కెనడాలో శవమై కనిపించిన బెలూచిస్తాన్ యాక్టివిస్ట్ కరీమా బెలూచ్ , పాకిస్థానీసైన్యమే హత్య చేసిందా ? మిస్టరీ !

| Edited By: Anil kumar poka

Dec 22, 2020 | 11:30 AM

బెలూచిస్తాన్ లో అత్యంత పాపులర్ అయిన యాక్టివిస్ట్ కరీమా బెలూచ్ టొరంటో (కెనడా) లో శవమై కనిపించింది. తమ రాష్ట్రంలో పాకిస్థానీ ఆర్మీ, ప్రభుత్వం జరుపుతున్న అకృత్యాలు, అరాచకాలపై గళమెత్తిన ఈమె మృతి సంచలనం కలిగించింది.

కెనడాలో శవమై కనిపించిన బెలూచిస్తాన్ యాక్టివిస్ట్ కరీమా బెలూచ్ , పాకిస్థానీసైన్యమే హత్య చేసిందా ? మిస్టరీ !
Follow us on

బెలూచిస్తాన్ లో అత్యంత పాపులర్ అయిన యాక్టివిస్ట్ కరీమా బెలూచ్ టొరంటో (కెనడా) లో శవమై కనిపించింది. తమ రాష్ట్రంలో పాకిస్థానీ ఆర్మీ, ప్రభుత్వం జరుపుతున్న అకృత్యాలు, అరాచకాలపై గళమెత్తిన ఈమె మృతి సంచలనం కలిగించింది. గత ఆదివారం నుంచి ఈమె కనిపించకుండా పోయింది. కరీమాను ప్రపంచంలో అత్యంత ప్రభావ శీలురైన, స్ఫూర్తిమంతులైన 100 మందిలో ఒకరిగా 2016 లో బీబీసీ పేర్కొంది. ఈ నెల 20  న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కరీమా చివరిసారిగా కనిపించిందట.. ఈమె ఆచూకీ తెలియజేయాల్సిందిగా టొరంటో పోలీసులు స్థానిక ప్రజలను కోరారు. అయితే కరీమా మృతదేహాన్ని కనుగొన్నట్టు ఆమె కుటుంబం నిర్ధారించింది. లోగడ ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభలో ఈమె బెలూచిస్థాన్ లో పాక్ అకృత్యాలను ప్రస్తావించింది. పైగా 2019 మే నెలలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో..తమ రాష్ట్ర వనరులను పాకిస్థానీ సైన్యం దోచుకుంటోందని, మానవ హక్కుల ఉల్లంఘన యధేచ్చగా జరుగుతోందని ఆరోపించింది. కరీమా మృతి తీవ్రమైన విషయమని బెలూచిస్థాన్ పోస్ట్ వ్యాఖ్యానించింది.

ముఖ్యంగా ఈ రాష్ట్రంలో తమ వ్యతిరేకులను పాక్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అణచివేస్తోందని, కిడ్నాప్, హత్యలకు పాల్పడుతోందన్న ఆరోపణలుఉన్నాయి. గతంలో కూడా ఈ రాష్ట్రానికి చెందిన జర్నలిస్ట్ సాజిద్ హుసేన్ స్వీడన్ లో శవమై కనిపించాడు. బెలూచిస్థాన్ కు చెందిన వేలాది మంది యాక్టివిస్టులు పాక్ సైన్యానికి, సర్కార్ కి భయపడి కెనడా వంటి దేశాల్లో శరణార్థులుగా మారుతున్నారు.

2016 లో కరీమా బెలూచిస్థాన్ నుంచి పారిపోయి కెనడాలో శరణార్థిగా ఆశ్రయం పొందింది. టొరొంటోలోని ఓ సరస్సులో ఈమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నట్టు తెలుస్తోంది. ఈమె భర్త హమాల్ హైదర్, సోదరుడు ఈమె డెడ్ బాడీని గుర్తించారు. కరీమా మృతిపై టొరంటో పోలీసులు సమగ్ర దర్యాప్తు జరపాలని అక్కడి జర్నలిస్ట్ తారిఖ్ ఫతా కోరారు. ఆమె మరణం వెనుక పాక్ ప్రభుత్వ హస్తం ఉందని ఆయన ఆరోపించారు.

2016 లో కరీమా ప్రధాని మోదీకి ‘రక్షా బంధన్’ మెసేజ్ రికార్డు చేసి పంపారు. బలూచ్ నేషనల్ మూవ్ మెంట్ ఈమె మృతికి 40 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.