కరోనా మిగిల్చిన కడగండ్లు.. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కరువు.. కుటంబపోషణకు తోడు ఆనారోగ్య సమస్యలు.. యువకుడి ఆత్మహత్య

|

Nov 20, 2020 | 2:44 PM

మాయదారి కరోనా జనానికి కడగండ్లు మిగులుస్తోంది. లాక్ డౌన్ దెబ్బకు ఉపాధి కోల్పోయిన కుటుంబాలు పూట గడవటమే కష్టంగా మారింది.

కరోనా మిగిల్చిన కడగండ్లు.. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కరువు.. కుటంబపోషణకు తోడు ఆనారోగ్య సమస్యలు.. యువకుడి ఆత్మహత్య
Follow us on

మాయదారి కరోనా జనానికి కడగండ్లు మిగులుస్తోంది. లాక్ డౌన్ దెబ్బకు ఉపాధి కోల్పోయిన కుటుంబాలు పూట గడవటమే కష్టంగా మారింది. మరోవైపు కుటుంబపోషణ భారంగా మారి తనువుచాలిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటననే నల్లగొండ జిల్లాలో వెలుగుచూసింది.

ప్రేమించిన యువతిని పెళ్లిచేసుకుని చిన్న ఉద్యోగంతో సాఫీగా సాగిపోతున్న ఓ యువకుని కుటుంబంపై కరోనా ప్రభావం పడింది. లాక్ డౌన్ కారణంగా ఉన్న ఉద్యోగం పోయింది. చిన్న కొలువుతో.. చుట్టూ చేరిన సమస్యలతో సతమతమై బలవన్మరణానికి పాల్పడ్డాడు ఆ యువకుడు. మునుగోడు మండలం పలిమెల గ్రామానికి చెందిన నాతి క్రాంతి (27) హైదరాబాద్‌లో పుడ్‌ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఇదే క్రమంలో బ్యూటీషియన్‌గా పనిచేసే నల్గొండకు చెందిన రమణి(23)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు పెద్దల ఒప్పించి 2018లో ప్రేమవివాహం చేసుకున్నారు. వీరికి ఏడాది వయసున్న పాప కూడా ఉంది. భార్య ప్రస్తుతం 9 నెలల గర్భిణి.

అయితే, కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోడంతో ఆరు నెలల కిందట స్వగ్రామానికి చేరుకున్నారు. చాలా రోజులు ఖాళీగా ఉండటంతో పూట గడవటమే కష్టమైంది. ఇటీవల చౌటుప్పల్‌లోని ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అనారోగ్య సమస్యలతో అక్కడ మానేసి చిట్యాలలో మెడికల్‌ షాపులో పనికి కుదిరారు. భార్యను దీపావళి పండగకు పుట్టింటికి పంపారు. నెలలు నిండటంతో కాన్పు కోసం భార్య వైద్యపరీక్షలకు వెళ్లింది. ఆమెకు రక్తహీనత ఉండటమే కాకుండా కడుపులోని శిశువుకు అనారోగ్య సమస్యలున్నాయని.. వెంటనే చికిత్స అవసరమని వైద్యులు సూచించారు. ఇదే విషయాన్ని భర్తకు ఫోన్‌లో చెప్పి భార్య డబ్బులు అడిగినట్లు బంధువులు తెలిపారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగు మందు తాగి ఆత్మహత్మయత్నం చేశారు. ఈ విషయాన్ని స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం నల్గొండ తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలొదిలాడు. అయితే, ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు రాకపోవడంతో ఎలాంటి కేసు నమోదు చేయలేదని మునుగోడు పోలీసులు తెలిపారు.