నీట్‌, జేఈఈ పరీక్షలపై మరోసారి సుప్రీం తలుపు తట్టనున్న విపక్షాలు

|

Aug 26, 2020 | 5:30 PM

అనుకున్న సమయానికి నీట్‌, జేఈఈ పరీక్షలు జరుగుతాయో లేదో అన్నది ఇంకా సందిగ్ధంగానే ఉంది.. కేంద్ర ప్రభుత్వం అయితే దేశ వ్యాప్తంగా వచ్చే నెల ఒకటి నుంచి నీట్‌, జేఈఈ పరీక్షలను నిర్వహించాలనుకుంటోంది.. ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేసే ప్రసక్తే లేదని తేల్చేసింది.

నీట్‌, జేఈఈ పరీక్షలపై మరోసారి సుప్రీం తలుపు తట్టనున్న విపక్షాలు
Follow us on

అనుకున్న సమయానికి నీట్‌, జేఈఈ పరీక్షలు జరుగుతాయో లేదో అన్నది ఇంకా సందిగ్ధంగానే ఉంది.. కేంద్ర ప్రభుత్వం అయితే దేశ వ్యాప్తంగా వచ్చే నెల ఒకటి నుంచి నీట్‌, జేఈఈ పరీక్షలను నిర్వహించాలనుకుంటోంది.. ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేసే ప్రసక్తే లేదని తేల్చేసింది.. విద్యా సంవత్సరం వృధా కాకూడదన్న సదుద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామంటోంది. సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు జేఈఈ పరీక్షలు, సెప్టెంబర్‌ 13న నీట్‌ పరీక్షలు జరుగుతాయి.. ఇప్పటికే విద్యార్థులకు అడ్మిట్‌ కార్డులు జారీ చేసినట్టు కేంద్రం వెల్లడించింది. అయితే కేంద్రం తీరుపై పలు రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. విపక్షాలు వీల్లేదంటున్నాయి.. ఈ విషయంలో మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాలనుకుంటున్నాయి. కాంగ్రెస్‌పార్టీ అధినేత్రి సోనియాగాంధీ విపక్ష పార్టీల ముఖ్యమంత్రులతో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. . ఇందులో పరీక్షలను వాయిదా వేయడమే మంచిదన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు ముఖ్యమంత్రులు.. పరీక్షలను వాయిదా వేయాలంటూ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిద్దామని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సూచించారు.

ఇప్పటికే ఈ పరీక్షలను పోస్ట్‌పోన్‌ చేయాలంటూ పలు రాజకీయా పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి.. కాంగ్రెస్‌పార్టీతో పాటు తృణమూల్‌ కూడా పరీక్షలను నిర్వహించవద్దంటున్నది. కరోనా వైరస్‌ ఇంతగా వ్యాప్తి చెందుతూ ఉంటే పరీక్షలను నిర్వహించడం శ్రేయస్కరం కాదని, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడటం భావ్యం కాదని సోనియాగాంధీ అంటున్నారు. నీట్, జేఈఈని వ్యతిరేకిస్తున్న ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇప్పటికే ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఈ రోజు సోనియా గాంధీ, మమతా బెనర్జీతో పాటు విపక్షపార్టీలకు చెందిన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. పరీక్షలను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం ఇప్పటికే కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌, పంజాబ్‌, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్‌, ఒడిశా రాష్ట్రాల సీఎంలు కూడా పరీక్షలను వాయిదా వేయాలంటున్నారు. వీరితో పాటు సుబ్రహ్మణ్యస్వామి, రాహుల్‌ గాంధీ, ఉద్ధవ్‌ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, డీఎంకె అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. సోనూసూద్‌ కూడా పరీక్షలను వాయిదా వేయాలంటూ విద్యార్థుల పక్షాన నిలిచాడు.