Kagiso Rabada : బయో బబుల్‌లో ఉండటమంటే విలాసవంతమైన బందీఖానాలో గడపటం లాంటిదని సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్ కాగిసొ రబాడా అన్నాడు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ తాను సురక్షితంగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ కొవిడ్ ప్రపంచంలో ఎన్నో మిలియన్ల మంది తమ జీవనోపాధిని కోల్పోతుంటే తాను ఇంకా సురక్షితంగా ఉండటం అదృష్టమేనని పేర్కొన్నాడు.
ఐపీఎల్ కోసం బుడగలో ఉన్న ఈ ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు.. శుక్రవారం నుంచి ఇంగ్లాండ్‌తో జరగబోయే సిరీస్ కోసం మళ్లీ బయోబబుల్‌లోకి ప్రవేశించాడు. ఈ నేపథ్యంలోనే రబాడా తన ట్విట్టర్‌లో ఈ పోస్టులను పెట్టాడు. బుడగలో ఉండటం కొంచెం కష్టమే అంటూ రాసుకొచ్చాడు. ఎవరితోనూ మాట్లాడలేము. మన స్వేచ్ఛను కోల్పోతాము. ఇందులో ఉండటమంటే ఓ విలాసవంతమైన జైలులో గడపటమే అని పేర్కొన్నాడు. కానీ ఇక్కడ ఉండటం అదృష్టమనే భావించాలి అని పేర్కొన్నాడు. చాలా మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు… ప్రస్తుతం ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ మేము ఆటలు ఆడుతూ డబ్బులు సంపాదించుకోగల్గుతున్నాము అంటూ తెలిపాడు. అంతేకాదు తాము ఉన్నటువంటి పరిస్థితి.. సమాన్య ప్రజలు జీవిస్తున్న పరిస్తితి పోల్చుకున్నాడు. తాము మరీ దారుణమైన పరిస్థితుల్లో ఉండట్లేదని. గొప్ప హోటల్లో బస చేస్తున్నామని… పౌష్టికాహారం తింటున్నామని.. కాకపోతే నాలుగు గోడల మధ్యనే ఉండటం కొంచెం కష్టంగా ఉందని తెలిపాడు. ఇది మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది అని కాగిసొ రబాడా పేర్కొన్నాడు.
ఈ ఐపీఎల్లో రబాడా.. అత్యధికంగా 30 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచి పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పోలిస్తే ఐపీఎల్ చాలా సరదాగా ఉంటుందని అంటున్నాడు.