ఏపీ సీఎం వైఎస్ జగన్ పంచాయతీ రాజ్ వ్యవస్థలో మార్పులు చేశారు. అయితే పంచాయతీలో ఇప్పటికే ఓ వ్యవస్థ నడుస్తోంది. గతంలో ఎన్నుకోబడిన వార్డు మెంబర్లు, అధికారులు ఉన్నారు. అధికార యంత్రాంగం ఇప్పటికే ఉన్నా.. సచివాలయం పేరుతో ఉద్యోగాలు ఇచ్చారని టీడీపీ ఆరోపిస్తోంది. ఇప్పటికే ఉన్నవాళ్లు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. ఇక కొత్తవారు ఏం చేస్తారని చంద్రబాబు నిలదీస్తున్నారు. సీఎం జగన్ ప్రారంభించిన గ్రామ సచివాలయాలపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థపై బిగ్ డిబెట్ టీవీ9 స్టూడియోలో జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ నేత జోగి రమేష్.. తెలుగుదేశం పార్టీ పై ఆరోపణలు చేశారు. వ్యవస్థలో అవినీతి లేకుండా పారదర్శకంగా ప్రజల దగ్గరకు వెళ్లి పనిచేసే విధంగా తీసుకువెళ్లాలనే ఆశయంతో వాలంటరీ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. అంతేకాదు పలు జిల్లాలు, గ్రామాల్లో చూసుకుంటే వందల సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, ఎల్లో మీడియా ప్రతినిధుల కుటుంబ సభ్యులే సచివాలయ ఉద్యోగాలు సాధించారు. వీరంతా కేవలం ప్రతిభతోనే జీవితాల్లో స్థిరపడ్డారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ టీడీపీ నేతలు, ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారానికి ఈ ఫలితాలు సమాధానం చెబుతున్నాయన్నారు.