నిర్భయ కేసులో దోషి అక్షయ్ సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. అయితే ఈ పిటిషన్ ను విచారించే బెంచ్ నుంచి తాను వైదొలగుతున్నట్టు సీజేఐ జస్టిస్ ఎస్. ఎ. బాబ్డే ప్రకటించారు. బుధవారం ఉదయం పదిన్నర గంటలకు మరో ధర్మాసనం దీనిపై విచారణ జరుపుతుందని ఆయన పేర్కొన్నారు. నిర్భయ తల్లి తరఫున వాదించిన అడ్వొకేట్లలో ఒకరు తన కుటుంబ సభ్యులని, అందువల్ల విచారణ పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతోనే తాను తప్పుకుంటున్నానని జస్టిస్ బాబ్డే వివరించారు. అక్షయ్ సింగ్ వేసిన పిటిషన్ పై ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇఛ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించిన సంగతి విదితమే.. అయితే ఈ తీర్పును పునఃసమీక్షించాలంటూ దోషి అక్షయ్ సింగ్ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశాడు. ఢిల్లీలోని కాలుష్యాన్ని కూడా సాకుగా చూపాడు. ఇదిలా ఉండగా ఈ కేసులో .. ముకేష్, పవన్ గుప్తా, వినయ్ శర్మ అనే ముగ్గురు దోషుల రివ్యూ పిటిషన్లను గత ఏడాది జులైలో కోర్టు కొట్టివేసింది.