జగన్ ముందు ముళ్లబాట.. హోదాపై హామీ ఏమవుతుందో.?

సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించి ఏపీలో ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతలు స్వీకరించిన జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తారనే భావన ఏపీ ప్రజల్లో ఉంది. ఎన్నికల ముందు కూడా వైఎస్ జగన్ ఇచ్చిన హామీలలో ప్రత్యేక హోదా ప్రధానమైనది. ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తాం.. అది కేవలం వైసీపీ వల్లే సాధ్యమవుతుందని గట్టిగా చెప్పడంతో ప్రజలు కూడా వీరిని నమ్మి ఓటు వేశారని చెప్పవచ్చు. కానీ సీఎం పీఠం ఎక్కిన మరునాడే వైఎస్ జగన్.. […]

జగన్ ముందు ముళ్లబాట.. హోదాపై హామీ ఏమవుతుందో.?

Updated on: Jun 25, 2019 | 10:46 AM

సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించి ఏపీలో ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతలు స్వీకరించిన జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తారనే భావన ఏపీ ప్రజల్లో ఉంది. ఎన్నికల ముందు కూడా వైఎస్ జగన్ ఇచ్చిన హామీలలో ప్రత్యేక హోదా ప్రధానమైనది. ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తాం.. అది కేవలం వైసీపీ వల్లే సాధ్యమవుతుందని గట్టిగా చెప్పడంతో ప్రజలు కూడా వీరిని నమ్మి ఓటు వేశారని చెప్పవచ్చు. కానీ సీఎం పీఠం ఎక్కిన మరునాడే వైఎస్ జగన్.. బీజేపీ సంపూర్ణ మెజార్టీతో గెలుపొందడం వల్ల హోదా గురించి గట్టిగా అడగలేకపోతున్నామని, ఆ పార్టీకి ఇన్ని సీట్లు రాకుండా ఉండాల్సిందని వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ అప్పటికి కూడా వెనకడుగు వేయకుండా ప్రత్యేక హోదా సాధనే తమ లక్ష్యం అని పేర్కొన్నారు. అయితే హోదా కోసం ప్రయత్నం చేస్తున్న జగన్‌కు ఇటీవలే కేంద్రం భారీ షాక్ ఇచ్చింది.

జగన్ కు షాక్.. ప్రత్యేక హోదాకు నో చెప్పిన కేంద్రం…

మొన్న జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో కూడా జగన్ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన ఆవశ్యకత గురించి కేంద్రానికి నివేదిక ఇచ్చారు. తాజాగా జరిగిన ప్రధాని అఖిలపక్ష సమావేశానికి వెళ్ళినప్పుడు కూడా జగన్ హోదా గురించి బలంగా ప్రస్తావించారు. అయితే దీనిపై మోదీ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇక ఈ హోదా విషయంపై కేంద్ర నిర్ణయం ఏంటనేది ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ మాటల్లో తేట తెల్లమైంది. నిన్న పార్లమెంట్‌లో ఆమె మాట్లాడుతూ ‘ ఏపీ, తెలంగాణ‌తో పాటు బీహార్‌, జార్ఖండ్‌, చత్తీస్‌గఢ్‌, ఒడిశా, రాజస్థాన్‌ రాష్ట్రాల నుంచి ప్రత్యేక హోదా డిమాండ్లు వచ్చాయని, కానీ ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదనలు కేంద్ర పరిశీలనలో లేవని స్పష్టం చేశారు. లోకసభలో బీహార్ ఎంపీ కౌసలేంద్ర కుమార్ ప్రత్యేక హోదాపై అడిగిన ప్రశ్నకు ఆమె ఈ మేరకు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు.

వైఎస్ జగన్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి..?

కేంద్రంతో చెలిమి కొనసాగించి ఎలాగైనా ప్రత్యేక హోదా సాధిస్తామని ధీమాతో ఉన్న వైఎస్ జగన్‌కు పాలన తొలినాళ్లలోనే బీజేపీ పెద్ద షాక్ ఇచ్చింది. ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని ఫుల్ క్లారిటీ ఇచ్చింది ఎన్డీయే. ఏపీ ప్రజల కోరికైనా ప్రత్యేక హోదాపై ఇప్పుడు వైఎస్ జగన్ ఏమి చేయబోతున్నారని అనేది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మాటలకు జగన్ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

మొదటి నుంచి కేంద్రంతో సన్నిహితంగా ఉంటూ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేయాలనుకున్న జగన్‌కు మోదీ ప్రభుత్వం హోదా ఇవ్వబోమని తేల్చేసింది. దీంతో జగన్ నెక్స్ట్ స్టెప్ ఏంటని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబులా పోరాటానికి దిగుతారా.. లేక తనదైన ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతారా అనేది తేలాల్సి ఉంది.