Bowenpally Kidnap Case: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో కొత్త కోణం.. భార్గవ్ రామ్ కుడిభుజం, మాస్టర్ మైండ్ అతడే..!

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో తవ్వేకొద్ది కొత్త విషయాలు వెలుగలోకి వస్తున్నాయి. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న ఆమె భర్త భార్గవ్‌రామ్‌ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపుచర్యలు చేపట్టారు.

  • Balaraju Goud
  • Publish Date - 8:11 pm, Fri, 8 January 21
Bowenpally Kidnap Case: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో కొత్త కోణం.. భార్గవ్ రామ్ కుడిభుజం, మాస్టర్ మైండ్ అతడే..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఏపీ మాజీమంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ జైలుపాలయ్యారు. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న ఆమె భర్త భార్గవ్‌రామ్‌ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపుచర్యలు చేపట్టారు.

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో తవ్వేకొద్ది కొత్త విషయాలు వెలుగలోకి వస్తున్నాయి. కిడ్నాప్ ఉదంతంలో మరో నిందితుడు మాదాల శ్రీను అలియాస్ గుంటూరు శ్రీను కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. గుంటూరుకు చెందిన మాదాల శ్రీను.. అఖిల ప్రియ భర్త భార్గవ్‌ రామ్‌కు ప్రధాన అనుచరుడని సమాచారం. అఖిల ప్రియ, భార్గవ్ రామ్ వేసిన కిడ్నాపింగ్ ప్లాన్‌ను మాదాల శ్రీను దగ్గరుండి అమలు చేశాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ప్రవీణ్ రావును కిడ్నాప్‌ చేయడానికి మాదాల శ్రీను ఆరు నెలల కిందట స్కెచ్ వేశారని తెలుస్తోంది. ఇందుకోసం పలుమార్లు రెక్కీ కూడా నిర్వహించినట్లు అనుమానిస్తున్నారు. రెక్కీ సమయంలో సీసీటీవీల కంట పడకుండా అతను పలు ముందుజాగ్రత్తలు తీసకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.

కిడ్నాప్ వ్యవహారంలో కీలకంగా మారిన మాదాల శ్రీను పాత్రతో పాటు, అతని గత చరిత్ర గురించి టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు. గుంటూరు శ్రీను అసలు పేరు మాదాల శ్రీనివాస్ చౌదరి. గుంటూరు డొంకరోడ్డు ప్రాంతానికి చెందిన శ్రీను ఇంజనీర్ మద్యలోనే అపేసి గుంటూరు శంకర్ విలాస్ సెంటర్‌లో మందాకినీ టీస్టాల్ నడిపేవాడు. ఇందులో సంపాదన అంతగా లేకపోవడంతో ముగ్గురు స్నేహితులతో కలిసి సివిల్ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీని ప్రారంభించాడు. ఇదే క్రమంలో భూమానాగిరెడ్డికి అప్పట్లో గుంటూరు విద్యానగర్‌లో ఇల్లు ఇతని ఆఫీస్ ఈ సివిల్ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ ద్వారానే నిర్మించి ఇచ్చాడు. ఇలా భూమా ఫ్యామిలీకి మాదాల శ్రీను దగ్గరయ్యాడు. ఇక, భూమా నాగిరెడ్డి మరణం తర్వాత భూమా కుటుంబానికి మరింత క్లోజ్ అయ్యాడు. అఖిలప్రియ మంత్రి అయిన తర్వాత ఆమెకు అనుచరుడిగా మారిపోయాడు.

కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక సమయంలో మాదాల శ్రీను.. అఖిల ప్రియ తరఫున అన్నీ తానై వ్యవహరించాడు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలను మొదలుకుని.. భూమా అఖిల ప్రియ, అప్పటి నంద్యాల ఉప ఎన్నిక టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి షెడ్యూల్‌ను సైతం మాదాల శ్రీను పర్యవేక్షించేవాడని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. ఈ ఉప ఎన్నిక సందర్భంగా.. మాదాల శ్రీనునును భూమా అఖిల ప్రియ ప్రశంసలు సైతం అందుకున్నారు.
మాదాల శ్రీనునును భూమా అఖిల ప్రియ ప్రశంసలు…

అంతేకాదు, భూమా కుటుంబసభ్యలు భూవివాల్లోనూ చేదోడు వాదోడుగా ఎదిగాడు మాదాల శ్రీను… 2019 ఎన్నికల్లో శిల్పా, భూమా వర్గానికి జరిగిన రాళ్ల దాడిలో కూడా గుంటూరు శ్రీను కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. అప్పటి రాళ్ల దాడి కోసం గుంటూరు కోబాల్ట్ కాలనీ నుంచి 30మంది యువకులను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే, అతని పేరు గుంటూరు శ్రీను కాదని ఇకపై భూమా శ్రీనుగా మారిపోయాడని ప్రశంసించారు అఖిలప్రియ.. భార్గవ్ రామ్‌తో అఖిలప్రియ పెళ్లైన తర్వాత అతనికి అత్యంత నమ్మకమైన ఫాలోవర్‌గా మారిపోయారు గుంటూరు శ్రీను. విజయా డైరీ యజమాని రామసుబ్బారెడ్డిన బెదిరించిన కేసులోనూ గుంటూరు శ్రీను నిందితుడుగా ఉన్నాడు. ఏవీ సుబ్బారెడ్డిని హతమార్చేందుకు సుపారీ గ్యాంగ్ కు యాభై లక్షలు ఇచ్చిన కేసులోనూ గుంటూరు శ్రీను నిందితుడుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి 2020 మే 21న అరెస్టైన గుంటూరు శ్రీను.. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు.

తాజాగా బోయిన్‌పల్లి కిడ్నాప్ వ్యవహారంతో గుంటూరు శ్రీను పేరు మరోసారి హాట్ టాఫిక్‌గా మారింది. మరోవైపు కిడ్నాప్ కేసును సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే మాజీ మంత్రి అఖిలప్రియను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇక పరారీలో ఉన్న ఆమె భర్తకోసం పోలీసులు జల్లెడపడుతున్నారు. ఇంతేకాదు. ఈ కేసులో ప్రత్యక్షంగా పాల్గొన్న అసలు పాత్రధారుల కోసం వేట మొదలు పెట్టారు.