ్యమంత్రి రావత్ తెలిపారు. 30 ఎకో ఫ్రెండ్లీ బస్సు సర్వీసులను వినియోగించుకోనున్నట్లు ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రత్యామ్నాయ వనరులను వినియోగించుకోవాలని సూచించారు. డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్, హరిద్వార్ సహా రాష్ర్టంలోని పలు ప్రముఖ కేంద్రాల్లో ఈ బస్సు సర్వీసులను నిర్వహించనున్నామని తెలిపారు.
Olectra 9M Electric Bus flagged off by Hon’ble Chief Minister of Uttarakhand on today at Dehradun with other delegates. He said that efforts are being made to run 30 buses in the city in this financial year #EV #Olectra #electric #Dehradun #dehraduncity pic.twitter.com/4xBU6FzOQM
— OLECTRA Greentech Limited(A Group Company of MEIL) (@OlectraEbus) December 11, 2020
9 మీటర్ల పొడవు ఉన్న ఈ ఏసీ బస్సులో డ్రైవర్, 25 మంది ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యంతో పాటు వీల్ చెయిర్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ బస్సులో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ నియంత్రిత ఎయిర్ సస్పెన్షన్‌తో ప్రజలు సౌకర్యవంతమైన ప్రయాణం పొందగలరు. ప్రయాణికుల రక్షణ కొరకు బస్సులో సీసీటీవీలను ఏర్పాటు చేశారు. అలాగే వికలాంగులు, వృద్ధులకు ఇబ్బంది లేకుండా బస్సులో హైడ్రాలిక్ వీల్ చెయిర్ ర్యాంప్, ఎమర్జెన్సీ బటన్, యూఎస్ బీ సాకెట్ ను కూడా ఏర్పాటు చేశారు. బస్సులో అమర్చిన లిథియమ్-ఇయాన్ బ్యాటరీని ఒకసారి చార్జింగ్ ద్వారా దాదాపు 180 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. ఈ అత్యాధుని సాంకేతిక ఎలక్ట్రిక్ బస్సులో ఉన్న ప్రత్యేకమైన రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టం ద్వారా ప్రయాణంలో ప్రతిసారి బ్రేక్ వేసినప్పుడు కోల్పోయిన చార్జింగ్‌ను కొంతమేరకు తిరిగి పొందుతుంది. ఇందులో ఉన్న అతి శక్తివంతమైన ఏసీ చార్జింగ్ వ్యవస్థ ద్వారా బ్యాటరీ 3 నుంచి 4 గంటల్లో మొత్తం చార్జింగ్ అవుతుంది.
ఈ సందర్భంగా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ప్రతినిధులు మాట్లాడుతూ, దేశంలో అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులను మరో రాష్ట్రంలో కూడా నడపడం చాలా గర్వంగా ఉందన్నారు. ఉత్తరాఖండ్ జీవావరణాన్ని సంరక్షించడంలో భాగం ఈ ఎలక్ట్రిక్ బస్సులు తమ వంతు పాత్ర పోషిస్తాయన్నారు. సమర్థవంతమైన విద్యుత్ ప్రజా రవాణా వ్యవస్థతో కాలుష్యాన్ని తగ్గించే కృషిలో ఒలెక్ట్రా ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే ఉత్తరాఖండ్ లో కూడా ప్రవేశపెట్టిన ఈ 30 ఎలక్ట్రిక్ బస్సులు విజయవంతంగా వాటి సేవలు అందిస్తాయని అన్నారు. ముంబాయి, పూణే, నాగ్ పూర్, హైదరాబాద్, కేరళలో అందుబాటులోకి తెచ్చిన ఎలక్ట్రిక్ బస్సులు వాటి సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ విజయవంతంగా నడుస్తున్నాయని వివరించారు.
మేఘా అనుబంధ సంస్థ అయిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్‌ను 2000 సంవత్సరంలో స్థాపించారు. దేశంలో ఎలక్ట్రిక్ బస్సులను 2015లోనే ఈ సంస్థ ప్రవేశపెట్టింది. విద్యుత్ ప్రసారం, పంపిణీ నెట్‌వర్క్‌ల కోసం సిలికాన్ రబ్బరు, కంపోసిట్ ఇన్ స్యూలేటర్ల అతిపెద్ద తయారీదారు ఈ సంస్థ.