‘పీవీ తెలంగాణ ఠీవి’ అని అసెంబ్లీ సాక్షిగా కొనియాడారు ముఖ్యమంత్రి కేసీఆర్. పీవీ నరసింహారావు భారతదేశ ప్రతిష్టను ఇనుమడింపజేశారని… అనేక ఆర్థిక, సామాజిక సంస్కరణలను ప్రవేశపెట్టి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారని గుర్తు చేశారు. మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ పీవీ ఈ దేశానికి చేసిన సేవలను కీర్తించారు. మంత్రి కేటీఆర్, సీఎల్పీ నేత కేసీఆర్ మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తదితరులు కూడా తీర్మానంపై మాట్లాడారు. భారతరత్నకు పీవీ అన్ని విధాలా అర్హుడని తెలిపారు. ఆయనకు భారతరత్న ఇవ్వాల్సిందేనని చెప్పారు. ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే, ఈ తీర్మానంపై జరిగిన చర్చకు ఎంఐఎం దూరంగా ఉండటం గమనార్హం. చర్చకు ఎంఐఎం ఎమ్మెల్యేలంతా గైర్హాజరయ్యారు.