ఆంధ్ర ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో టెన్షన్… ఏం జరుగుతోంది?

చత్తీస్ ఘడ్ – ఒడిశా రాష్ట్రాల్లో జరుగుతున్న వరుస ఎన్ కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులు తలదాచుకునేందుకు ఆంధ్ర ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లోకి వస్తున్నారా..? ఇదే సమయంలో ఏవోబీలో భారీ అలజడి సృష్టించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారా..? ఇందులో భాగంగా యాక్షన్ టీములు కూడా రంగంలోకి దిగాయా..? అంటే ఇంటెలిజెన్స్ వర్గాలు ఔననే అంటున్నాయి. ఈ నేపథ్యంలో వెంటనే అప్రమత్తం అయిన పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం విశాఖపట్నం జిల్లా ముంచంగిపుట్టు […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:58 pm, Mon, 16 September 19
ఆంధ్ర ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో టెన్షన్... ఏం జరుగుతోంది?

చత్తీస్ ఘడ్ – ఒడిశా రాష్ట్రాల్లో జరుగుతున్న వరుస ఎన్ కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులు తలదాచుకునేందుకు ఆంధ్ర ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లోకి వస్తున్నారా..? ఇదే సమయంలో ఏవోబీలో భారీ అలజడి సృష్టించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారా..? ఇందులో భాగంగా యాక్షన్ టీములు కూడా రంగంలోకి దిగాయా..? అంటే ఇంటెలిజెన్స్ వర్గాలు ఔననే అంటున్నాయి. ఈ నేపథ్యంలో వెంటనే అప్రమత్తం అయిన పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం విశాఖపట్నం జిల్లా ముంచంగిపుట్టు – పెదబయలు మండల కేంద్రాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా జోలాపుట్టు కుమడ డుడుమ మార్గాల్లో ప్రయాణించే వాహనాలపై ప్రత్యేక దృష్టిసారించారు. ప్రతీ వాహనాన్ని ఆపి – బ్యాగులు తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తులను   ప్రశ్నించి విడిచిపెట్టారు. ముంచంగిపుట్టు నుంచి కుభజంగి జంక్షన్ వరుకు బాంబు స్క్వాడ్ తో కల్వర్టులు – వంతెనల  కింద తనిఖీలు చేశారు.

కొన్ని నెలలుగా ఒడిశా – ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో మావోయిస్టులు పోలీసుల మధ్య తరచూ ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే… ఆంధ్రా-ఒడిసా సరిహద్దుల్లో మావోయిస్టు ఉద్యమానికి గట్టి దెబ్బ తగిలింది. ఆ ఉద్యమాన్ని విడిచిపెట్టి నలుగురు నక్సల్స్‌ బయటకు వచ్చారు. ఏవోబీలో పార్టీని విస్తరించడంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ, ముఖ్యమైన మిలిటరీ ఆపరేషన్లకు వ్యూహాలు రచించిన గాలికొండ ఏరియా కమిటీ కార్యదర్శి బోడ అంజయ్య అలియాస్‌ నవీన్‌ కూడా వీరిలో ఉన్నారు. ఓ ప్రేమ వ్యవహారంలో పార్టీని ధిక్కరించి, కమిటీలోని మహిళా మావోయిస్టుతో కలిసి ఆయన బయటకొచ్చినట్టు పోలీసు వర్గాల సమాచారం.

ఈ వర్గాల కథనం ప్రకారం, గూడెంకొత్తవీధి మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతం నుంచి నవీన్‌ నేతృత్వంలో గాలికొండ ఏరియా కమిటీ సభ్యురాలు జీవని, పాంగి తులసో అలియాస్‌ లింబే, వంతల మంగ్లీ అలియాస్‌ జానకి బయటకు వచ్చేశారు. నవీన్‌ 16 ఏళ్లుగా ఉద్యమంలో ఉన్నాడు. ఆయన స్వగ్రామం తెలంగాణలోని నల్లగొండజిల్లా తిరుమలగిరి. నల్లమల అటవీ ప్రాంతంలో చాలాకాలం పనిచేశాడు. 2008లో ఆయనను ఏవోబీకి బదిలీ చేశారు. ఈ క్రమంలో జీవనితో ప్రేమలో పడ్డాడు. జీవని స్వగ్రామం విశాఖ జిల్లా జీకే వీధి మండలం గొర్రెలమెట్ట. వీరి ప్రేమ వ్యవహారం విషయమై మావోయిస్టు పార్టీ వారిని పలుమార్లు హెచ్చరించింది. ఇదే విషయమై ఈనెల రెండో తేదీన అటవీ ప్రాంతంలో ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం నుంచే నవీన్‌, జీవని తుపాకులు, కిట్‌ బ్యాగులు వదిలేసి రూ.50వేలు తీసుకొని ఉద్యమం నుంచి బయటికొచ్చేశారు. ఈ నలుగురూ విశాఖ పోలీసుల వద్ద లొంగిపోయారు.

ఈ క్రమంలో ఆంధ్ర – ఒడిశా సరిహద్దు (ఏవోబీ) వైపు మావో యిస్టులు వచ్చి తలదాచుకుంటున్నారనే ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. దీనికి తోడుగా మావోయిస్టు యాక్షన్ టీంలు  కూడా రంగంలోకి దిగినట్టు  అనుమానిస్తున్న పోలీసులు ఏవోబీలో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ప్రధానంగా పెదబయలు మండలంలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లే పన్నెడ జంక్షన్ కొత్తాపుట్టు జంక్షన్లలో తనిఖీలు నిర్వహించారు. దీంతో ఏవోబీలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆయా ప్రాంతాల్లోని ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

ఒక్కసారిగా పోలీసుల తనిఖీలో ప్రజలు వణికిపోతున్నారు. ఇదిలా ఉండగా.. ఖమ్మం – వరంగల్ జిల్లాల్లో గోదావరి తీరం వెంట కూడా మావోయిస్టులు సంచరిస్తున్నట్లు అనుమానించిన పోలీసులు ఆ దిశగా కూంబింగ్ ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా.. నల్లమలలో యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వొద్దని – ప్రజలు ఉద్యమించాలని కూడా మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కూడా మావోయిస్టుల కదలికలను పసిగట్టేందుకు పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. ఇంటెలిజెన్స్ వర్గాలు ఎప్పటికప్పుడు పోలీసు బలగాలను అప్రమత్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏవోబీలో భయానక వాతావరణం నెలకొంది.