ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడికి విశ్వప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పలు దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్ తుది దశ ట్రయల్స్ పూర్తి చేసుకుంటున్నాయి. దేశవ్యాప్త రోగనిరోధకత కార్యక్రమంలో భాగంగా చైనా తయారు చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ ‘కరోనావాక్’ ను ఉపయోగించాలని యోచిస్తున్నట్లు బ్రెజిల్ ప్రభుత్వం తెలిపింది.
చైనా కంపెనీ సినోవాక్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనావాక్ అనే వ్యాక్సిన్ 46 మిలియన్ మోతాదులను కొనుగోలు చేయడానికి ఫెడరల్ ప్రభుత్వం అంగీకరించిందని సావో పాలో గవర్నర్ జోవో డోరియా ధృవీకరించారు. దేశవ్యాప్తంగా రోగనిరోధకత కార్యక్రమం జనవరి 2021 లో ప్రారంభమవుతుందని, కొవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడటం ప్రపంచంలో ఇదే మొదటిదని ఆయన అన్నారు. ఇంగ్లాండ్ కు చెందిన ఆక్సఫర్డ్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను కూడా వినియోగించాలని ఆ దేశం యోచిస్తోంది.
అమెరికా, ఇండియా తరువాత కరోనా కేసుల సంఖ్యలో బ్రెజిల్ మూడవ స్థానంలో ఉంది. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం గణాంకాల ప్రకారం, దేశం దాదాపు 5.3 మిలియన్ల కేసులు నమోదు కాగా మరణాల సంఖ్యలో యుఎస్ తరువాత రెండవ స్థానంలో ఉంది.
చైనీస్ వ్యాక్సిన్‌ను సావో పాలో రాష్ట్ర పరిశోధనా కేంద్రం బుటాంటన్ ఇన్సస్టిట్యూట్ పరీక్షిస్తోంది. చివరి దశ క్లినికల్ ట్రయల్‌లో రెండు-మోతాదు చైనీస్ టీకా సురక్షితంగా ఉన్నట్లు ఇన్సస్టిట్యూట్ ముందే ప్రకటించింది. ఇక మూడో దశ ట్రయల్స్ పూర్తి అయ్యాక సత్ఫలితాలను బట్టి వినియోగించాలని బ్రెజిల్ ప్రభుత్వం భావిస్తోంది.