కశ్మీర్‌లో ఈయూ టీమ్.. విదేశాంగ విధానంలో కీలక పరిణామం

మారుతున్న ఆధునిక సమాచార వ్యవస్థలో విదేశాంగ వ్యవహారాల శాఖ భారత దేశ విధాన రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఆగస్టు 5వ తేదీన ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన నిర్ణయాలను తీసుకున్న తర్వాత కశ్మీర్‌లో ఏదో జరిగిపోతుందన్న పాకిస్తాన్ ప్రాపగాండా మితిమీరింది. అక్కడ ఏమీ జరగడం లేదని, పరిస్థితి అదుపులోనే వుందన్న కేంద్ర హోం శాఖ ప్రకటనలను దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు కూడా నమ్మని పరిస్థితి. తామంతా కశ్మీర్‌లో పర్యటిస్తామంటూ పలు మార్లు విపక్షాలు […]

కశ్మీర్‌లో ఈయూ టీమ్.. విదేశాంగ విధానంలో కీలక పరిణామం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 29, 2019 | 12:49 PM

మారుతున్న ఆధునిక సమాచార వ్యవస్థలో విదేశాంగ వ్యవహారాల శాఖ భారత దేశ విధాన రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఆగస్టు 5వ తేదీన ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన నిర్ణయాలను తీసుకున్న తర్వాత కశ్మీర్‌లో ఏదో జరిగిపోతుందన్న పాకిస్తాన్ ప్రాపగాండా మితిమీరింది. అక్కడ ఏమీ జరగడం లేదని, పరిస్థితి అదుపులోనే వుందన్న కేంద్ర హోం శాఖ ప్రకటనలను దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు కూడా నమ్మని పరిస్థితి. తామంతా కశ్మీర్‌లో పర్యటిస్తామంటూ పలు మార్లు విపక్షాలు డిమాండ్ చేసిన పరిస్థితుల్లో కేంద్రం ఎవరినీ అనుమతించలేదు.

అయితే తాజాగా.. అకస్మాత్తుగా కేంద్రం తీసుకున్న నిర్ణయం మాత్రం అతిపెద్ద డెవలప్‌మెంటేనని చెప్పాలి. యూరోపియన్ యూనియన్‌కు చెందిన 28 మంది వివిధ దేశాల ఎంపీల బృందం మంగళవారం కశ్మీర్‌లో పర్యటించబోతోంది. ఇంతకాలం అక్కడికి ఎవరినీ అనుమతించని మోదీ ప్రభుత్వం తాజాగా ఈయూ ప్రతినిధులను అనుమతించడం..అది కూడా చివరి క్షణం వరకూ సీక్రెట్‌గా వ్యవహారాలను నడపడం మోదీ ప్రభుత్వ దౌత్యనీతిలో భాగమేనని అర్థం చేసుకోవాలి.

ఆగస్టు మొదటి వారం మొదలుకుని పలు అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను దోషిగా చూపేందుకు, కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని చాటేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. విదేశాంగ శాఖా మంత్రి డాక్టర్ జయశంకర్ పాక్ ప్రయత్నాలను పలు సందర్భాలలో అడ్డుకోవడం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్‌లోని ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, పోలండ్ దేశాలకు చెందిన 28 మంది పార్లమెంటు సభ్యుల బృందం కశ్మీర్ పర్యటనకొచ్చింది. వారంతా ఏ పార్టీకి చెందిన వారు, వారికి భారత్ పట్ల, కశ్మీర్ పట్ల వున్న దృక్పధం ఏమిటి అన్నవి ప్రస్తుతానికి అప్రస్తుతమే అనుకోవాలి. ఎందుకంటే గతంలోలా పరిస్థితిని పూర్తిగా చక్కదిద్దిన తర్వాతనే మనం అనుకూలాంశాలను ప్రపంచానికి చూపే పరిస్థితి ఇపుడు లేదు.

ఇంటర్‌నెట్‌తోపాటు సమాచార వ్యవస్థ బాగా అభివృద్ది చెంది, వేగవంతమైన నేపథ్యంలో ఎప్పటికప్పుడు ప్రపంచానికి వాస్తవిక పరిస్థితిని చాటాల్సిన అగత్యం వుంది. ఈ క్రమంలోనే మనకు అనుకూలంగా వున్న దేశాల ప్రతినిధులకు గ్రౌండ్ లెవెల్ పరిస్థితిని స్వయంగా చూపించడం ద్వారా భారత్ అనుకూల వాతావరణాన్ని రూపొందించుకునే అవకాశాలున్నాయి.

విదేశీ ప్రతినిధుల కంటే ముందు భారత దేశ ప్రజా ప్రతినిధులను కశ్మీర్ సందర్శనకు తీసుకువెళ్ళాలన్న డిమాండ్ పూర్తిగా అసహేతుకం. ఎందుకంటే బిన్నాభిప్రాయాలు కలిగి వున్న భారత దేశ ఎంపీలు.. అక్కడి పర్యటన తర్వాత చేసే యాగీతో ఇంటి గుట్టు రట్టవుతుంది. విదేశాల ముందు భారత్ పరువు పోతుంది. ఇక్కడ ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న సూత్రం ఇక్కడ పనిచేయదు. ఎందుకంటే కశ్మీర్ అంశం విదేశాంగ విధానంలో అత్యంత కీలకం. అందుకే ముందు రచ్చ గెలిచి.. ఆ తర్వాత ఇంటిని పూర్తిగా సర్దుకోవాల్సిన పరిస్థితి ఇపుడు నెలకొంది. ఆ దిశగా మోదీ వ్యవహరిస్తున్న వ్యూహాత్మక విధానం ప్రశంసనీయమే.

70 సంవత్సరాల క్రితమే బ్రిటిష్ వారు, 50 సంవత్సరాల క్రితమే అమెరికన్లు పూర్తి స్థాయి సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. భారత దేశం ఓ అభివృద్ధి చెందుతున్న దేశంగానే అర్ధ శతాబ్ధంగా మనం చెప్పుకుంటున్న నేపథ్యంలో మన సమాచార వ్యవస్థ గానీ.. ఇతర దేశాలకు దౌత్య సమాచారాన్ని అందించడంలో గాని వేగవంతమైన చర్యలు తీసుకోవాల్సి వుంది. డిప్లోమసీకి పెద్దపీట వేయాల్సిన అవసరం వుంది. దేశం యొక్క బలం పెరిగే కొద్ది విదేశీ వ్యవహారాలు అత్యంత కీలకం అవుతాయి. అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన భారత్‌కు విదేశీ వ్యవహారాలు మరింత కీలకమయ్యాయి. ఒకవైపు చైనా, ఇంకోవైపు పాకిస్తాన్ మనకు ఇబ్బందులు తెస్తున్న తరుణంలో ఇండియా ఒక ఎలైట్ సర్వస్ వ్యవస్థగా మారాల్సి వుంది.

ఈక్రమంలో ఈయూ ప్రతినిధుల పర్యటన అత్యంత కీలకమై పరిణామం. ఈ పర్యటనలలో తదుపరి చర్యగా.. మనదేశానికి అనుకూలంగా వుంటూ తీవ్రవాదంపై కఠిన చర్యలు చేపట్టాలన్న మన వాదనను బలంగా సమర్థిస్తున్న జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాల ప్రతినిధులను కూడా భారత్‌కు ఆహ్వానించి, కశ్మీర్‌లో తాజా పరిస్థితులను వారికి కళ్ళకు కట్టినట్లు చూపించడం అవసరం. ముందుగా మనకు అనుకూలమైన దేశాల ప్రతినిధులనే కశ్మీర్‌ సందర్శనకు అనుమతించాలన్న నిర్ణయం వందశాతం సమర్థనీయమే. ఎందుకంటే మన శతృవులకు మన ఇల్లు చూపలేం కదా ?

ఈయూ ప్రతినిధులు కశ్మీర్‌లో పర్యటిస్తున్న సమయంలో పాకిస్తాన్ గనక బోర్డర్‌లో కాల్పులకు తెగబడితే.. ఆ దేశ నిజస్వరూపం ప్రపంచానికి ఖచ్చితంగా తెలిసిపోతుంది. అలాంటి పిచ్చి పనులకు పాక్ తెగబడదనే అనుకుందాం. మొత్తానికి మంగళవారం సాయంత్రం కల్లా కశ్మీర్ స్థితిగతులు ప్రపంచానికి తెలిసిపోతాయి. భారత్ వాదనకు అంతర్జాతీయంగా ఎలాంటి మద్దతు వ్యక్తమవుతుందనే అంశంపై సంకేతాలు కూడ వెలువడతాయి.

ఇక్కడ మనమో విషయాన్ని గుర్తించాలి.. బారత్ దేశం ఎదుగుతున్న క్రమంలో దేశంలోని ఇతర సర్వీసుల కంటే ఫారిన్ అఫైర్స్ సర్వీస్ (IFS) అత్యంత కీలకమని మనం తెలుసుకోవాలి. గతంలో ఐఎఎస్, ఐపీఎస్‌లే అత్యంత కీలకమని మనం భావించే వాళ్ళం. కానీ ఇపుడు పరిస్థితి మారింది. భారత విధానాలు ప్రపంచానికి అత్యంత వేగంగా తెలియాల్సిన అవసరం వుంది. అందుకే ఐఎఫ్ఎస్ సర్వీసును మరింత మందికి అందుబాటులోకి తేవాలి. ఫారిన్ సర్వీసులో ఎంత ఎక్కువ మంది ప్రతిభాశాలురు చేరితే.. భారత ప్రతిష్ట విదేశాలలో అంత ఎక్కువగా ఇనుమడిస్తుంది.