GHMC Election results 2020: పాతబస్తీలో తగ్గిన పోలింగ్.. అంతుచిక్కని ఓటర్ నాడీ..

|

Dec 04, 2020 | 7:19 AM

హైదరాబాద్ నగరంలో ఓటరు తీరు మారలేదు. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహానగరంలో ఓటింగ్ శాతంలో వెనుకబడుతోంది. పోలింగ్ రోజు సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు తప్పా.. బ్యాలెట్ బాక్సులో ఓటు వేసేందుకు మాత్రం గడప దాటలేకపోతున్నారు. పోలింగ్ సమయంలో ముందుండే పాతబస్తీ కూడా ఈసారి అనుకున్నంతగా ఓటింగ్ శాతం పెరగకపోవడంతో ఆందోళన కలిగిస్తోంది.

GHMC Election results 2020: పాతబస్తీలో తగ్గిన పోలింగ్.. అంతుచిక్కని ఓటర్ నాడీ..
Follow us on

GHMC Election results 2020: హైదరాబాద్ నగరంలో ఓటరు తీరు మారలేదు. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహానగరంలో ఓటింగ్ శాతంలో వెనుకబడుతోంది. పోలింగ్ రోజు సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు తప్పా.. బ్యాలెట్ బాక్సులో ఓటు వేసేందుకు మాత్రం గడప దాటలేకపోతున్నారు. పోలింగ్ సమయంలో ముందుండే పాతబస్తీ కూడా ఈసారి అనుకున్నంతగా ఓటింగ్ శాతం పెరగకపోవడంతో ఆందోళన కలిగిస్తోంది.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన పోలింగ్‌లో రాజకీయ పార్టీలపై పాతబస్తీ ఓటరు అనాసక్తి కనబరిచాడు. ఉదయం నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మందకొడిగానే సాగిన ఓటింగ్‌ ఆ తరువాత కొంత వేగవంతమైనప్పటికీ ఓటింగ్‌ శాతం అనుకున్నంతగా నమోదు కాలేదు. పాతబస్తీ వాసులు ఓటింగ్‌కు దూరంగా ఉండి నాయకులపై తమకున్న ఉన్న అసంతృప్తిని పరోక్షంగా వ్యక్తం చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పాతబస్తీ ఓటరు ఈ సారి ఏ రాజకీయపార్టీపై కూడా పెద్దగా మొగ్గుచూపలేదు. ఎవరు గెలిచినా తమకు ఒరిగేదేమి లేదనే భావన పాతబస్తీ ఓటర్ల నోట వినబడింది. గెలిచిన వారు ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం, ఉన్నవారు తమ అనునాయులకే పరిమితం కావడం, ఏదైనా పనికోసం వెళ్లిన స్థానిక ప్రజలకు అపాయింట్‌మెంట్లు ఇవ్వకపోవడం, కొంత మంది పనులు చేయడానికి డబ్బులు ఆశించడం తదితర వాటితో పాతబస్తీ ఓటర్లు నాయకులపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

అంతేకాదు, ఇటీవల వచ్చిన వరదలు కూడా రాజకీయ పార్టీల కొంపముంచినట్లు రాజకీయవేత్తలు భావిస్తున్నారు. ఇటీవల భారీ వర్షాలతో పాతబస్తీ వరదలతో మునిగిపోయింది. రికార్డు స్థాయి వరదలతో లోతట్ట ప్రాంతాల ప్రజలు తీవ్ర అవస్థల పాలయ్యారు. పాతబస్తీలోని ఏ ప్రాంతవాసులను కదిలించినా వరదలొచ్చి, తాము కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ పట్టించుకోలేదని అలాంటప్పుడు మేమెందుకు వెళ్లి వారికి ఓటు వేయాలని బాహటంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాతబస్తీ ఓటర్లు ఎప్పుడు ఒకే పార్టీకి అనుకూలంగా ఉంటారన్న భావన ఈసారి పోలింగ్ శాతాన్ని బట్టి చూస్తూ పోయింది. ఇతర ప్రాంతాల్లో ఎలా ఉన్నా ఈ ప్రాంతాల్లో మాత్రం ఓటింగ్‌ వార్‌ వన్‌సైడ్‌ అన్నట్లుగా అధిక శాతం ఓటింగ్‌ నమోదవుతుంది. అన్ని పార్టీలు ఒకే కోవకు చెందినవనే భావన మంగళవారం నాటి పోలింగ్‌తో అవగతమవుతోంది. ఇదిలా ఉండగా గతంలో ఎన్నడూ లేని విధంగా పాతబస్తీలో ఓటింగ్‌ శాతం తగ్గడంతో పలు రాజకీయ పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా చార్మినార్‌, బహుదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, నాంపల్లి, కార్వాన్‌ నియోజకవర్గాల్లో ఉన్న దాదాపు డివిజన్లు ఎంఐఎంకు కంచుకోటగా ఉన్నాయి. కానీ ఈసారి ఓటర్లు ఓటు వేసేందుకు రాకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. కొన్ని డివిజన్లలో ఓ రాజకీయ పార్టీ ఆటోలను కూడా ఏర్పాటు చేసినప్పటికీ ఓటర్లు విముఖత చూపడం ఇందుకు నిదర్శంగా నిలుస్తోంది.

మరోవైపు, ఓటర్లను కరోనా భయం వెంటాడిందని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నట్లు వస్తున్న వార్తలు, నగరంలో కూడా కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చే అవకాశాలు లేకపోలేదనే హెచ్చరికల నేపథ్యంలో నగర ఓటర్లు పోలింగ్‌ బూత్‌లకు వచ్చేందుకు సాహసించలేదు. అనవసరంగా రిస్క్‌ తీసుకోవడం ఎందుకని ఓటింగ్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.